గొంతులో ఆహారం ఇరుక్కున్నప్పుడు...

9 Nov, 2016 23:57 IST|Sakshi
గొంతులో ఆహారం ఇరుక్కున్నప్పుడు...

గొంతులో ఏదైనా ఇరుక్కున్నపుడు పొర పోయిందని, ఎవరో తలచుకుంటున్నారని అంటుంటారు. మనం తిన్న ఆహారం కిందికి కదలడానికివీలుగా తలపై తడుతుంటారు. అయితే ఆ ఆహారం... కడుపులోకి దారితీసే ఆహార నాళంలోకి కాకుండా, ఊపిరితిత్తుల్లోకి వెళ్లాల్సిన వాయునాళంలోకి పోతే ప్రమాదం. కాబట్టి ఆ ఆహారం బయటకు రావడానికి వీలుగా దగ్గమని చెప్పాలి.

గొంతుకు ఏదైనా అడ్డం పడిందేమోనని పేషెంట్ నాలుక చాపేలా చేసి, గొంతులోకి వెళ్లు పోనిచ్చి చూడాలి. ఏదైనా అడ్డు ఉంటే తీసేయాలి.

గొంతులో ఏదైనా ఇరుక్కుని బాధ పడుతున్నప్పుడు వ్యక్తి వెనక మనం నిల్చొని,  మన రెండు చేతులను పొట్ట చుట్టూ బిగించి అకస్మాత్తుగా పట్టుబిగిస్తున్నట్లుగా కదిలించాలి. క్రమంగా ఆ పట్టును పొట్టపై కింది భాగం నుంచి పైకి కదల్చాలి. దీని వల్ల పొట్టలోపల ఒత్తిడి పెరిగి, అది పైభాగానికి కదిలి అడ్డుపడిన పదార్థాన్ని బయటకు నేట్టేసే అవకాశం ఉంటుంది. దీన్ని హీమ్‌లిచ్ మెనోవర్ అంటారు.

పిల్లల్ల గొంతులో ఏదైనా ఆహార పదార్థం ఇరుక్కుంటే మనం కుర్చీలో కూర్చుని పిల్లలను కాళ్లపై బోర్లా పడుకోబెట్టాలి. ఇలా పడుకోబెట్టినప్పుడు తల కిందికి ఉండేలా చూడాలి.  వీపుపై అకస్మాత్తుగా ఒత్తిడి తేవాలి. మన కాళ్ల ఒత్తిడి పిల్లల పొట్ట మీద పడి... అది పైకి ఎగబాకి, అడ్డు పడ్డ పదార్థం బయటకు వచ్చే అవకాశం ఉంది. 

ఇలా పడుకోబెట్టి అకస్మాత్తుగా ఒత్తిడి కలిగించేప్పుడు ఆ కదలికలను పై వైపునకు... అంటే నడుము నుంచి రెండు భుజాల మధ్యగా పై వైపునకు కదిలిస్తే,  గొంతులో ఇరుకున్న పదార్థం బయటకు వచ్చే అవకాశం ఉంది.

పైవన్నీ సత్ఫలితాలు ఇవ్వనప్పుడు వెంటనే ఆసుపత్రికి తరలించాలి. అక్కడ కొన్ని లారింగోస్కోపీ అనే పరికరం ద్వారా గొంతును పరీక్ష చేసి, అక్కడ ఇరుక్కున్న పదార్థాన్ని తొలగిస్తారు.

మరిన్ని వార్తలు