సర్పయాగం

12 Dec, 2016 15:20 IST|Sakshi
సర్పయాగం

హ్యూమర్ ప్లస్

‘‘తుపానొస్తే పెద్ద ఓడలు నిలదొక్కుకుంటుయి. చిన్న పడవలు మునిగిపోతాయి’’ అన్నాడు విష్ణుశర్మ. ‘‘అర్థమయ్యేలా చెప్పండి గురువుగారు’’ అన్నారు శిష్యులు. ‘‘గురువుకి కూడా అర్థంకాని విషయాన్ని శిష్యులకి బోధించడమే ప్రపంచీకరణ. ద్రాక్షపళ్లని తైలవర్ణచిత్రంలో గీస్తే, చూడడానికే తప్ప తినడానికి పనికిరావు. కలలెప్పుడూ కడుపు నింపవు. వాస్తవ మెన్నటికీ కలగా మారదు. కథ చదివిన ప్రతివాడికీ నీతి అర్థం కాదు. నీతి తెలిసినవాడికి కథలు చెప్పనక్కర్లేదు’’ అంటూ గురువు కథ ప్రారంభించాడు.‘‘అనగనగా ఒక రాజ్యంలో పాముల బెడద తీవ్రంగా ఉండేది. పాముల పని పట్టాలని రాజు నిశ్చయించుకున్నాడు. నిపుణులను సంప్రదించాడు. సర్పయాగం చేస్తే యజ్ఞగుండంలోంచి వెలువడే శక్తికి సుడిగాలి వచ్చి పాములన్ని వచ్చి పడిపోతాయని చెప్పారు. హఠాత్తుగా యజ్ఞం ప్రారంభమైంది.

గాలి విసురుని పాములు తట్టుకున్నాయి. చుట్టులు చుట్టుకున్నాయి. ఒకదాన్నొకటి పెనవేసుకున్నాయి. పుట్టలమీద మట్టి కాస్త జారిందంతే. కానీ ఈ తాకిడికి చీమలు చెల్లాచెదురయ్యాయి. కొన్ని చచ్చిపోయాయి. మరి కొన్నింటికి నడుములు విరిగిపోయాయి. జీవనం అస్తవ్యస్తమైంది. చీమలన్నీ సమావేశం పెట్టుకున్నాయి.

‘‘యజ్ఞం ప్రారంభమైనప్పటి నుంచి కూలీకి ఎవరూ పిలవడం లేదు. తిండికి కష్టంగా ఉంది. రెక్కలున్నాయి కానీ ఆడడానికి శక్తి లేదు’’ అని చెప్పిందో కూలీ చీమ. ‘‘దాచుకున్న గింజల్ని, తిరిగి తెచ్చుకుందామంటే అడుగడుగునా అడ్డంకులే. పాములకి చర్మం చిట్లితే కుబుసం విడిచి పారిపోతాయి. కానీ చీమలకి చర్మమే ప్రాణం. వరుసల్లో వెళ్లడం చీమలకి కొత్త కాదు. కానీ గమ్యమే తెలియని ప్రయాణంలో ఎంత దూరమని వెళ్లగలం’’ అందో మధ్యతరగతి చీమ.

‘‘తప్పదు, భావి తరాల కోసం మనం త్యాగం చేయాలి’’ అందో మేధావి చీమ. ‘‘త్యాగాలెప్పుడూ చీమలే చేయాలా? అసలు మన బతుకే ఒక త్యాగం కాదా? ప్రతి జంతువు మనల్ని కాళ్ల కింద తొక్కుతూనే ఉంది కదా. సృష్టి పుట్టినప్పటి నుంచి ఇదెప్పుడైనా ఆగిందా?’’ ఓ బుద్ధి చీమ ప్రశ్నించింది.  ఇవే విషయాల్ని రాజుకి చెప్పాలని ఒక ప్రతినిధి వెళ్లాడు.

‘‘మీరు పాముల్ని ఆడించాలనుకుని, చీమల్ని ఓడిస్తున్నారు రాజా’’ అని చెప్పాడు ప్రతినిధి. ‘‘చీమల పుట్టల్ని పాముల్నుంచి కాపాడ్డానికే ఈ యాగం’’ అన్నాడు రాజు.  ‘‘తెలియనిదాన్ని తెలిసిందనుకోవడం, తెలిసినదాన్ని తెలియనట్టు నటించడమే పరిపాలన రాజా.’’ ‘‘పదాలను తారుమారు చేసి మాట్లాడినంత మాత్రాన పరిపాలన తీరు మారుకాదు.’’‘‘వెనకటికి ఒకాయన పులి మీద స్వారీ చేస్తూ పులివేటకి వెళ్లాడట.’ రాజు అర్థం కానట్టు చూశాడు.

‘‘యంత్రాంగం నిండా కొండ చిలువల్ని పెట్టుకుని, మీరు పాముల్ని వేటాడుతున్నారు. అవి రెండూ ఒకే జాతని మీకు తెలియదా? కొండచిలువలు నిజాయితీగా పాముల్ని వేటాడుతాయా? జాతి ధర్మం పాటించవా?.’’రాజు తీక్షణంగా చూశాడు. చీమల ప్రతినిధిని ఆ తరువాత ఎవరూ చూడలేదు. ‘‘ఈ కథకి ముగింపు ఏమిటి గురువుగారూ?’’ అడిగారు శిష్యులు. ‘‘ఉచ్చు విప్పడం తెలియకుండా ఉచ్చు బిగిస్తే ఆ కథని ముగించడం అంత సులభం కాదు. ఒక్కసారి అదే పాముగా మారి మనల్ని కాటేయవచ్చు.’’ ‘‘అంటే?’’ ‘‘ప్రశ్నించినవాణ్ణి అంతకు మించి ప్రశ్నిస్తారు. మౌనంగా ఉండడమే దేశభక్తి’’ అన్నాడు గురువు.

- జి.ఆర్.మహర్షి

మరిన్ని వార్తలు