సర్ప సందేశం!

28 Dec, 2015 00:46 IST|Sakshi
సర్ప సందేశం!

  ‘‘పాపం...  దానికింత జండూబామ్ ఇచ్చే దిక్కుండదు. కానీ నడుములు పడిపోయేలా డాన్స్ చేస్తుంటుందిరా’’ అన్నాడు రాంబాబు.
 ‘‘ఎవరది?’’ విషయం తెలియక అడిగా.
 ‘‘ఇంకెవరు... మన నాగుపామే. పగలూ, రాత్రీ తేడా లేకుండా ఎవడి నిధి, నిక్షేపాలకో సెక్యూర్టీ గార్డు డ్యూటీ చేస్తుంటుందా! రోజంతా నెత్తిన మణి పెట్టుకొని ఆ మోతబరువంతా మోస్తుందా! మళ్లీ మరో చోట గారడీవాడి జేబులోకి నాలుగు కాసులు రాలడానికి, పొద్దస్తమానం వాడి బుట్టలో పడుకోడానికి తయారు. దాని త్యాగాన్ని చూస్తే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి రా’’ అన్నాడు రాంబాబు గాడు.
 
 రోజురోజుకూ మా రాంబాబు ధోరణికి బీపీ రెయిజ్ అవుతోంది నాకు.
 ఏది ఏమైనా వాడిని దారికి తెచ్చుకోవాల్సింది నేనే కదా. అందుకే వాడికి రెండు హితవు మాటలు చెప్పా.
 ‘‘ఒరేయ్ లోకమంతా ఓ దారయితే నువ్వు మరో రూటు రా. కాటేసే పాముకు  మంచితనం ఏంట్రా?’’ అని అననైతే అన్నాను కానీ...
 వాడు చెప్పింది విన్న తర్వాత నాకూ పెద్దగా తప్పనిపించలేదు. అలంకార్ టాకీస్ దగ్గర గారడీవాడు ప్రదర్శించిన, ఉచిత పబ్లిక్ షో చూసి వస్తున్నాట్ట. వెంటనే వాడు నాగుపాము పక్షం వహించాడు.

 ‘‘అదెంత మంచిదో... దాని శ్రమను అప్పనంగా దోచుకునే గారడీవాణ్ణి చూడు. అదెంత మంచిదో... అమాయకంగా వాడు ఆడించినట్టల్లా ఎలా ఆడుతుందో చూస్తే  తెలుస్తుంది. ఒక్క వాడికనే ఏమిటిలే అలనాటి మన శ్రీదేవి దగ్గర్నుంచి మొన్నటి మల్లికా షెరావత్ వరకూ అందరికీ తన రోల్స్ ధరించే అవకాశం ఇచ్చింది. తన కాస్టూమ్స్ వేసుకునే ఛాన్స్ ఇచ్చింది. అప్పట్లో ఫ్యామిలీ డాక్టర్లలా ఫ్యామిలీ పాములుండేవి. నువ్వు నమ్మవుగానీ... అప్పట్లో ఫ్యామిలీ పాముల కాన్సెప్టుతో నోము లాంటి సినిమాలూ వచ్చేవి. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ ఎవరిమాటా కాదనదురా పాపం పాము...’’

 ‘‘సామాన్యుల మాట కూడా కాదనదా?’’
 ‘‘అవును. నాగుల చవితి రోజున పాలు పోస్తుంటే తన ఒళ్లూ ఇల్లూ గుల్లయ్యేలా పబ్లిక్  పాలు పోస్తున్నా...  వద్దు అనదు రా అది. ఏమైనా చెప్పాలంటే పళ్లు లేక, కోరలు పీకి ఉన్న అది ‘బుస్ బుస్’ అంటూ మూగగా రోదిస్తుంటుంది. గారడీవాడు బూర పైకి లేపినప్పుడల్లా ఇది తోక మీద లేవాలి కదా. దాంతో వాడి బూర ఊదుడుకు తగ్గట్లు డాన్స్ చేయడానికి దాని తల ప్రాణం తోకకు వస్తుందిరా’’ అన్నాడు.

 ‘‘ఇంకొక్క మాట మాట్లాడితే బుర్ర బద్దలు కొట్టేస్తా. ఇంక నోర్ముయ్’’ అని కోప్పడ్డాను. వెంటనే వాడు... ‘‘ఒరేయ్... మంచితనం అన్నది కొబ్బరి నీళ్ల లాంటిది, కానీ సదరు మంచితనాన్ని మన ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలంటే బొండాకు బొక్కెట్టకుండా, టెంకాయను పగలగొట్టకుండా, పాముకు పడగ విప్పనియ్యకుండా పనవుతుందా? అందుకే రా అనాదిగా నీలాంటి వాళ్ల చేతుల్లో మాలాంటివాళ్ల బుర్రబద్దలు అవుతూనే ఉన్నాయి. గారడీవాడి బూరలకు అమాయకప్పాముల పడగలు వాచిపోతున్నాయి’’ అంటూ ఆవేశపడ్డాడు.
 ఇలా మాటల్లో నడుస్తూ, నడుస్తూ... మా అక్కవాళ్ల ఇంటి దగ్గరకు చేరాం.

 నేను చెబితే ఎలాగూ వినడం లేదు. పెద్దవాడు... కనీసం మా బావతోనైనా చెప్పిద్దామని ఆయనతో విషయమంతా చెబితే... ‘‘పాములు విషం కక్కుతాయనీ, నేను నిజం కక్కుతాననీ ప్రతీతి. అయినా రాంబాబు గాడు చెప్పింది నిజమేనేమోరా... అంతే అందంగా ఉండి, ఒకవేళ విషం గానీ లేకపోతే మన నాగుపామును పెంచుకోవాలని ఉబలాటపడనివాడు ఎవడైనా ఉంటాడా? అయినా ఒక్క మాట చెబుతా వినండ్రా. అక్రమంగా ‘మనీ’ సంపాదించే ‘కాల్’నాగుల కంటే... మన కాలనాగు బెటర్ కాదంటావా?’’ అన్నాడు మా బావ చిద్విలాసం చిందిస్తూ!!
                     - యాసీన్
 
 

మరిన్ని వార్తలు