వెన్నునొప్పి తగ్గేదెలా?

28 Jun, 2016 22:47 IST|Sakshi

హోమియో కౌన్సెలింగ్

 

నాకు విపరీతమైన వెన్నునొప్పి వస్తోంది. దీనికి హోమియో ప్రక్రియలో చికిత్స ఉందా? దయచేసి వివరించగలరు. - సుమన్, బాలాపూర్
ఇటీవల వెన్నునొప్పి చాలా ఎక్కువ మందిలో కనిపిస్తున్న చాలా సాధారణమైన  సమస్య. వెన్నుపూసలు అరగడం అన్నది ఒకప్పుడు ఒక వయసు పైబడిన వారిలోనే కనిపించేంది. కానీ మారుతున్న జీవనశైలితో పాటు తాము నిర్వహించే వృత్తుల్లో భాగంగా వెన్నుపై భారం పడేలా పనిచేయడం, ఇతర కారణాల వల్ల ఇది చాలా విస్తృతంగా కనిపిస్తోంది. వెన్నుభాగంలో లిగమెంట్లు, కండరాలు, ఫేసెట్ జాయింట్లు ఒకదానితో ఒకటి అనుసంధానితమై శరీరానికి స్థిరత్వాన్ని ఇస్తాయి. మన రోజువారీ జీవితంలో శారీరకంగా ఎదురయ్యే ఎన్నో సమస్యలను తట్టుకొని నరాల మీద ఎలాంటి ఒత్తిడి పడకుండా కాపాడుకోవడం మన వెన్నెముక ప్రధాన లక్షణం. అధికంగా బరువు ఎత్తడం, దించడం, ఊబకాయం, ఇన్ఫెక్షన్లు, క్యాల్షియమ్ లోపం, విటమిన్ బి12, డీ3 లోపాలు, ఎముకల సాంద్రత తగ్గడం వంటివి వెన్నునొప్పికి కొన్ని కారణాలు. మనం ఏ పని చేయాలన్నా ప్రతిక్షణం మెడ, నడుములోని వెన్నుపూసలు పనిచేయాలి. అందుకే ప్రతి పదిమందిలో ఆరు నుంచి ఎనిమిది మంది వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. వెన్నుపూసలు అరిగినందువల్ల వెన్నునొప్పి వస్తుంది కాబట్టి మందులతో దాన్ని పరిష్కరించలేమనీ, ఆపరేషన్ అవసరమని చాలామందిలో ఒక అపోహ ఉంది. పైగా ఇది జీవితాంతం వేధిస్తూ ఉంటుందని నిస్పృహ కూడా కొందరు పేషెంట్లలో ఉంటుంది. వెన్నునొప్పికి కారణమైన డిస్క్ బల్జ్, డిస్క్ కంప్రెషన్, నరాలమీద ఒత్తిడి పెరగడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. అయితే హోమియోలో ఇలాంటి వెన్ను సంబంధమైన నొప్పులు వచ్చినప్పుడు... ఉదాహరణకు డిస్క్ బల్జ్ వల్ల నరాలమీద ఒత్తిడి పెరిగినప్పుడు తగ్గించడానికి కోబాల్ట్ లాంటి ప్రభావపూర్వకమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ఇక మెడభాగంలో ఉండే వెన్నుపూసలు అరిగినప్పుడు వచ్చే నొప్పిని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు.


మెడ భాగంలో సి1 నుంచి సి7 వరకు ఉండే వెన్ను పూసలను సర్వైకల్ పూసలు అంటారు. ఇవి అరిగినప్పుడు వెన్నుపూసల కీళ్ల మధ్య భాగం తగ్గిపోవడం వల్ల డిస్క్‌బల్జ్ ఏర్పడటం, వెన్నుపూసల మధ్య రాపిడి పెరగడం వంటి కారణాల వల్ల మెడ భాగం నుంచి నొప్పి మొదలై చేతి వేళ్ల వరకు నొప్పి పాకుతూ ఉంటుంది. దాంతో పాటు తిమిర్లు, చేయి మొద్దుబారడం, మెడ ఫ్రీగా తిరగలేకపోవడం, మెడ పట్టివేసినట్లుగా ఉండటం వంటివి చూస్తుంటాం. ఇలాంటి వారికి కూడా యాసిడ్‌ఫాస్ అనే మందు బాగా పనిచేస్తుంది. ఇక మెడ, నడుము, వెన్నెముక నొప్పులకు ఆస్కులస్ హిప్, రస్టాక్స్, బ్రయోనియా ఆల్బ్, కాల్కేరియా ఫ్లోర్, హైపరికం, మహిళల్లో వచ్చే ఇలాంటి సమస్యలకే సిమిసిఫ్యూగా వంటివి చాలా బాగా  పనిచేస్తాయి.    

 

డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి
హైదరాబాద్

 

అది లూకోడెర్మాకు దారితీయదు
పిడియాట్రిక్ కౌన్సెలింగ్

 

మాకు కొద్దిరోజుల క్రితం పాప పుట్టింది. పాపకు తలలో కొంత మేర వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి. ఇదేమైనా భవిష్యత్తులో ల్యూకోడెర్మా వంటి జబ్బుకు దారితీసే ప్రమాదం ఉందా?  - రవికుమార్, నందిగామ
మీ పాపకు ఉన్న కండిషన్ (లోకలైజ్‌డ్ ప్యాచ్ ఆఫ్ వైట్ హెయిర్)ను పోలియోసిస్ అంటారు. సాధారణంగా ఇది తల ముందు భాగంలో అంటే నుదుటిపై భాగంలో కనిపిస్తుంటుంది. అయితే మరెక్కడైనా కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. ఇలా ఉందంటే అది ప్రతీసారీ తప్పనిసరిగా ఏదో రుగ్మతకు సూచిక కానక్కర్లేదు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని జన్యుపరమైన సమస్యలకు సూచన కావచ్చు. చర్మంలోని పిగ్మెంట్‌లలో మార్పుల వల్ల కూడా రావచ్చు. కంట్లో పిగ్మెంట్‌కు సంబంధించిన ఏవైనా మార్పులు ఉన్నాయేమో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పిల్లల్లో ఏదైనా హార్మోనల్ సమస్యలు (అంటే థైరాయిడ్, జననేంద్రియాలకు సంబంధించినవి) ఉండటానికి సూచన కావచ్చు. ఇలాంటి అసోసియేటెడ్ సమస్యలేవీ లేకపోతే మీ పాపకు ఉన్న ఈ లక్షణం... ల్యూకోడెర్మా లాంటి సమస్యకు దారితీసే అవకాశం లేదు. పాపను ఒక్కసారి పీడియాట్రీషియన్‌కు చూపించండి. మీరు రాసినదాన్ని బట్టి పాపకు తక్షణ చికిత్స ఏదీ అవసరం లేదు. మీరూ ఈ విషయంలో ఆందోళన పడకుండా ఒకసారి డాక్టర్‌ను కలిసి ఇతరత్రా ఏ సమస్యలూ లేవని నిర్ధరించుకొని నిశ్చింతగానే ఉండండి.

 

డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్
రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ,  హైదరాబాద్

 

డెంగ్యూ ఫివర్ కౌన్సెలింగ్
ప్లేట్‌లెట్స్ తగ్గితే..?


ఈ మధ్య మా బాబుకు తీవ్రమైన జ్వరం వచ్చింది. రక్తపరీక్షలో ప్లేట్‌లెట్స్ కౌంట్  తగ్గడం చూసి, మా డాక్టర్ డెంగ్యూ కావచ్చని అనుమానించారు. అసలు డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఏమిటి, దాని వివరాలు చెప్పండి.  - సుగుణకుమారి, విశాఖపట్నం
మీ డాక్టర్ చెప్పినట్లుగా ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గడం డెంగ్యూ వ్యాధిలోని ఒక లక్షణం. వైరల్ జ్వరాల్లో డెంగ్యూ కూడా ఒక రకం జ్వరం. ఈ వ్యాధికి ఆర్బోవైరస్ అనే జాతికి చెందిన సూక్ష్మజీవి ఒక కారణం. ఈ వైరస్ అతి సూక్ష్మమైనది. కంటికి కనిపించదు. ఈ వైరస్ ఏడిస్ ఈజిప్టై జాతి దోమ ద్వారా రోగగ్రస్తుల నుంచి ఆరోగ్యవంతులకు సంక్రమిస్తుంది. దీన్ని వ్యాప్తి చేసే దోమను టైగర్ దోమ అని కూడా అంటారు. ఈ దోమలు సాధారణంగా పగటిపూటే కుడుతుంది. దోమ కుట్టిన తర్వాత ఐదు రోజుల నుంచి ఎనిమిది రోజుల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో కొన్ని రకాలు ఉన్నాయి. వాటిలో సాధారణ డెంగ్యూ మామూలుగానే తగ్గిపోతుంది. కానీ డెంగ్యూ హేమరేజిక్ ఫీవర్‌లో అవయవాల్లో అంతర్గత రక్తస్రావం జరిగే ప్రమాదం ఉన్నందున ఇది ప్రమాదకరమైనది.

 
డెంగ్యూవ్యాధి లక్షణాలు :  ఉన్నట్లుండి జ్వరం రావడం  తీవ్రమైన తలనొప్పి, ఇది కూడా ఎక్కువగా నొసటిపై వస్తుంది.  కంటిలో నొప్పి వచ్చి కన్ను కదిలించినప్పుడు నొప్పి ఎక్కువవుతుంది.  కండరాలు, కీళ్లనొప్పి  వికారం  నోరు ఎండిపోయినట్లుగా అవుతుంది. చాలా ఎక్కువగా దాహం వేస్తుంది.

 
ఇక మీ డాక్టర్ చెప్పినట్లుగా ప్లేట్‌లెట్స్ తగ్గడం వల్ల డెంగ్యూ వ్యాధిగా అనుమానిస్తుండవచ్చు. డెంగ్యూ ప్రమాదకరమైనది కాబట్టి సాధారణంగా దాన్ని వ్యాప్తి చేసే దోమలు గుడ్లు పెట్టడానికి అనువైన స్థలాలలో... అంటే ఎయిర్‌కూలర్స్, పూలకుండీల కింద పెట్టే సాసర్లు, ఆరుబయట పారేసి ఉన్న టైర్లు, మూతలు పెట్టని నీరు నిల్వ చేసే తొట్టి వంటివి, నీరు కదలకుండా ఉండే ఫౌంటేన్లు, ఖాళీ డ్రమ్ములు, సన్‌షేడ్‌పై వాన నీరు నిలిచిపోయే బిల్డింగులలో నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీ డాక్టర్ చెప్పిన విధంగా మీ బాబుకు చికిత్స చేయించండి.

 

డాక్టర్ శైలేశ్ ఆర్ సింగీ సీనియర్ హిమటో
ఆంకాలజిస్ట్, బీఎమ్‌టీ స్పెషలిస్ట్, సెంచరీ హాస్సిటల్స్, హైదరాబాద్

 

మరిన్ని వార్తలు