పండగ చేస్కో

8 Apr, 2016 00:40 IST|Sakshi
పండగ చేస్కో

హ్యూమర్ ఫ్లస్

జీవితంలో చేదు, వగరు, పులుపే ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా తీపి తగిలే టైం వస్తే అప్పుడు మనకు సుగరొస్తుంది. ఈ సత్యం తెలిసే మనకు ఉగాది పచ్చడి పెడతారు. నిజానికి మనం టెక్నాలజీ రుచి మరిగి అసలు రుచుల్ని గుర్తుపట్టే స్థితిలో లేము. ఒకాయనకి ఫేస్‌బుక్ చూస్తూ భోంచేయడం అలవాటు. లైక్‌లు కొట్టికొట్టి అలసిపోయి చెయ్యి కడుక్కుంటాడు. చికెన్ చాలా బావుందని భార్యకి చెబుతాడు. ఆమె వాట్సాప్ మెసేజ్‌ల్లో ఇరుక్కుపోయి థ్యాంక్సండీ అంటుంది. నిజానికి అతనేం తిన్నాడో అతనికి తెలియదు. ఏం వండిందో ఆమెకి గుర్తులేదు.

ఇంకొకాయన సన్నాసుల్లో కలిసిపోయాడు. ఈయన దగ్గర సెల్‌ఫోన్ వున్నందువల్ల తమలో కలుపుకోవడానికి సన్నాసులు నిరాకరించారు. భార్య తనతో ఫేస్‌బుక్‌లో తప్ప ఫేస్ టు ఫేస్ మాట్లాడ్డం లేదని అలిగి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఏరోజుకారోజు భర్త తన ప్రొఫైల్ పిక్చర్ అప్‌డేట్ చేస్తే తప్ప అతన్ని ఆమె గుర్తుపట్టలేదు. చేతిలో సెల్‌ఫోన్ లేకుండా కనిపిస్తే ఆమెను అస్సలు అతను గుర్తుపట్టలేడు.

అతనికోసం ఆమె వెతక్కుండా ఫేస్‌బుక్ పోస్టింగ్ పెట్టింది. చూసి చూడనట్టున్నాడు. ఒకరోజు జుత్తు విరబోసుకున్న ఫోటోని అప్‌డేట్ చేసేసరికి శ్మశాన వైరాగ్యం ఆవరించి సెల్‌ని చితకబాది కాశీలోని హరిశ్చంద్ర ఘాట్‌లో సెటిలైపోయాడు. ‘ఇల్లు ఇల్లనేవు, సెల్లు సెల్లనేవు చిలకా’ అని పాడుతూ ఎవరికో కనిపించాడట. భర్త ఈరకంగా కాశీమజిలీ యాత్ర చేశాడని ఆమె పోస్టింగ్ పెడితే రెండొందలమంది లైక్ కొట్టారు. మొగుడ్ని సన్యాసుల్లో కలిపే చిట్కా వివరించమని కోరుతూ ఐదొందలమంది వాట్సప్ మెసేజ్‌లు పెట్టారు.పల్లెటూళ్లలో కూడా సోషల్ మీడియా వచ్చేసింది. ఫలానా సుబ్బమ్మకి చాలా టెక్కులు అని పోస్టింగ్ పెడితే అన్నివర్గాల వారు లైక్‌లు నూరి కామెంట్లు అతికిస్తున్నారు. కుళాయిల దగ్గర కొట్టుకోవడం మానేసి వాట్సప్ గ్రూపుల్లో యుద్ధం చేస్తున్నారు.
 

 ఎండల దెబ్బకి ఈసారి కవుల గొంతు కూడా మూగబోయేలా ఉంది. గొంతు సవరించుకునేలోగా దాహమేసి నీళ్లు తాగేస్తున్నారు. గతంలో కవిత్వం చదివి శ్రోతల చేత మూడు చెరువుల నీళ్లు తాగించేవాళ్లు కూడా ఈసారి సేఫ్‌సైడ్‌గా వాయిస్‌మెయిల్‌ని ఆశ్రయిస్తున్నారు.కవిత్వాన్ని మెయిల్ చేస్తే అవతలివాళ్లు దాన్ని జాగ్రత్తగా డౌన్‌లోడ్ చేసి సమ్మేళనాల్లో వినిపిస్తున్నారు. శ్రోతలు వహ్వా అనకపోయినా, నిర్వాహకులే ముందస్తుగా వహ్వాలు రికార్డు చేసి, అవతలిపక్షానికి డౌన్‌లోడ్ చేయిస్తున్నారు. నిజానికి కవుల గొంతు లోడ్ చేసిన తుపాకీ లాంటిది. ట్రిగ్గర్ నొక్కితే పశుపక్ష్యాదులు కూడా కకావికలే.

 

ఈ పొల్యూషన్‌కి కోయిలలకి కూడా గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినట్టుంది. పాడ్డం మానేశాయి. కనపడుతున్నట్టు కూడా లేదు. లేదంటే ఫేస్‌బుక్స్ వాళ్లు విజృంభించి ఫోటోలు పెట్టేవాళ్లు. ఉగాదినాడు ఎవరి పంచాంగాలు వాళ్లు చదువుకుంటారు. అందరికీ అన్నీ శుభాలే జరుగుతాయంటారు. పులికి, మేకకి ఏకకాలంలో శుభం జరగడం అసాధ్యం. దేవుడు ఎప్పుడూ ఒకరిపక్షానే ఉంటాడు. ఎక్కువసార్లు పులిపక్షంలో ఉంటాడు. కనపడని పులితో జూదమాడ్డమే పులిజూదం.

 మాటలన్నీ మాయమై మెసేజ్‌లుగా మారిపోతున్నాయి. అన్నిటినీ గూగుల్ సెర్చ్‌లో వెతుక్కునే మనం, ఏదో ఒకనాడు మనల్ని మనమే వెతుక్కుంటాం. వెతుక్కున్నా దొరకం. మనల్ని మనం గుర్తుపట్టలేకపోవడమే మాడ్రన్ లైఫ్. ఎప్పుడో ఒకరోజు పండగ రావడం కాదు. ఎప్పుడూ పండగలా జీవించడమే నిజమైన ఉగాది. - జి.ఆర్. మహర్షి

మరిన్ని వార్తలు