కూలింగ్‌ ఛాలెంజ్‌!

5 Dec, 2018 02:45 IST|Sakshi

పిసరంత కరెంటుతో రాత్రంతా చల్లదనాన్ని ఇచ్చే ఏసీ ఉంటే ఎలా ఉంటుంది? ఇలాంటి అద్భుత ఆవిష్కరణతో... మన జేబులకు పడే నెలవారీ చిల్లులు తగ్గడం ఒక్కటే కాదు.. భూతాపోన్నతికి అడ్డుకట్ట వేయడమూ సాధ్యమవుతుంది. భూమ్మీద ఇప్పటికే కోటిన్నర ఏసీలు ఉండగా... 2050 నాటికి మరో 330 కోట్లు వచ్చి చేరతాయన్న అంచనాలు బలపడుతున్న తరుణంలో భారత ప్రభుత్వం ఓ వినూత్నమైన పోటీ ప్రకటించింది. ఎల్‌ఈడీల తరహాలో అతితక్కువ విద్యుత్తుతో పనిచేసే ఏసీలను డిజైన్‌ చేసి తయారు చేసిన వాళ్లకు ఏకంగా రూ.21 కోట్ల బహుమతి ప్రకటించింది.

గ్లోబల్‌ కూలింగ్‌ ప్రైజ్‌ అనే పేరుతో ప్రకటించిన ఈ పోటీలో తయారయ్యే ఏసీ గరిష్టంగా 700 వాట్ల విద్యుత్తును మాత్రమే వాడుకోవాలి. అంతేకాకుండా ఒకవేళ నీటిని ఉపయోగించి చల్లదనాన్ని కలిగించే పక్షంలో అది రోజుకు 14 లీటర్లకు మించకూడదు. వచ్చే ఏడాది జూన్‌ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆ తరువాత ఆగస్టులో పది మంది ఫైనలిస్టులను ఎంపిక చేసి వారికి రూ.14 కోట్లు అందించి నమూనాల తయారీకి పురమాయిస్తారు. 2020 నవంబరు, డిసెంబర్లలో పోటీ విజేతను ప్రకటిస్తారు.  

మరిన్ని వార్తలు