వినికిడి సమస్యలకు వీడ్కోలు...

15 Nov, 2013 23:30 IST|Sakshi

జ్ఞానేంద్రియాలలో కన్ను తర్వాత అంతటి ప్రాధాన్యత చెవిదే. అందుకే చెవులు సరిగా వినిపించకపోతే వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు సరిగా వినిపించకపోవడం అన్నది ఒక సమస్యే కాదు. ఎందుకంటే... బయటకు కనిపించకుండా, కేవలం చెవుల లోపలి భాగాల్లో, చెవిలోకి శబ్దతరంగాలను తీసుకెళ్లే నాళం (కెనాల్) లో, వెంట్రుకల మాటున అమర్చగలిగే అనేక ఉపకరణాలు (హియరింగ్ ఎయిడ్స్) అందుబాటులో ఉన్నాయి. చిన్నప్పుడు, పెద్దయ్యాక వచ్చే అనేక వినికిడి సమస్యలు, కారణాలు, పరిష్కారాలు వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.
 
 కొందరిలో వినికిడి సమస్యలు తల్లి కడుపులో ఉన్నప్పుడు మొదలుకొని ఏ దశలోనైనా రావచ్చు.
 
 పిల్లల్లో వినికిడి సమస్యలకు కారణాలు...
 గర్భవతిగా ఉన్నప్పుడు తల్లికి రుబెల్లా అనే వైరల్‌ఇన్ఫెక్షన్  సోకడం  
 
 బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి తీసుకునే అమైనోగ్లైకోసైట్స్ వంటి మందుల వల్ల
 
 బిడ్డ పుట్టగానే ఏడ్వకపోవడం (బర్త్ అనాక్సియా)
 
 బిడ్డ పుట్టగానే వచ్చే నియోనేటల్ జాండీస్ (కామెర్ల)లో బిలురుబిన్ పాళ్లు ఎక్కువగా ఉండటం  
 
 నెలలు నిండకుండానే బిడ్డపుట్టడం (ప్రీ-మెచ్యూర్ బర్త్)  
 
 పుట్టిన బిడ్డను నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసీయూ) లో 48 గంటలకు పైగా ఉంచి చికిత్స చేయాల్సి రావడం...
 
 మీజిల్స్, మంప్స్, మెనింజైటిస్ వంటి జబ్బులకు గురయ్యే పిల్లల్లో  
 
 మేనరికపు వివాహాలు చేసుకున్న తల్లిదండ్రులకు పుట్టే పిల్లల్లో ...
 
 పెద్దల్లో వచ్చే వినికిడి సమస్యలకు కారణాలు:
 ప్రమాదాలలో తలకు/చెవికి దెబ్బతగిలిన వారిలో  
 

డయాబెటిస్ ఉన్నవారిలో  
 
 రక్తపోటు ఉన్నవారిలో అత్యంత సన్నటి రక్తనాళాలు దెబ్బతినడం వల్ల  
 
 వైరల్ ఇన్ఫెక్షన్స్ కారణంగా లోపలి చెవి దెబ్బతిన్న వారిలో (ఉదా: లాబ్రింథైటిస్)  
 
 కొన్ని మందులు వాడిన వారిలో వాటి దుష్ర్పభావంతో (ఉదా: అమికాసిస్ అనే మందును కొద్దిరోజులు వాడిన వారిలో)
 
 కొన్నిరకాల జబ్బులు ఉన్నవారికి మూత్రవిసర్జన ఎక్కువగా అయ్యేందుకు ఇచ్చే మందుల (డై-యూరెటిక్స్)తో
 
 మధ్య చెవి సమస్యలు ఉన్నవారిలో  
 
 మధ్య చెవిలో వినికిడికి ఉపయోగపడే మూడు ఎముకల్లో చివరిదైన స్టెపీస్ స్పందించకుండా ఫిక్స్ అయ్యే సమస్య అయిన ఆటో స్ల్కిరోసిస్  ఉన్నవారిలో.
 
 వయసు పైబడిన వారిలో...
 చాలామందిలో వయసు పైబడ్డ తర్వాత వినికిడి శక్తి తగ్గడం సాధారణం. విదేశాల్లో సాధారణంగా 60, 65 ఏళ్ల వయసు తర్వాత వచ్చే ఈ సమస్య మన దేశంలో మాత్రం చాలా త్వరగా కనిపిస్తోంది. పురుషుల్లో ఇది 52-55 ఏళ్లలో కనిపిస్తే, మహిళల్లో మరింత త్వరగా అంటే 48-50 ఏళ్ల వయసులోనే వస్తోంది. ఇలా వయసుతో పాటు కనిపించే ఈ సమస్యను ‘ప్రెస్‌బై ఎక్యూసిస్’ అంటారు.
 
 వినికిడి సమస్యలు ప్రధానంగా రెండు రకాలు. అవి....

 కండక్టివ్ హియరింగ్ లాస్: శబ్దతరంగాలు చెవిని, చెవి లోపలి భాగాలను సరిగా చేరకుండా ఉండటంతో వచ్చే సమస్యను కండక్టివ్ హియరింగ్ లాస్ అంటారు. దీన్ని వైద్యచికిత్సతోనూ, శస్త్రచికిత్సలతోనూ సరిచేయవచ్చు. ఉదా: శబ్దతరంగాలు చెవి లోపలికి వెళ్లడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు టింపనోప్లాస్టీ, స్టేపిడెక్టమీ వంటి శస్త్రచికిత్సలతో మెరుగుపరచవచ్చు.
 
 సెన్సోరీ-న్యూరల్ డెఫ్‌నెస్:
ఇవి జ్ఞానేంద్రియ పరమైన లేదా నరాలకు సంబంధించిన సమస్యలై ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు పిల్లల్లోనూ, పెద్దల్లోనూ వాళ్లు వాడదగిన వినికిడి ఉపకరణాల (హియరింగ్‌ఎయిడ్స్) ద్వారా సమస్యను అధిగమించవచ్చు.
 
 ఉపకరణాలు...
 సెన్సోరీ-న్యూరల్ సమస్యలతో వినికిడి సమస్య వచ్చిన వారికి వినికిడి ఉపకరణాల (హియరింగ్ ఎయిడ్స్)తో మంచి ఫలితం ఉంటుంది. అయితే చెవిటి మిషిన్ పెట్టుకోవడం వల్ల  కొందరికి తమ లోపాన్ని తెలియజెప్పినట్లుగా ఉండటంతో ఆత్మన్యూనతకు గురయ్యే అవకాశాలున్నాయి. అందుకే ఇప్పుడు ఇలాంటి వారికోసం బయటికి కనిపించకుండా చెవి లోపలి భాగంలో, చెవి నుంచి శబ్దతరంగాలను తీసుకెళ్లే కెనాల్‌లో అమర్చే డిజిటల్ హియరింగ్ ఎయిడ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇక కొందరిలో చెవి వెనక భాగంలో అమర్చుకునే తరహా వినికిడి ఉపకరణాలూ అందుబాటులో ఉన్నాయి. కొందరిలో వినికిడి శక్తి కాస్త తగ్గి... అది మరింతగా తగ్గకుండా అలా స్థిరంగా ఉన్న సందర్భాల్లో కొన్ని ఇంప్లాంటబుల్ హియరింగ్ ఎయిడ్స్ (శస్త్రచికిత్స ద్వారా లోపల అమర్చదగిన వినికిడి ఉపకరణాలు) కూడా వాడవచ్చు. ఇలాంటి సమయాల్లో దానికి అవసరమైన ప్రాసెసర్‌ను (తరంగాలను గ్రహించి పెద్దగా వినబడేలా చేసే బయటి ఉపకరణం) తలవెంట్రుకల భాగంలో కనిపించకుండా అమర్చడానికి అవకాశం ఉంది. ఈ ఉపకరణాన్ని శస్త్రచికిత్స ద్వారా ఈఎన్‌టీ సర్జన్లు అమర్చుతారు.
 
 - నిర్వహణ : యాసీన్
 
 డాక్టర్ విష్ణుస్వరూప్ రెడ్డి,
 హెచ్‌ఓడీ,  సీనియర్ ఈఎన్‌టీ
 నిపుణులు, కేర్ హాస్పిటల్స్,
 బంజారాహిల్స్, హైదరాబాద్

 

మరిన్ని వార్తలు