మేలు కోరితే మంచి జరుగుతుంది

8 Aug, 2019 09:03 IST|Sakshi

చెట్టు నీడ

శ్రేష్టి శంభునాథునికి భయం పట్టుకుంది. తన వ్యాపారం దెబ్బతింటుందని భయం. గత పదేళ్ల నుంచీ వ్యాపారం చేస్తున్నా ఇంతవరకు పోటీ లేదు. ఇప్పుడు మరొక శ్రేష్టి మాధవనాధుడు దుకాణాల సముదాయాన్ని తెరవబోతున్నాడని వినికిడి. మరేం పరవాలేదు, నేను పదేళ్ల నుంచీ పాతుకు పోయాను, అందరూ నా వినియోగదారులే అనే ధీమాతో ఉన్నాడు. అనుకున్నట్టే మాధవనాధుడు దుకాణ సముదాయాన్ని విజయదశమినాడు ప్రారంభించాడు. రోజులు గడుస్తున్నాయి. మాధవనాథుని వ్యాపారం పుంజుకుంటోంది. శంభునాథుని వ్యాపారం పలచబడుతోంది. అయినా ఏదో ఆశ, తనకేం ఢోకాలేదని. రోజులు గడుస్తున్న కొద్దీ శంభునాథుని వ్యాపారం దిగజారనారంభించింది. ఇంక లాభం లేదనుకొని తమ తాతల నుంచీ సలహాలు తీసుకొనే నారాయణ స్వామీజీని కలిసి తన బాధను చెప్పుకున్నాడు .

స్వామీజీ యిచ్చిన సలహా ‘‘శంభూ! రోజూ నీ దుకాణాన్ని చూస్తున్నప్పుడు, నా దుకాణం దినదిన ప్రవర్ధమాన మౌతుందని పదే పదే అనుకో. అలాగే నువ్వు వచ్చిపోయేటప్పుడు మాధవనాథుని దుకాణ సముదాయం దాటి వచ్చేటప్పుడు ఆ సముదాయాన్ని చూస్తూ మాధవనాథుడు వ్యాపారంలో మంచి లాభాలు గడించాలి అని అనుకో’’ అన్నారు. స్వామీజీ మాటలు అర్ధం కాలేదు. తానొకటి కోరుకుంటే, ఆయనొకటి చెప్తున్నారు అనుకున్నాడు. ఇష్టం లేకున్నా, స్వామీజీ ఆదేశ ప్రకారం చేస్తున్నాడు. అయినా తన వ్యాపారం దిగజారుతూనే వుంది. మార్పు లేదు. చివరకు తన వ్యాపారాన్ని మూసేసాడు. ఒకరోజు అటుగా ళ్తున్న శంభునాథుని మాధవనాథుడు పిలిచి ‘‘శంభూ! నువ్వేమీ అనుకోకపోతే నేనొక మాట చెబుతాను. నీ వ్యాపారం దెబ్బతింది, నా వ్యాపారం పెరిగి పోతోంది. మరొక దుకాణ సముదాయం తెరుద్దామనుకుంటున్నాను. నువ్వు దీనికి నిర్వాహకుడిగా వుండి వ్యాపారం చూడు. నువ్వూహించని ధనం ఇస్తా’’ అన్నాడు.’’శంభునాథుడు తెల్లబోయాడు. ఎందుకిలా జరిగిందో అర్ధం కాలేదు. చిన్న దుకాణ యజమాని పెద్ద దుకాణాల సముదాయానికి నిర్వాహకుడు అవుతాడు, వ్యాపారంలో నష్టమొస్తుందన్న చింత వుండదు, జీవితం హాయిగా సాగిపోతుందని భావించి అందుకు అంగీకరించాడు. నాటి హాయిగా బతుకుతున్నాడు. ఎదుటి వానికి కూడా మేలు జరగాలనే చింతనలోనే వుంది అసలు రహస్యం. అదే స్వామీజీ సందేశం.– విశ్వేశ్వరవర్మ భూపతిరాజు

మరిన్ని వార్తలు