పాలకులు ఎలా ఉండాలి?

29 Jul, 2018 01:44 IST|Sakshi

ఇస్లాం వెలుగు

హజ్రత్‌ ఉమర్‌ గొప్పనాయకుడు. బాధ్యతాయుతమైన పాలకుడు. అన్నిటికీ మించి దైవభక్తి పరాయణుడు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడం కోసం ఇతరులపై ఆధారపడకుండా, ఆయన స్వయంగా పర్యటించేవారు. అందులో భాగంగానే ఒకసారి మారువేషం ధరించి గస్తీకి బయలుదేరారు. కొన్ని ప్రాంతాలు పర్యటించిన తరువాత ఒక పూరిగుడిసె దగ్గర ఆగారు. ఆ గుడిసెలో ఒక వృద్ధురాలు నివాసం ఉంటోంది. మారువేషంలో ఉన్న హజ్రత్‌ ఉమర్‌ (ర)ఆమె దగ్గరికి వెళ్ళి  క్షేమ సమాచారాలు విచారించారు. మీ పాలకుడు ఉమర్‌ పాలన ఎలా ఉందని ప్రశ్నించారు.దానికామె, ‘‘ఆ..ఏమి ఉమరో ఏమిటో నాయనా! దేవుడు ఆయనకు మేలుచేయడు.’ అన్నది.‘‘అయ్యయ్యో.. ఏంటి పెద్దమ్మా.. అంతమాట అనేశావు..అసలేం జరిగింది?’’ అని ఆరాతీశారు.‘‘ఏమీలేదు నాయనా.. నేనింత ముసలిదాన్నికదా...నన్నెప్పుడైనా పట్టించుకున్నాడా..?’’అని నిష్టురమాడింది.‘‘అమ్మా..! రాజు అంటే చాలా పనులుంటాయి కదమ్మా..! నువ్వెప్పుడైనా నీసమస్యను రాజుగారి దృష్టికి తీసుకెళ్ళావా?’ అన్నారు ఉమర్‌ .‘‘అదేంటి బాబూ అలా అంటావు? పాలకుడన్నవాడికి తన రాజ్యంలో ఎక్కడ ఏం జరుగుతోంది? ప్రజలు ఎలా ఉన్నారు. వారి కష్టసుఖాలేమిటి? అన్న విషయాలు తెలుసుకోవాలన్న బాధ్యత ఉండదా? పాలకుడంటే సేవకుడు కదా..? నేను వెళ్ళి దేహీ అని అడుక్కోవాలా? ప్రజల బాగోగులు చూడడం, వారి అవసరాలు తీర్చడం పాలకుడి బాధ్యత కాదా?’అని ప్రశ్నించింది.వృద్ధురాలి మాటల్లోని సత్యాన్ని అర్థం చేసుకున్న హజ్రత్‌  ఉమర్‌ కు దుఖంపొంగుకొచ్చింది. ‘ఈ వృద్ధురాలికున్నంత తెలివి కూడా నీకు లేదా ఉమర్‌! రేపు దైవానికి ఏం సమాధానం చెబుతావు?’ అంటూ తనను తాను ప్రశ్నించుకున్నారు ఉమర్‌  తరువాత ఆయన, ‘‘అయితే.. నీ విషయంలో ఉమర్‌ వల్ల జరిగిన నిర్లక్ష్యానికి ఎంతమూల్యం చెల్లించమంటావో చెప్పు. నేను ఆ మూల్యాన్ని నీకు చెల్లించి ఉమర్‌ను కాపాడాలనుకుంటున్నాను’’ అన్నారు.‘‘బాబూ.. ఈ ముసలిదాన్ని ఎందుకు ఆటపట్టిస్తావు? ఉమర్‌ నిర్లక్ష్యానికి నువ్వు మూల్యం చెల్లిస్తావా?.’అంటూ నవ్వింది వృద్ధురాలు.

‘‘లేదమ్మా.. నేను నిజమే చెబుతున్నాను’’ నమ్మబలికారు ఉమర్‌.‘‘సరే, అయితే.. ఇరవై ఐదు వరహాలు ఇవ్వు..’ అన్నది వృద్ధురాలు..అంతలో హజ్రత్‌ అలీ(ర), హజ్రత్‌ ఇబ్నెమస్‌ ఊద్‌ (ర)అటుగా వచ్చారు. వారు హజ్రత్‌  ఉమర్‌ గారిని చూస్తూనే, సలామాలేకుం ఉమర్‌ ఖలీఫా’’ ఈ మాట వింటూనే వృద్ధురాలికి ముచ్చెమటలు పట్టాయి. ఆమె ఆందోళనను గమనించిన హజ్రత్‌  ఉమర్‌ ‘‘అమ్మా.. ఆందోళన చెందకు.అల్లాహ్‌ కరుణించుగాక.. నువ్వు సత్యం మాట్లాడావు’’ అంటూ ఆప్యాయంగా అనునయించారు. ఒక సామ్రాజ్యానికి పాలకుడైనటువంటి హజ్రత్‌ ఉమర్‌(ర)ఎంత నిబద్దతతో, ఎంతబాధ్యతతో, ఎంత జవాబుదారీతనంతో ప్రజలతో వ్యవహరించారో చూడండి. 
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌ 

మరిన్ని వార్తలు