అంపైర్ కావడం ఎలా...

21 Mar, 2014 23:42 IST|Sakshi
అంపైర్ కావడం ఎలా...

క్రికెట్‌పై ఆసక్తి ఉండి, ఆటతో అనుబంధం కొనసాగించాలనుకునేవారికి అంపైరింగ్‌ను ఒక మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు. అంపైర్‌గా మారేందుకు విద్యార్హతల గురించి పెద్దగా పట్టింపు లేదు. కనీస పరిజ్ఞానం ఉంటే ముందుకు వెళ్ళవచ్చు.
 
 రాష్ట్ర స్థాయిలో...

క్రికెట్ అసోసియేషన్‌లు (హెచ్‌సీఏ లేదా ఏసీఏ) ఏడాదిలో ఒకసారి రాష్ట్ర స్థాయి అంపైర్ల అర్హత పరీక్షను నిర్వహిస్తాయి. సాధారణంగా సీజన్ ఆరంభానికి ముందు జూన్‌లో ఇది జరుగుతుంది. లీగ్ స్థాయి క్రికెట్ ఆడిన ఆటగాడు నేరుగా పరీక్షకు హాజరు కావచ్చు. లేదా సదరు సంఘంలోని ఏదైనా అనుబంధ క్లబ్ కార్యదర్శి లేదా జిల్లా సంఘం కార్యదర్శి సిఫారసు చేస్తే పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. ఇందు కోసం మార్కెట్‌లో లభించే ఎంసీసీ క్రికెట్ లా పుస్తకం చదివి సిద్ధం కావచ్చు. 50 ఆబ్జెక్టివ్ టైప్, 50 థియరీ టైపు ప్రశ్నలతో మొత్తం 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. మార్కులను బట్టి గ్రేడింగ్ ఇస్తారు.
 
బీసీసీఐ స్థాయిలో...
 
రాష్ట్ర స్థాయి పరీక్షలో టాప్-10లో నిలిచినవారు బీసీసీఐ లెవెల్ 1 పరీక్షకు అర్హత సాధిస్తారు. దానిలో ఉత్తీర్ణులైతే లెవెల్ 2 పరీక్షకు హాజరు కావచ్చు. ఇందులోనూ పాస్ అయితే అండర్-16, మహిళల క్రికెట్... తదితర జూనియర్ స్థాయి టోర్నీలకు అంపైర్‌గా వ్యవహరించేందుకు బీసీసీఐ అవకాశం కల్పిస్తుంది. దాదాపు రెండేళ్ల పాటు ఈ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేయడాన్ని ప్రొబేషనరీ పీరియడ్‌గా వ్యవహరిస్తారు. ఆయా మ్యాచ్‌ల్లో అంపైర్‌గా పని తీరు, మ్యాచ్ రిఫరీల నివేదికలను బట్టి కెరీర్‌లో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. రెండేళ్లు ముగిసిన తర్వాత బోర్డు వైవా నిర్వహిస్తుంది. అందులో తమ సామర్థ్యం నిరూపించుకుంటే బీసీసీఐ ప్యానల్‌లో చోటు లభించి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు కూడా అవకాశం దక్కుతుంది.
 
వారికీ అవకాశముంది...
 
రాష్ట్ర స్థాయి పరీక్షలో టాప్-10లో రాకపోయినా ఇబ్బంది లేదు. వారికి స్థానిక మ్యాచ్‌లలో అంపైరింగ్‌కు అవకాశం కల్పిస్తారు. ముఖ్యంగా లీగ్‌లలో, వారాంతపు మ్యాచ్‌లలో పెద్ద సంఖ్యలో అంపైర్ల అవసరం ఉంటుంది కాబట్టి కనీస అర్హతలు ఉంటే ఎవరైనా చాన్స్ దక్కించుకోవచ్చు. లెవెల్ 1 పాసైతే బోర్డునుంచి అవకాశాలు దక్కుతాయి. లెవెల్ 2 పాసైతే పెద్ద స్థాయికి (ఐసీసీ వరకు) చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. లీగ్ స్థాయిలో అంపైర్‌కు ఒక రోజుకు కనీసం రూ. 500తో ప్రారంభమై, 750... 1,000... 1,500... ఇలా అంపైర్ గ్రేడ్‌ను బట్టి, మ్యాచ్ స్థాయిని బట్టి ఫీజును అందజేస్తారు. రంజీ ట్రోఫీ, అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఈ మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది.
 

మరిన్ని వార్తలు