కలిసి వెళితే కలదు లాభం...

7 Mar, 2014 00:23 IST|Sakshi
కలిసి వెళితే కలదు లాభం...

యాత్రలకు ఎంత మంది కలిసి వెళితే, అంత లాభం’ అంటున్నారు హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌కి చెందిన వి.రామరాజు. ఆయన విశ్రాంత జీవనం గడుపుతున్నారు. ఈ వారం జమ్మూ, కాశ్మీర్ విహారయాత్రకు వెళుతున్నారు. అందులో ప్రత్యేకత ఏముందీ? అంటారా... అయితే చదవండి...
 
‘‘నేనూ, నా సతీమణి స్వర్ణకుమారి ప్రతి ఏడాదీ విహారయాత్రలకు వెళ్లడం ఓ అలవాటుగా చేసుకున్నాం. ఈ వారంలో మనదేశ స్వర్గసీమగా భావించే జమ్మూ, కాశ్మీర్‌కు బయల్దేరుతున్నాం. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. నాతో కలిసి మరో తొంభైమంది ప్రయాణిస్తున్నారు. అంతా మా బంధువులు! నాలుగేళ్లక్రితం పదిమంది గ్రూప్‌గా యాత్రలకు వెళ్లడం మొదలుపెట్టాం. ఇప్పుడు ఆ సంఖ్య వందకు చేరువవుతోంది. రెండేళ్ల క్రితం 65 మందిమి కలిసి దక్షిణ భారతదేశం తిరిగొచ్చాం. కన్యాకుమారి, రామేశ్వరం అన్నీ చుట్టొచ్చాం. అంతకుముందు ఏడాది హిమాలయ యాత్రకు వెళ్లాం. హరిద్వార్, రుషికేష్ చూసొచ్చాం. ఏడాదిన్నరక్రితం ఉత్తరభారతదేశానికి 75 మందిమి ఒక గ్రూప్‌గా కలిసి వెళ్లాం. ఇప్పుడు 91 మందిమి వెళుతున్నాం. మా గ్రూప్‌లో అందరూ దాదాపు 60 దాటినవాళ్ళే!
 
అన్నీ ప్రయోజనాలే!

జమ్మూ-కాశ్మీర్ పదిరోజుల యాత్రకు నెల ముందుగానే ట్రావెల్స్‌లో బుక్ చేసుకున్నాం. 35 సీట్లు ఉన్న 3 బస్సులలో ప్రయాణం. మాతో ప్రతి బస్సుకు ఒక ట్రావెల్ గైడ్ కూడా ఉంటాడు. వెళ్లిన చోట ఇద్దరు వ్యక్తులు ఒకే హోటల్ గదిలో ఉండేట్టయితే ఒక్కొక్కరికి (మొత్తం ఛార్జీలు, భోజనంతో సహా) రూ.15,000/-లు. ముగ్గురు ఒకే గదిలో ఉండేట్టయితే ఆ ముగ్గురికీ రూ.31,000/-. ముందు ట్రావెల్ ఏజెంట్‌ని కలిసినప్పుడు జమ్మూకాశ్మీర్ యాత్ర ఒక్కొక్కరికి రూ.18000/- అని చెప్పాడు. కాని 91 మందితో గ్రూప్ అనేసరికి ఒక్కొక్కరికి రూ.3 వేలు తగ్గింపు లభించింది.
     
సాధారణంగా ఏ వేడుకల్లోనో బంధువులం కలుస్తాం. హడావిడిగా వెళ్లిపోతాం. అదే ఇలా వెళితే కనీసం పది రోజులకు పైగా అంతా కలసి ఉంటాం. భోజనాలైనా, తిరగడమైనా కలిసే చేస్తాం. సరదాగా ఉండటం వల్ల అందరితో చనువు ఏర్పడుతుంది. పెద్ద వయసు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు కూడా ప్రయాణంలో కిలోమీటర్ల కొద్దీ తిరుగుతారు. అయినా చిన్న నొప్పి అని కూడా ఎవరూ అనరు. అంత ఉల్లాసంగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా మనకి మరో తొంభైమంది తోడుగా ఉన్నారన్న భరోసా ఉంటుంది.
     
తమిళనాడు, ఉత్తరాంచల్ వెళ్లినప్పుడు... రైలు టికెట్లు, హోటల్స్ అన్నీ మేమే ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్నాం. ఖర్చులన్నీ కలిపి చివరగా అందరం పంచుకున్నాం. ఆ విధంగా చాలా తక్కువ డబ్బులకే ప్రయాణాలు చేసిన సందర్భాలున్నాయి. ఈసారి సంఖ్య ఎక్కువైందని ట్రావెల్ బస్సులు బుక్ చేసుకున్నాం’’అని తెలిపారు.
 
ఎక్కువ మంది కలిసి గ్రూప్‌గా యాత్రలకు వెళితే కొత్త ప్రాంతాల్లో మరింత భరోసాగా గడిపిరావచ్చు. ఖర్చూ కలిసి వస్తుంది. కలిసి ఇలా టూరు వెళితే మరిన్ని ప్రయోజనాలు  మీరూ స్వయంగా తెలుసుకుంటారు.
 
- నిర్మలారెడ్డి
 

మరిన్ని వార్తలు