జీవోల ఎలుక...

17 Apr, 2016 00:09 IST|Sakshi
జీవోల ఎలుక...

హ్యూమర్ ఫ్లస్

 

ఒక ఎలుక సెక్రటేరియట్ కలుగులో నివసిస్తూ ఉండేది. చిన్నప్పుడే దానికి జ్ఞానదంతం మొలిచింది. దాంతో దొరికిన ప్రతి జీవో కాగితాన్ని తినేసింది. ప్రభుత్వ పారిభాషిక పదాలన్నీ కంఠతా పట్టేసింది. నిద్రలో లేపి అడిగినా జీవోలు అప్పజెప్పేది. తోటి ఎలుకలతో కూడా జీవో భాషతోనే సంభాషించేది. ‘‘జీవో నంబర్ 79 ప్రకారం నిర్దిష్ట నిర్మాణాత్మక, నిష్టుర నిర్హేతుక, సాంకేతిక, చట్టబద్ధ, ఛందస్సహిత తాత్పర్య, విమోచనం దృష్ట్యా క్యాంటిన్ ఉత్తరం వైపున మనకీ రోజు భోజనం దొరకొచ్చు’’ అని చెప్పేది. అక్షరమ్ముక్క అర్థంకాకపోవడం వల్ల సాటి ఎలుకలు దాన్ని జ్ఞానిగా పరిగణించేవి. అనేక జీవోల మధ్య ఇరుక్కుపోయిన అధికారులు, ఏ జీవో ఎందుకుందో అర్థంకాక తలలు బద్దలు కొట్టుకునేవారు. అప్పుడు మన జ్ఞాన ఎలుక వచ్చి మాటసాయం చేసేది.


‘‘జీవో నం. 22లో ప్రజాబాహుళ్య చట్టపర, చర్యాత్మక, విశ్రాత్మ పరమాత్మ చేతన్ చేన్ తోడన్ తోన్, విభక్తి, అన్వయ, ప్రత్యామ్నాయ దోషరహిత కార్యాచరణవల్ల ప్రజలకు మేలు జరగొచ్చు’’ అని అధికారులు చెప్పేవారు. ‘‘మీరు పొరపడుతున్నారు. జీవో నంబర్ 36, సవరణ నంబర్ 116 ప్రకారం చేతనాత్మక ప్రక్రియలో స్థూలవిచారణ, సూక్ష్మదర్శినితో శోధన, సాధన, వేదన, సంవేదన సకలాత్మక, గుణాత్మక, క్రియాత్మక శూన్యంలోంచి కాలానుగుణ త్రిలోక దండకారులై మసలితే జనానికి క్షేమం’’ అని ఎలుక సవరించేది. ఇలా జరుగుతూ ఉండగా జ్ఞానికి మరో జ్ఞాని ఎదురవడం సంభవమే కాబట్టి పొరుగూరి ఎలుక దారి తప్పి సెక్రటేరియట్‌లోకి చొరబడింది. జ్ఞానదంతం వల్ల అది కూడా జ్ఞానీకరించబడి ఉంది.


‘‘జీవో నంబర్ 170 ప్రకారం ఎలుకైనా, చిలుకైనా, పంచదార పలుకైనా ఈ కార్యాలయ క్రమబద్ధీకరణ, యోగ్యతాపత్ర, కార్యోన్ముఖ, సహిష్ట, సంతుష్ట, సంభావనాదృష్ట్యా ప్రవేశం నిషిద్ధం’’ అని జ్ఞాన ఎలుక అంది. ఈ భాష విని కొత్త ఎలుక కొంచెం కంగారుపడింది. అవతలివాడు మనకి అర్థంకానపుడు మనమంటే ఏమిటో అర్థం అయ్యేలా మాట్లాడాలి. ‘‘అయ్యా మీ జీవోల గురించి నాకు తెలియదు. నంబర్ల ప్రకారం లెక్కలే నడవనపుడు ఇక ఎలుకలేం నడుస్తాయి.  దంతాలున్నవాడికి జీవోలతో పనిలేదు. దంతంలోనే వేదాంతం, సిద్ధాంతం దాగున్నాయి. జీవోలున్నవి తిండి తనడానికే. నమిలి తినాలన్నా, కొరికి తినాలన్నా దంతాలుండాలి. అజీర్ణమే అజ్ఞానం. జ్ఞానాన్ని ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి తీసుకోవడం దేవుడి అజ్ఞానం. జ్ఞానమైనా, దంతమైనా ఊగిసలాడుతున్నపుడే జాగ్రత్తపడితే, ఊడిపోకుండా కాపాడుకోవచ్చు. అంతటా తాను ఉండలేడు కాబట్టి దేవుడు ఈ భూమ్మీద డెంటిస్ట్‌ని సృష్టించాడు. పళ్లతోపాటు డబ్బుని రాలగొట్టడం వారి విధి. గతంలో నేను దంత వైద్యశాలలో పనిచేయడం వల్ల ఈ అనుభవం సంపాదించాను’ అని కొత్త ఎలుక చెప్పింది.‘‘దంత వైద్యశాలలో ఎలుక పనిచేయడం ఎలా సాధ్యం?’’ అని జీవో ఎలుక అడిగింది.


 ‘‘డాక్టర్లకైనా, అధికారులకైనా ఇప్పుడు దంతసిరి ముఖ్యం. జనాన్ని కొరికి నమలాలి. అందువల్ల నన్ను ఎలుకగా గుర్తించలేకపోయారు. నువ్వు సెక్రటేరియట్‌లో ఉన్నప్పుడు నేను డెంటిస్ట్ దగ్గర ఉండకూడదా?’’ ఎలుకలు ఇలా సంవాదిస్తుండగా ఒక పిల్లి నిశ్శబ్దంగా వచ్చి ఎలుకల తోకల్ని కాలితో అదిమి పెట్టింది. ఎలుకలు గాబరాపడ్డాయి. ‘‘జీవో నంబర్ 99 ప్రకారం విచిత్ర ఉన్మత్త, వేదాంత స్థితిగతి యోచనలో క్రూరపరివర్తన మార్జాల ప్రవేశం నిషిద్ధం’’ అని జీవో ఎలుక బెదిరించింది. కొత్త ఎలుక బెదిరిపోతూ ‘‘అయ్యా నా వేదాంతమంతా తిండికోసమే కానీ, ఇతరులకు తిండిగా మారడానికి కాదు’’ అంది. సత్యాన్ని తేలిగ్గా ఒకప్పుకున్నందుకుగానూ దాన్ని గుటుక్కున మింగి మ్యావ్‌మని త్రేన్చింది పిల్లి.


జీవో ఎలుక మాత్రం తనకు తెలిసిన జీవోలన్నీ వివరిస్తూ పిల్లికి చట్టపరంగా వచ్చే చిక్కులు గురించి హెచ్చరించింది. అంతా సావధానంగా విన్న పిల్లి ‘‘వొరే పిచ్చోడా, ఎలుకల చట్టం పిల్లికి పనికిరాదు. జీవోల ప్రకారం ప్రభుత్వాలే నడవవు. ఇక పిల్లేం నడుస్తుంది. ఎలుక తెలుసుకోవాల్సింది జీవోలు కాదు, పిల్లి అడుగుల చప్పుడుని. పిల్లిని గుర్తించడమే ఎలుకకి దివ్యజ్ఞానం. ఎలుకని పిల్లి తినాలని జీవోలో ఉంది నీకు తెలియదా?’’ అంది.‘‘ఎన్నో నంబర్ జీవో’’ ఉక్రోషంగా అడిగింది ఎలుక.  ‘‘జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ కాదురా కుయ్యా గాడ్స్ ఆర్డర్’’

 - జి.ఆర్. మహర్షి

 

మరిన్ని వార్తలు