ఆల్ లైక్ లైక్స్

28 May, 2015 22:45 IST|Sakshi
ఆల్ లైక్ లైక్స్

హ్యూమర్ ప్లస్
 
నిద్రలేవడంతోనే సుబ్బలక్ష్మి బిజీ. దారినపోయే కుక్కపిల్లని ఫొటో తీసి ఫేస్‌బుక్‌లో గుడ్‌మానింగ్ అని పోస్ట్ చేసింది. అప్పటికే ఫేస్‌బుక్ నెట్‌వర్కంతా జూలు దులిపి నిద్రలేచింది. ఎవరికి వాళ్లు విజృంభించారు. ‘ఆ కుక్కకి ఎంచక్కా ఓ బ్రెడ్ ముక్క అందిస్తే ఏం పోయిందక్కా’ అని ఓ చెల్లి కామెంట్.  ‘బ్రెడ్డు, గుడ్డు... దాని ఫుడ్డు కాదు చెల్లీ’ అని సమాధానం. ఎన్ని లైక్‌లు వచ్చాయో ఇరువర్గాలూ లెక్కచూసుకుని కత్తినూరి తలా ఒక పోస్ట్ వదిలారు.  ‘ఈవాళ వడియాలు ఎండలేదెందుకో’ అని ఇంకో ఆవిడ వచ్చి బాణం వదిలింది.
 
‘ఎండలేదు కదా’ అని పంచ్. ఫేస్‌బుక్ సిటీ బస్సులా ఒక్క కుదుపునకు గురైంది.  ‘ఉప్మా ఇలా మాడిందేమిటి చెప్మా’ అని నల్లటి బాణలి ఫొటో. ‘ఉప్మా చేయడమే ఒక తప్మా, అది తింటే పైకి టప్మా’ అని కామెంట్. ఆపై ఉప్మా మేకర్సంతా గోదాలోకి దిగారు. ఉప్మాకి, సిమెంట్ కాంక్రీట్‌కి తేడా తెలియకుండా వండడమెలాగో ఒకరు వివరించారు. కొందరు మగ కుక్‌లు కూడా చొరబడి ‘ఉప్మా - ఒక జనాభా నివారణ’ అని చర్చపెట్టారు. తాను వండిన ఉప్మా తిని ఇల్లు వదిలి ఎటో వెళ్లిపోయిన వాళ్లావిడ గురించి ఒకాయన వాకబు చేశాడు. ఆమె తిరిగి ఇల్లు చేరకుండా ఉండేలా సహకరించినవారికి తగిన బహుమతి ఇస్తానని ప్రకటించాడు. స్త్రీవాదులంతా ఒంటికాలిపై లేచి వాడిని ఎడాపెడా ఫుట్‌బాల్ ఆడారు. ఇంతలో సుబ్బలక్ష్మి భర్త సుబ్బారావు నిద్రలేచాడు. ఇంద్రుడు వజ్రాయుధాన్ని అందుకున్నట్టు సెల్ తీసు
 కున్నాడు. ‘కాఫీ ఉంటేనే సూఫీయిజం. టోపీ ఉంటేనే సోషలిజం’ అని కవిత్వం వదిలాడు. వహ్వా అని లైక్స్ వచ్చాయి.
 ‘ఎడ్డెమంటే తెడ్డెమంటే సంసారం. గడ్డం అడ్డమైతే జీవనసారం’ అని ఇంకోటి వదిలాడు. సుబ్బలక్ష్మి కోసం అటు ఇటు చూసి గడ్డం గీసుకునే సెల్ఫీని వాట్సప్‌లో పెట్టాడు.

 అది చూసి సుబ్బలక్ష్మి ‘మీరు సింహం లాంటివాళ్లు. అది గడ్డం గీసుకోలేదు. మీరు గీసుకుంటారు’ అని కామెంట్ పెట్టింది.
 ‘సింహమే కానీ పెళ్లయ్యాక గర్జన మరిచిపోయింది’ అని సుబ్బారావు. ‘ఆర్జన మరిచిపోకండి. అది ముఖ్యం’ - సుబ్బలక్ష్మి.
 టిఫిన్ ఏం చేయాలా అనే విషయంపై ఇద్దరూ కాసేపు మెసేజ్‌లు పెట్టుకుని చివరికి ఫాస్ట్‌ఫుడ్స్‌లో పార్సిల్ తెప్పించుకోవాలని నిర్ణయించుకున్నారు.ఎవరి ఫేస్‌బుక్‌లు వాళ్లు చదువుకుంటూ ఇద్దరూ ఆఫీసులకి బయలుదేరారు.

 బస్సెక్కిన తరువాత ‘సిటీ బస్సు కిటకిట, ఎక్కినవారు తకిటతకిట’ అని పోస్ట్ చేశాడు సుబ్బారావు. పొలోమని అందరూ బస్సులపై పడి తమ అభిప్రాయాల్ని ప్రకటించారు.‘ఆఫీస్‌లో ఉక్కబోత, జీవితమే కష్టసుఖాల కలబోత’ అని సుబ్బలక్ష్మి లైకర్సంతా ఎండాకాలాన్ని ఉతికి ఆరేశారు. క్యాంటీన్‌లో ఏం తింటున్నారో ఇద్దరూ ఫొటోలు పెట్టుకునిఓదార్చుకున్నారు. సాయంత్రం ఇల్లు చేరారు.

 టీ తాగుతూ ‘పొగకి, పగకి తేడా ఏంటంటే, పొగ పైకి పోతుంది. పగ పైకి పంపుతుంది’ అని సుబ్బారావు పోస్ట్ చేశాడు. ‘సంసారం ఒక పొగ, దాంపత్యం ఒక పగ’ అని సుబ్బలక్ష్మి. ‘సెగ కూడా.’ ఇలా పోస్టింగ్‌లు, మెసేజ్‌ల తరువాత అలసిపోయి నిద్రపోయారు. వరద బాధితులు, భూకంప బాధితుల్లాగా వీళ్లు ఫేస్‌బుక్ బాధితులు.
 - జి.ఆర్.మహర్షి
 

మరిన్ని వార్తలు