జీవితకాలం స్వల్పమేమీ కాదు!

3 Oct, 2016 01:09 IST|Sakshi
జీవితకాలం స్వల్పమేమీ కాదు!

(కాలం) ఏ కొంత కూడా ఇతరుల అధీనంలోకి వెళ్లలేదు. కాలాన్ని ఎంత పొదుపుగా సంరక్షించుకోగలిగితే, కాలాన్ని మార్పిడి చేసుకోవడానికి కాలం కన్నా విలువైనదేదీ లేదని గ్రహించగలిగితే - అప్పుడు అతనికి సరిపడా సమయం మిగులుతుంది.

మానవుల జీవితకాలం చాలా స్వల్పమని సాధారణంగా అందరూ అంటుంటారు. జీవితకాలం చాలా తక్కువగా ఉన్నందుకు ప్రకృతి దుర్మార్గం గురించి కూడా ఫిర్యాదు చేస్తుంటారు. కాలం చాలా వేగంగా పరుగెత్తుకుని పోవడం దానికి ఒక కారణం. ఒకటి రెండు మినహాయింపులు తప్ప నిజానికి మనలో చాలామందికి జీవించడానికి సంసిద్ధం అవుతున్న తరుణంలోనే అది ముగిసిపోతుంటుంది. కానీ నిజానికి మనకు జీవించడానికి ఉన్నది తక్కువ కాలమేమీ కాదు. అందులో చాలా భాగాన్ని మనం వృథా చేస్తాం. చివరకు ఒకరోజు మృత్యువు సమీపించే సమయం ఆసన్నమవుతుంది. ఒక చేతగాని వ్యక్తికో, చెడ్డ యజమానికో అపారమైన సంపద లభిస్తే కనుమూసి తెరిచేంతలో అది మాయమవుతుంది. అదే ఒక సమర్థుడికి దానిని అప్పచెప్పిన పక్షంలో అది వినియోగించిన కొద్దీ పెరుగుతుంటుంది. అలాగే మన జీవితకాలాన్ని కూడా మనం సక్రమంగా వినియోగించుకోగలిగితే అది కూడా విస్తృతమవుతూనే వుంటుంది.
 
 ‘‘జీవితంలో చాలా కొద్ది భాగం మాత్రమే మనం నిజంగా జీవిస్తుంటాం,’’ అంటాడు ఒక ప్రముఖ కవి. ఆ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. అంటే ఆ మిగిలినదంతా జీవితం కాదు. అది వట్టి కాలం మాత్రమే. మనిషి తన ఎస్టేట్లని ఎవరైనా స్వాధీనం చేసుకోవడానికి చూస్తే సహించడు. సరిహద్దులకి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా రాళ్ల కోసమో, ఆయుధాల కోసమో పరిగెడతాడు. అయితే తమ జీవితాన్ని ఇతరులు ఆక్రమించుకుంటుంటే మాత్రం మనుషులు పట్టించుకోరు. తన డబ్బుని ఇతర్లతో పంచుకోవడానికి ఇష్టపడే ఒక్క వ్యక్తిని కూడా మనం చూడలేం. అయితే అతని జీవితాన్ని మాత్రం మనలో ప్రతి ఒక్కళ్లూ విభజించి పంచుకొంటాం. మనుషులు తమ వ్యక్తిగత ఆస్తిని కాపాడుకోవడంలో జాగ్రత్తగా ఉంటారు. అదే కాలం విషయానికి వస్తే దాన్ని ఎలాంటి పట్టింపు లేకుండా వృథా చేస్తుంటారు.
 
 జీవిత చరమాంకంలో ఉన్న ఒక మనిషిని దొరకబుచ్చుకుని నాకు ఎప్పుడూ ఒక ప్రశ్న అడగాలని అనిపిస్తుంది. ‘‘నీ వయసు వందేళ్లకు సమీపంగానో, ఇంకా ఎక్కువగానో ఉంది. ఇప్పుడు ఇంక నీ జీవితం గురించి దాన్ని ఎలా ఖర్చుపెట్టావనే దానికి సంబంధించి లెక్కలు చూసుకో. వడ్డీ వ్యాపారస్థుల చుట్టూ తిరగడానికి ఎంతకాలం వెచ్చించావు? ప్రియురాలి కోసం ఎంత ఖర్చు పెట్టావు? ఆశ్రీతుల కోసం, పోషణ కోసం ఎంత వెచ్చించావు? భార్యతో పోట్లాడడానికీ, నౌకర్లను శిక్షించడానికీ ఎంత కాలం ఖర్చు చేశావు? వ్యాధుల కోసం, నీ అంతట నువ్వు తెచ్చిపెట్టుకునే వ్యాధుల కోసం ఎంత కాలం ఖర్చు పెట్టావు? అసలు ఏ పనీ చేయకుండా, ఉపయోగించకుండా ఎంత కాలాన్ని వదిలేశావు’’- నువ్వు ఎప్పుడైనా ఒక నిర్దేశిత లక్ష్యం కోసం పనిచేశావా అనేది గుర్తుకు తెచ్చుకో. నువ్వు అనుకున్న ప్రకారం కచ్చితంగా ఎన్ని రోజులు గడప గలిగావు అనేది లెక్కవేసుకో.
 
 నీ మొహం ఎన్నిసార్లు సహజమైన భావప్రకటనతో ఉందో గుర్తుకి తెచ్చుకో. నీ మనసు ఆందోళన రహితంగా ఎన్నిసార్లు ఉందో గమనించుకో. నువ్వు ఏం పోగొట్టుకున్నావో నీకు తెలిసేలోగానే ఎంత మంది నీ జీవితాన్ని దొంగిలించుకుని పోయారు? పక్కదారి పట్టించే అర్థంలేని ఆనందాల కోసం, కోరికల కోసం ఎంత జీవితాన్ని పోగొట్టుకున్నావు? అప్పుడు నీకు అర్థం అవుతుంది నువ్వు పూర్తిగా పరిపక్వం కాకుండానే మరణించబోతున్నావని.
 
 నీకు భయం కలిగించే విషయాలకు సంబంధించి జీవితం అశాశ్వతం అంటున్నావు. అదే కోరికల విషయానికి వచ్చేసరికి జీవితం శాశ్వతం అన్నట్టు ప్రవర్తిస్తున్నావు. అయితే ఎలా జీవించాలి అనేది తెలుసుకోవడానికి పూర్తిగా ఒక జీవితకాలం పడుతుంది. ఇంకా ఆశ్చర్యం కలిగించేదేమంటే ఎలా చనిపోవాలి అనేది తెలుసుకోవడానికి కూడా పూర్తిగా ఒక జీవితకాలం పట్టడం! చాలామంది గొప్పవాళ్లు వాళ్లకున్న సంపదల్నీ, సంతోషాల్నీ త్యజించి జీవించడం ఎలా అనేది తెలుసుకోవడమే లక్ష్యంగా బతికారు. చనిపోబోయే ముందు వాళ్లందరూ చెప్పిన సత్యం ఒకటి ఉంది. జీవించడం ఎలా అనే విషయం అసలు తమకు తెలియనేలేదని, కనీసం ఇతరులకి తెలిసినంత అయినా తెలియలేదని వాళ్లు ఒప్పుకున్నారు.
 
 నాకు తెలిసి గొప్ప వ్యక్తుల లక్షణం ఒకటే ఒకటి ఉంది. తన సమయాన్ని వృథాగా ఎగిరిపోకుండా చూసుకోవడం. అప్పుడు అతనికున్న సమయం అంతా అతని కోసమే ఖర్చు పెట్టడానికి అవకాశం కుదురుతుంది. అందులో ఏ కొంత కూడా నిర్లక్ష్యంగా వదిలి వేయబడదు. ఏ కొంత కూడా ఇతరుల అధీనంలోకి వెళ్లలేదు. అతను కాలాన్ని ఎంత పొదుపుగా సంరక్షించుకోగలిగితే, కాలాన్ని మార్పిడి చేసుకోవడానికి కాలం కన్నా విలువైనదేదీ లేదని గ్రహించగలిగితే- అప్పుడు అతనికి సరిపడా సమయం మిగులుతుంది.  ఆ గడిచిపోయిన కాలాన్ని నీకు ఎవరూ తెచ్చి ఇవ్వరు. అలాగే నిన్ను నీకు కూడా ఎవరూ తెచ్చి యివ్వలేరు. జీవితం ఎలా మొదలయిందో అలాగే సాగిపోతుంది తప్ప అది వెనక్కి రాదు. రాజాజ్ఞ అనో, ప్రజలకు మంచి జరుగుతుందనో దాన్ని పొడిగించడం సాధ్యం కాదు. ఎక్కడా ఆగదు. పక్కదారి పట్టదు. ఈలోగా మరణ సమయం ఆసన్నమవుతుంది. దానికోసం సంసిద్ధంగా ఉండటానికి నీకు అవకాశం లేకుండా పోతుంది.
 
 జీవించడానికి ఉన్న పెద్ద అవరోధం ఏంటంటే, భవిష్యత్తు గురించి ఎదురుచూడటం. అంటే రేపటి కోసం ఎదురుచూస్తూ ఈరోజుని పోగొట్టుకోవడం. జీవితాన్ని గతం, వర్తమానం, భవిష్యత్తు అనే మూడు భాగాలుగా విభజిస్తే అందులో వర్తమానం అనేది చాలా చిన్నది. భవిష్యత్తు సందేహాస్పదం. గతం ఒక్కటే కచ్చితమైనది. గతం మీద అదృష్టానికి ఎలాంటి అధికారం ఉండదు. గతాన్ని ఎవరి అదుపులోకన్నా తీసుకురావడం అసాధ్యం. రకరకాల వ్యవహారాల్లో మునిగిపోయిన వాళ్లు పోగొట్టుకున్నది ఈ గతాన్నే.
 
 జిజ్ఞాసకి, తత్వజ్ఞానానికి ఎవరైతే జీవితంలో సమయం కేటాయించగలుగుతారో వాళ్లే నిజంగా జీవిస్తున్నట్టు అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్లు వాళ్ల జీవితగమనాన్ని నిశితంగా గమనించుకోగలగడంతో పాటు గడిచిన కాలాన్ని తమ జీవితాలకి కలుపుకోగలరు. అంటే వాళ్ల గడిచిపోయిన సంవత్సరాలన్నీ ఒకదానికి ఒకటి జమ అవుతాయి తప్ప వ్యర్థం కావు. ఆ రకంగా గొప్ప తత్వవేత్తలందరూ మనకోసమే జన్మించి, జీవించడానికి మనకు ఒక విధానాన్ని తయారు చేసినట్టు అనుకోవచ్చు. అంతేకాదు వాళ్లు ఎలా చనిపోవాలి అనేది కూడా బోధించగలరు. వాళ్లు మీ కాలాన్ని వ్యర్థం చేయరు. పెపైచ్చు వాళ్ల కాలాన్ని మీకున్న కాలానికి కలుపుతారు. వాళ్ల నుంచి నీకు ఎంత జ్ఞానం కావాలనిపిస్తే అంత జ్ఞానాన్ని తీసుకోవచ్చు. నీకు సరిపడినంత వాళ్ల నుంచి నువ్వు తీసుకోలేకపోతే అది వాళ్ల తప్పు కాదు.
  రోమన్ తత్వవేత్త సెనెకా
 (క్రీ.పూ. 4 - క్రీ.శ. 65)

 
 మన తల్లిదండ్రుల్ని మనం ఎంచుకోలేమనీ, మనం ఎవరికి పుట్టాలనేది విధి నిర్ణయమనీ చాలామంది అంటుంటారు. మనం ఎవరి పిల్లలుగా ఉండాలో నిర్ణయించుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఉన్నతమైన మేధావులు, తత్వవేత్తలలో మీకు నచ్చిన వారిని ఎంపిక చేసుకుంటే వాళ్ల పేరుతో పాటు వాళ్ల జ్ఞాన సంపదకు కూడా మీరు వారసులు అవుతారు. దీన్ని మీరు ఎంతమందితో పంచుకుంటే అంత పెరుగుతూ పోతుంది. శాశ్వతత్వానికి చేరుకోగల పథ నిర్దేశాన్ని తత్వవేత్తలు మాత్రమే చేయగలరు. అశాశ్వతమైన జీవితాన్ని శాశ్వతత్వంలోకి నడిపించడానికి ఉన్న ఏకైక మార్గం ఇదే. ఎవరైతే గతాన్ని మర్చిపోయి, వర్తమానాన్ని నిర్లక్ష్యం చేసి, భవిష్యత్తు గురించి భయపడతారో వాళ్లకి జీవితకాలం చాలా స్వల్పంగానే కనిపిస్తుంది.
 
 మూలం: సెనెకా ‘ఆన్ ద షార్ట్‌నెస్ ఆఫ్ లైఫ్’
 నుంచి సంక్షిప్తంగా...
 అనువాదం: జి.లక్ష్మి
 9490735322

మరిన్ని వార్తలు