షాడో ప్లే

12 Feb, 2017 23:21 IST|Sakshi
షాడో ప్లే

హ్యూమర్‌ ప్లస్‌

షాడో ప్లే గురించి ఒకాయన ఉపన్యాసం మొదలుపెట్టాడు.‘‘మన లోపల ఆత్మ ఉన్నా లేకపోయినా, మనకంటూ ఒక నీడ తప్పనిసరిగా వుంటుంది. మనం పుట్టినప్పుడే అది పుడుతుంది. నవ్వితే నవ్వుతుంది. ఏడిస్తే ఏడుస్తుంది. ఒక్కోసారి మనకంటే పొట్టిగా వుంటుంది. సమయం కలిసొస్తే పొడుగ్గా మారుతుంది. మన ముందు నడుస్తూ దారి చూపిస్తున్నట్టు నటిస్తుంది. వెనుక నడుస్తూ ముందుకి తోస్తుంది.
దానికి చీకటంటే భయం. వెలుతురులోనే స్నేహం చేస్తుంది. మనం వెలిగిపోతున్నపుడు ఆనందంగా నృత్యం చేస్తుంది. పౌర్ణమినాడు వెన్నెలలా కనిపిస్తుంది. అమావాస్యలో అంతర్ధానమవుతుంది. కారుచీకటిలో కన్ను పొడుచుకున్నా కనిపించదు.నిజానికి షాడో ప్లే అంటే నీడల్ని మనం ఆడించడం కాదు. నీడలే మనల్ని ఆడించడం. నీడలో జంతురూపాల్ని మనం ప్రదర్శించనక్కరలేదు. నీడలు, జంతువులు ఒక్కలాగే వుంటాయి. చాలాసార్లు మనలోని జంతువు నీడలా మన మీదికి దూకుతుంది. కానీ జంతువు మనలో లేదని బుకాయించుకుంటాం. జంతువెప్పుడూ ఎదుటివారిలో వుందనుకుంటేనే మన అహం తృప్తి చెందుతుంది. మనకు నీడ వున్నట్టే, మనం ఇంకెవరికో నీడగా వుండడానికి ఇష్టపడతాం. ఒకరికొకరు నీడల్లా వుంటూ, ఎవరు ఎవరి నీడో తెలియనంతగా గందరగోళానికి గురవుతాం. ఒక్కోసారి మనం నీడతో యుద్ధం చేస్తాం. ఇద్దరూ సమానవేగంతో యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం. అయినా మనమే గెలిచామనుకుని మీసం మెలివేస్తాం. నీడ కూడా గెలిచాననే అనుకుంటుంది.

‘‘ప్రజాస్వామ్యానికి, షాడో ప్లేకి ఏమిటి సంబంధం?’’ ఒక శ్రోత అడిగాడు.‘‘నీడలు హక్కుల గురించి మాట్లాడడమే ప్రజాస్వామ్యం. నిజానికి రాజకీయాల్లో మనుషులు మాయమై చాలా కాలమైంది. ఇప్పుడు నీడలే మిగిలాయి. ఒక నీడ ఇంకో నీడ ఉనికిని ప్రశ్నిస్తూ వుంటుంది. నీడ ప్రమాదకరమని నీడలే వాదిస్తూ వృక్షాలని నరికేస్తున్నాయి. గొడ్డలిని చేతబట్టినవాళ్ళే మొక్కల సంరక్షణపై ఉపన్యాసాలిస్తారు.’’ ఇలా మాట్లాడుతూ వుండగానే కొన్ని నీడలొచ్చి అతన్ని దుడ్డుకర్రతో చావబాదాయి.‘‘నీడల గురించి ఎవరు మాట్లాడినా దుడ్డుతో కానీ, దుడ్డుకర్రతో కానీ చావబాదడం మా పాలసీ. నీడలే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. రూపం కంటే ప్రతిబింబమెప్పుడూ అందంగా వుంటుంది. ఎందుకంటే అది భ్రాంతి కాబట్టి. భ్రాంతిని ప్రేమించాలని అన్ని వేదాంత గ్రంథాలు చెబుతూనే వున్నా, నీలాంటి వాళ్లు అనవసర మీమాంసతో హింసిస్తున్నారు’’ అని చెప్పి అతన్ని నాలుగు తన్నింది.దెబ్బకి దెయ్యమే వదులుతున్నప్పుడు, నీడలకి సంబంధించిన వాస్తవజ్ఞానం మాత్రం మిగులుతుందా?మనవాడి ఉపన్యాస సరళి మారింది.‘‘రామరాజ్యమంటే నీడల రాజ్యమే. రాజ్యం నీడలదే అయినప్పుడు, నీడలు రాజ్యమేలకుండా వుంటాయా? నీడని నమ్మితే నీడ మనల్ని నమ్ముతుంది. నిజాన్ని భ్రాంతి మోసం చేస్తున్నప్పుడు, నిజం తన రూపాన్ని మార్పుకోక తప్పదు. నీడని నిజమని నమ్మితే ప్రజలకి, ప్రజాస్వామ్యానికి క్షేమకరం!

– జి.ఆర్‌. మహర్షి

మరిన్ని వార్తలు