వినకపోతివి!

28 Jan, 2018 01:11 IST|Sakshi

ఒక మనిషి అడవి గుండా వెళుతున్నాడు. పిల్లిపిల్ల ఒకటి సన్నటి గోతిలో పడి బయటికి రాలేక, ‘మ్యావ్‌ మ్యావ్‌’ అంటూ మొత్తుకోవడం అతడికి వినిపించింది. దగ్గరికి వెళ్లి చూశాడు. గోతిలోంచి పిల్లిపిల్ల పైకి చూస్తూ జాలిగా అరుస్తోంది. ఆ వ్యక్తి తన చేతిని గోతిలోకి దూర్చి పిల్లిపిల్లను బయటికి తియ్యడానికి ప్రయత్నించాడు. అది తన గోళ్లతో  రక్కింది. ఆ నొప్పికి తట్టుకోలేక అతడు తన చేతిని పైకి లాక్కుని, మళ్లీ వెంటనే గోతిలోకి చెయ్యి పెట్టాడు. మళ్లీ రక్కింది ఆ పిల్లిపిల్ల. ఇదంతా ఆ దారినే వెళుతున్న ఒక వ్యక్తి చూశాడు.

‘‘వదిలెయ్యవయ్యా.. బాబు. చూడు నీ చెయ్యి ఎలా గీరుకుపోయి, రక్తం కారుతోందో’’ అన్నాడు. ఈయన వినలేదు. చేతిని మళ్లీ ఆ సన్నటి గోతిలోకి దూర్చి, పిల్లిపిల్లను భద్రంగా బయటికి తీసి, అడవిలోకి వదిలిపెట్టాడు. అప్పుడు కూడా అతడి చేతిని రక్కేసి ఆ పిల్లిపిల్ల పారిపోయింది. ‘‘చెబుతుంటే, వినకపోతివి’’ అన్నాడు ఆ మనిషి ఈ మనిషితో.

ఈ మనిషి నవ్వాడు. ‘‘భయం కలిగినప్పుడు రక్కడం పిల్లి స్వభావం. ఆపద నుంచి ఆదుకోవడం మనిషి స్వభావం. రక్కుతోందని దానిని గట్టెక్కించకుండా వెళితే నేను మనిషినెలా అవుతాను’’ అని, తన దారిన తను వెళ్లిపోయాడు. మనిషిని బట్టి మన స్వభావం మారకూడదు. మన  స్వభావాన్ని బట్టే ఎప్పుడూ మన నడవడిక ఉండాలి.

మనిషిని బట్టి మన స్వభావం మారకూడదు. మన  స్వభావాన్ని బట్టే ఎప్పుడూ మన నడవడిక ఉండాలి.


 

మరిన్ని వార్తలు