పాతాళ భైరవి న్యూ వెర్షన్

23 Oct, 2016 23:50 IST|Sakshi
పాతాళ భైరవి న్యూ వెర్షన్

రాజకుమారిని చూడగానే ప్రేమలో పడ్డాడు తోటరాముడు. ‘కలవరమాయే’ అని పాటెత్తుకున్నాడు. చెవుల్లో ఇయర్‌ఫోన్స్ ఉండడం వల్ల ఆమెకి పాట వినపడలేదు.

లాభం లేదని కోట గోడ ఎక్కడానికి తాడు వేసాడు. భటులు తాడుతో సహా రాముణ్ణి పైకి లాగి రాజుగారి ముందు పెట్టారు.
‘‘చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిసి కోటలోకి ప్రవేశించాలని ఎందుకనుకున్నావ్?’’ అడిగారు మహారాజు.

‘‘నిజం చెప్పమంటారా? అబద్ధం చెప్పమంటారా మహారాజా?’’ అన్నాడు తోటరాముడు.
‘‘నిజాన్ని అబద్ధం గానూ, అబద్ధాన్ని నిజంగానూ చూడగలిగితేనే నేను రాజుగా అర్హుణ్ణి. నేను లాగులు వేసుకునే కాలం నాటి డైలాగులు చెప్పకుండా, కొత్తవి ఉంటే చెప్పు’’.

‘‘రాకుమారిపై ప్యార్, ఇష్క్, కాదల్’’.
‘‘ఓస్ అంతేనా! నేనింకా నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చావనుకున్నా. మా అమ్మాయి సంగతి నీకింకా సరిగా తెలిసినట్టు లేదు. ఒకరోజు షాపింగ్‌కి తీసుకెళ్లిందంటే తోట మొత్తం అమ్మేసుకుని, తోటరాముడివి కాస్తా బికారి రాముడిగా మారిపోతావు. పూలమ్మిన చోట అనవసరంగా కట్టెలెందుకు అమ్ముతావు చెప్పు?’’

‘‘ప్రేమ మహారాజా’’.
‘‘ప్రేమ దోమలాంటిది. ఆల్ అవుట్ వాడినా కుట్టడం మానదు. ఆ తరువాత జీవితం డెంగ్యూ జ్వరం లాంటిది. ట్రీట్‌మెంట్ కష్టం. వెళ్లి డబ్బులు సంపాదించుకురా. డబ్బుంటే తోటరాముణ్ణి శ్రీరాముడంటుంది లోకం’’.

‘‘నిజమైన ప్రేమ డబ్బుని కోరదు మహారాజా’’.
‘చూడు బాబూ. రాని మెట్రో రైలుని నమ్ముకోవడం కంటే ఉన్న సిటీ బస్సులో ప్రయాణించడం మంచిది. వెళ్లి ఎవరైనా పూలమ్మిని పెళ్లి చేసుకుని, తలా నాలుగు మూరలు పూలమ్ముకుని జీవించండి’’.

తోటరాముడు రోషంగా వీధిలోకి వచ్చాడు.
మాంత్రికుడు కనిపించి ‘సాహసం స్సేయరా డింబకా’’ అన్నాడు.
‘‘పదండి స్వామి. పాతాళభైరవి గుహకు’’ అన్నాడు రాముడు.
‘‘నాకు అర్థరైటిస్ రా. అందుకని సర్వీస్ ఆటోలో పోదాం’’.

‘‘మళ్లీ ఇంకో కొత్త బకరానా’’ అన్నాడు ఆటోవాడు.
‘‘రోజూ ఒకణ్ణి తీసుకెళుతున్నావా స్వామీ’’ ఆశ్చర్యంగా అడిగాడు రాముడు. ‘‘రోజూ ఒకణ్ణి తీసుకొస్తాడు. వచ్చేటప్పుడు వాడు కనపడడు. ఈయనొక్కడే గడ్డం గోక్కుంటూ వస్తాడు’’.

‘‘నేనేం చేసేది రా. కొలనులో స్నానం చేసి రమ్మంటే, ప్రతివాడూ మొసలితో సెల్ఫీ తీసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. శాప విమోచనం సంగతి మరిచిపోయి, అది తిని పడేస్తూ ఉంది’’ చెప్పాడు మాంత్రికుడు.
‘‘మీ గడ్డంలో మంత్రశక్తులున్నాయా?’’ అడిగాడు తోటరాముడు.

‘‘పేలున్నాయి. అందుకే ఎప్పుడూ గోక్కుంటూ ఉంటాడు’’ చెప్పాడు ఆటోవాడు. మాంత్రికుడు, రాముడు ఇద్దరూ కలిసి పాతాళభైరవి గుహలోకి వెళ్లారు. ‘‘స్నానం గీనం వద్దు స్వామి. ఆ నీళ్లకు గజ్జి తామర వస్తాయి. మళ్లీ జాలిమ్ లోషన్ కొనాలి. సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలో చూపించండి చాలు’’

‘‘తెలివైనవాడివే’’ అని మాంత్రికుడు నవ్వుకుని తన సెల్‌ఫోన్‌లో జాందేవ్ బాబా ఆసనాల్ని యూట్యూబ్‌లో ఓపెన్ చేసి సాష్టాంగం విజువల్స్ చూపించాడు.

‘‘నమ్మి నమస్కరించినవాడి గొంతు కోయడం కొత్తేమీ కాదు కానీ, ఇద్దరం ద్వైపాక్షిక ఒప్పందానికొద్దాం. నా ఫోన్‌లో ఆల్రెడీ నా తల నరికే గ్రాఫిక్ షాట్స్ తెచ్చాను. అది అమ్మవారికి చూపిద్దాం. ఓల్డ్ లేడీ నమ్మేస్తుంది’’ అన్నాడు రాముడు.  గ్రాఫిక్స్ షాట్స్ చూసి సంతోషించి అమ్మవారు పాతాళభైరవి విగ్రహాన్నిచ్చింది.

‘‘రాజకీయాల్లో పదవులు పంచుకోడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మనం కూడా ఒక అగ్రిమెంట్‌కి వద్దాం. ఈ విగ్రహంతో నేను మిద్దెలు, మేడలు సృష్టించి రాజుగారికి చూపించి రాకుమారిని పెళ్లి చేసుకుంటాను. రాజ్యమే నాది అయినప్పుడు ఈ తుప్పు పట్టిన విగ్రహం నాకెందుకు? నీకిచ్చేస్తా. నీ చావు నువ్వు చావు’’ అన్నాడు రాముడు.

మాంత్రికుడు సరేనన్నాడు.
విగ్రహం సాయంతో భవంతులు సృష్టించి రాజావారిని రమ్మన్నాడు. వచ్చారు. ‘‘చూడండి మహారాజా.. మణిమయ, రత్న వజ్ర వైఢూర్య సహిత భవంతులు’’అన్నాడు తోటరాముడు. ‘‘ప్రేమ పిచ్చెక్కి, నీకు చత్వారమొచ్చింది రాముడూ. గుడిసెను చూపించి భవంతులంటున్నావే’’.

రాముడు కళ్లు నులుముకుని ‘‘నాకు కనిపిస్తున్నాయి కదా’’ అన్నాడు.

‘‘నాకు కనబడలేదు’’.
విగ్రహాన్ని రుద్ది పాతాళభైరవిని రప్పించాడు రాముడు.
‘‘నాకు కనిపించే భవంతులు ఈయనకెందుకు కనిపించడం లేదు’’ అని అడిగాడు. ‘‘గ్రాఫిక్స్ నాయనా. నువ్వు నాకు గ్రాఫిక్స్ చూపిస్తే, నేను నీకు అదే గ్రాఫిక్స్ చూపించాను. కంప్యూటర్ పుట్టకముందే మాకు గ్రాఫిక్స్ తెలుసు. గుర్తుంచుకో’’ అంది పాతాళభైరవి.
‘టప్’ అని నాటకాల్లో పళ్లెం కొట్టిన సౌండొచ్చింది.
- జి.ఆర్.మహర్షి

మరిన్ని వార్తలు