స్త్రీలోక సంచారం

2 Nov, 2018 00:09 IST|Sakshi

ఉత్తర కొరియాలో మహిళలపై లైంగిక అకృత్యాలు జరగడమన్నది.. శిక్ష లేని అత్యంత సాధారణమైన సంగతని ‘హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌’ సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడయింది! వివిధ కారణాల వల్ల దేశం వదిలి పారిపోయిన 62 మంది ఉత్తర కొరియన్‌లను ఇంటర్వ్యూ చేసిన అనంతరం, వారు చెప్పిన అత్యాచార, లైంగిక వేధింపుల రహస్య సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్న ఈ సంస్థ.. ఆ దేశంలో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కొన్ని నిజ ఘటనలను ఉదహరిస్తూ వివరించింది. 

మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి ఈ నెలకు నూరేళ్లు అవుతోంది. 1914 జూలై 28న ప్రారంభమైన యుద్ధం 1918 నవంబర్‌ 11న పరిసమాప్తమైంది. ఆ యుద్ధం వల్ల జరిగిన భారీ నష్టం మాట అటుంచితే.. నాటి యుద్ధ పరిస్థితులు స్త్రీల జీవితాల్లో పెనుమార్పులు తెచ్చాయి. ఎంత పాశ్చాత్యులైనా, అప్పటి వరకు మగవాళ్ల చాటున ఇళ్లలోనే ఉన్న మహిళలు యుద్ధ కాలపు అత్యవసర విధుల నిర్వహణకు మగవాళ్లతో సమానంగా తమ దేశాల కోసం పని చేయవలసి వచ్చింది. అలా బయటికి వచ్చిన మహిళల పనితీరు సమర్థంగా, విశ్వసనీయంగా ఉండి, స్త్రీ సాధికారతవైపు తొలి అడుగులు పడడానికి దోహదపడింది.

‘స్విమ్‌వేర్‌లో మహిళా క్రీడాకారులు స్లిమ్‌గా కనిపించడం ఎలా?’ అని  ఒక ఆర్టికల్‌ను అప్‌లోడ్‌ చేసిన ప్రసిద్ధ ‘స్విమ్‌ ఇంగ్లండ్‌’ వెబ్‌ సైట్‌.. పాఠకుల నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో ఆ ఆర్టికల్‌ను తన సైట్‌ నుంచి తొలగించింది. బికినీ వేసుకోవడం వల్ల మీ ఉదరం నొక్కుకుపోయి, దేహమంతా ఒక ముక్కగా కనిపిస్తూ మీ పొట్ట మరింత పైకి వచ్చినట్లుగా కనిపిస్తుంది తప్ప మీరు స్లిమ్‌గా కనిపించరు. అందుకే బికినీకి బదులుగా వదులుగా ఉండే ‘టింకిణీ’ (స్విమ్‌ సూట్‌) వేసుకోవాలన్న సూచన ఆ వ్యాసంలో ఉంది. నిజానికి 2010లో వచ్చిన ఆ ఆర్టికల్‌నే ఆ వెబ్‌ సైట్‌ మళ్లీ రిపీట్‌ చేసింది. ‘క్రీడాకారిణులను సెక్స్‌ సింబల్‌గా చూస్తారా?’ అంటూ అప్పుడూ విమర్శలు వచ్చాయి కానీ, ఈసారి మాత్రం ఆ వెబ్‌సైట్‌ వాళ్లు స్పందించక తప్పలేదు. బికినీ విషయం ఒక్కటే కాదు, మగవాళ్లలా ఉండే ఆడవాళ్లు తమ ఎదను కనిపించేలా స్విమ్‌సూట్‌ను ఎలా ధరించాలో కూడా ఆ వివాదాస్పద ఆర్టికల్‌లో రాసి ఉంది.  

మరిన్ని వార్తలు