పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాలి?

2 Apr, 2016 23:16 IST|Sakshi
పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాలి?

గురువు అంటే పాఠం చెప్పేవాడు, శిష్యుడు అంటే పాఠం వినేవాడు అయితే గురుశిష్యుల సంబంధం ఎప్పుడూ వక్త, శ్రోతల్లాగానే ఉంటుంది. అలాకాదు వినీతుడు, వినీయుడులాగా ఉండాలి. విద్యార్థిగా సంస్కారవంతుడు ఎప్పుడవుతాడంటే- ప్రప్రథమంగా గురువు దగ్గర వినయాన్ని నేర్చుకున్నప్పుడు. ఇది ఎలా తెలుస్తుంది? ఎంతో కష్టపడి జ్ఞానాన్ని సముపార్జించిన గురువు దానిని అంతే కష్టపడి శిష్యుడికి నేర్పినప్పుడు... తదనంతర కాలంలో ఆ గురువు పేరు తలచుకున్నప్పుడల్లా ఆ శిష్యుడి కళ్ళు చెమ్మగిల్లినప్పుడు తెలుస్తుంది.

 

ఆర్ద్రత అని సంస్కృతంలో ఒక మాట ఉంది. తడిసి ఉండుట, చల్లగా ఉండుట అని దాని అర్థం. జీవితంలో ఎవర్నీ నమ్మని స్థితిలో మనసు పొడిబారుతుంది. అది జీవితంలో వృద్ధిలోకి రావడానికి అన్ని తలుపులూ మూసివేసుకుని ఉన్న స్థితికి పరాకాష్ఠ. అందుకే మన ఎప్పుడూ పొడిబారకూడదు. తేమగా ఉంటేనే విత్తనం జీవం పోసుకుంటుంది. పాషాణం మీద మొలకెత్తదు. గోడకు కొద్దిగా గుల్లబారుతనం ఉంటేనే మేకు దిగుతుంది. ఇనుప స్తంభానికి మేకు కొట్టే ప్రయత్నం చేస్తే అది వంగిపోతుంది తప్ప దిగదు. అందువల్ల మనిషి ప్రయత్నపూర్వకంగా జీవితంలో పొందవలసింది-మనసునందు ఆర్ద్రత.

 
గురువు అంటే పాఠం చెప్పేవాడు, శిష్యుడు అంటే పాఠం వినేవాడు అయితే గురుశిష్యుల సంబంధం ఎప్పుడూ వక్త, శ్రోతల్లాగానే ఉంటుంది. అలాకాదు వినీతుడు, వినీయుడులాగా ఉండాలి. విద్యార్థిగా సంస్కారవంతుడు ఎప్పుడవుతాడంటే- ప్రప్రథమంగా గురువు దగ్గర వినయాన్ని నేర్చుకున్నప్పుడు. ఇది ఎలా తెలుస్తుంది? ఎంతో కష్టపడి జ్ఞానాన్ని సముపార్జించిన గురువు దానిని అంతే కష్టపడి శిష్యుడికి నేర్పినప్పుడు... తదనంతర కాలంలో ఆ గురువు పేరు తలచుకున్నప్పుడల్లా ఆ శిష్యుడి కళ్ళు చెమ్మగిల్లినప్పుడు తెలుస్తుంది.

 
ఒకసారి లబ్ధప్రతిష్ఠుడైన ఒక డాక్టర్‌ను కలిసాను. ఆయనకు 80 ఏళ్ళు. ఆయన ఒక్క పైసా ప్రతిఫలం పొందకుండా ఆరోజు వరకు ప్రపంచవ్యాప్తంగా 1 లక్షా 70 వేల పోలియో ఆపరేషన్లు చేసాడట. ఉచితంగా ఎందుకు చేస్తున్నారని నేనడిగితే- ‘‘విశాఖపట్టణంలో వ్యాఘ్రేశ్వరుడని ఎముకల వైద్యంలో దిట్ట అయిన ఒక డాక్టరుగారుండేవారు. ఆయన పోలియో ఆపరేషన్స్‌లో పరమ నిష్ణాతుడు. ఆయన వద్ద పోలియో ఆపరేషన్స్ నేర్చుకున్నాను. మొట్టమొదటి పేషంట్‌కు నేను ఆపరేషన్ చేసేటప్పుడు ఆయన తన చేతిలో నా చెయ్యి వేయించుకుని ఒక మాట తీసుకున్నారు. దానికి ముందు ఆయనేం చెప్పారంటే.. ‘ఒక వ్యక్తికి పోలియో వచ్చి ఒక కాలు తోటకూర కాడలా, ఒక చెయ్యి మరో తోటకూర కాడలా వేలాడుతుంటే వాడు జీవితాంతం ఎంత బాధపడతాడో గుర్తు చేసుకో. భగవంతుడి అనుగ్రహం చేత శస్త్రచికిత్స చేసి అతని కాలూ చెయ్యీ కదిలేటట్లు చెయ్యగలిగే ప్రజ్ఞ పొందుతున్నావు. నీవిస్తానన్న గురుకట్నంగా ఈ మాట ఇవ్వు. నిన్ను గొప్ప నిష్ణాతుడిని చేస్తాను. పోలియో ఆపరేషన్ చేస్తే ఎన్నడూ నయాపైసా పుచ్చుకోకు’-అన్నారు. అలా ఇది ఆయన పెట్టిన భిక్ష. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా లక్షా 70 వేల ఆపరేష్ల చేసాను’’ అంటూ చెబుతూంటే ఆయన కళ్ళవెంట నీళ్ళు అప్రయత్నంగా కారిపోతున్నాయి. పోలియో బారి నుండి విజయవంతంగా బయటపడ్డ కొన్ని వేలమంది ఆ డాక్టర్‌ను దేముడిలాగా రోజూ తలచుకొని వారి భార్యాబిడ్డలతో సంతోషిస్తుంటే అంతకన్నా పుణ్యకార్యం ఇంకొకటి ఉంటుందా లోకంలో! అంతకన్నా కీర్తి పొందడానికి మరొక మార్గం ఉంటుందా ప్రపంచంలో!

 
ఇదీ ఆర్ద్రత అంటే... ఇదీ వినయంతో కూడిన సంస్కారం అంటే. చదువు ఎప్పుడూ అహంకారానికే పనికి వస్తే అంతకన్నా అర్థరహితమైన విద్య లోకంలో మరొకటి లేదు. ప్రపంచంలో పరమ ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు... అహంకారగ్రస్థుడైన చదువుకున్నవాడు. పల్లెపట్టుల్లో ఏమీ చదువుకోని బాగా అమాయకులైన వారెక్కువగా ఉంటూంటారు. వాళ్ళు సాధారణంగా ఎవరూ ఎవరినీ పేరుపెట్టి పిలుచుకోరు. ఎవరినైనా పిలవవలసి వస్తే నాయనగారూ, అమ్మగారూ, బావా, బాబాయి, మామా, అక్కా, అన్నా - అంటారు తప్ప పేరుపెట్టి పిలవరు. బంధువుల్లాగా ప్రేమతో పిలుచుకుంటారు. అటువంటి చోట్ల ఒక అమాయకుడైన చదువుకోని వ్యక్తి ఒక నేరం చేయాల్సివస్తే బహుశః దొంగతనం, జేబులు కొట్టేయడం వంటివి చేస్తాడేమో కానీ బాగా చదువుకున్న వ్యక్తి ఏ సాఫ్ట్‌వేర్ వంటి వాటిలో కూడా నైపుణ్యం ఉన్నవాడు నేరం చేస్తే వాడిని పట్టుకోవడం ఒక పట్టాన సాధ్యపడదు. మనిషిలో తెలివితేటలు సమాజహితానికి పనికి రావాలి తప్ప కేవలం ఆ విద్య అడ్డుపెట్టుకుని తాను ఎలా బతకాలనుకుంటున్నాడో అలా భోగవంతమైన జీవితం గడపడానికి అది ఆలంబనం కాకూడదు. 

 
అందుకే విద్యావిధానం గురించి (పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాలన్న విషయాన్ని గురించి) రామాయణంలో మహర్షి ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. రెండు గంటల్లో చెప్పగల విషయాన్ని రెండు నిమిషాల్లో చాలా ప్రభావవంతంగా చెప్పగలిగినట్లు ఈ శ్లోకంలో చెప్పారు‘‘సర్వే వేద విదాః శూరాః సర్వే లోకహితేరతాః  సర్వే జ్ఞానపాశ సంపన్నాః సర్వే సముదితాణైహి’’


వశిష్ఠుడు రామ లక్ష్మణ భరత శత్రుఘు్నలను కూర్చోబెట్టుకుని విద్య నేర్పాడు. అంటే పాఠం ఒక్కటే చెప్పి వెళ్ళిపోలేదు. వేదాలన్నీ నేర్పాడు, విద్యలన్నీ నేర్పాడు. శూరాః అంటే శూరుడు అంటే యుద్ధం చేసేవాడని కాదు. పండితుడనే అర్థం కూడా ఉంది. అంటే జ్ఞానవంతుల్ని చేసాడు. సర్వేలోకహితేరతాః... అంటే పాఠం చెప్పేటప్పుడే ఈ చదువుకున్న చదువంతా దేనికి పనికి రావాలో చెబుతుండేవాడు. లోక హితానికి, లోక క్షేమానికి ఆ విద్య ఎలా వినియోగించాలో చెప్పేవాడు. అందుకే అంత గొప్పవిద్య పొందిన ఆ శిష్యులు కూడా లోక హితానికే తప్ప లోక కంటకానికి, లోకుల్ని బాధించడానికి తమ విద్యలను ఎప్పుడూ ఉపయోగించలేదు.

 
నిగ్రహం ఎక్కడి నుంచీ వచ్చిందంటే... గురువుగారు పాఠం చెప్పినప్పుడు... ‘‘ఈ విద్య లోక క్షేమానికి తప్ప నీ స్వార్థానికి వినియోగించుకోకుండా ఉండాలనే మాట నుంచి వచ్చింది’’ వ్యాఘ్రేశ్వరుడుగారు పోలియో ఆపరేషన్లు మాతమే నేర్పి చేతిలో చెయ్యి వేయించుకుని ఉండకపోతే ఆ ఆపరేషన్లు చేసిన డాక్టర్‌గారు కోట్లకు పడగలెత్తేవారేమో కానీ ఇలా ప్రపంచం గుర్తించుకోదగ్గ వ్యక్తిగా మాత్రం ఆయన అయి ఉండేవారు కాదు.

 

 బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

 

మరిన్ని వార్తలు