ఎక్కడివి నీకు?!

30 Aug, 2019 08:05 IST|Sakshi
తమిళ చిత్రం ‘కుంబసరమ్‌ – ది కన్ఫెషన్‌’లో హనీ రోజ్‌ (ప్రతీకాత్మక చిత్రం)

ఫాలోవర్‌

ఏం చేస్తోంది? ఎక్కడ ఉంటోంది? ఎవరితో ఉంటోంది? ఏం కొంటోంది? ఏం కట్టుకుంటోంది? ఇవి కావాలి అతడికి. కానీ అతడిలా ఆమె మళ్లీ లాగిన్‌ అవలేదు. మనిషిలోంచే లాగవుట్‌ అయినప్పుడు, మనిషి అకౌంట్‌లోకి ఎందుకు లాగిన్‌ అవుతుంది?

విడిపోయాక కూడా భర్త ఎందుకు భార్యను వెంటాడుతుంటాడు! ఎందుకు ఆమెను, ఆమె ఇక్కట్లను, ఆమె బ్యాంక్‌ అకౌంట్‌లను ఫాలో అవుతుంటాడు? ఎందుకు రోజూ ఫోన్‌ చేసి వంద ప్రశ్నలు వేస్తుంటాడు? మనిషిగా స్థానం కోల్పోయాక కూడా అతడిలోని భర్త పీఠం దిగిపోడెందుకని?!

భార్యాభర్తలవి మంచి ఉద్యోగాలు. భర్త నాసా వ్యోమగామి. భార్య యు.ఎస్‌. ఎయిర్‌ఫోర్స్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌. ప్రస్తుతం ఆమె ఉద్యోగం చేయడం లేదు. కొడుకును చూసుకుంటూ ఇంట్లోనే ఉంటోంది. వాడి వయసు ఐదేళ్లు. కడుపున పుట్టినవాడు కాదు. ఆమె అండంతో వేరే స్త్రీ కడుపున పెరిగి పుట్టిన బిడ్డ వాడు.

భర్త ఇప్పుడు ఆమెతో ఉండటం లేదు. ఆమే ఉండనివ్వలేదు! పట్టింపు వచ్చి వేరుగా ఉంటున్నాడు. పట్టింపు వచ్చింది కొడుకు దగ్గర. వాడిని తనకు దత్తత ఇచ్చేయమంటాడు! ‘ఇవ్వలేను’ అంది భార్య. అయినా కొడుకును తండ్రి దత్తత అడగడం ఏమిటి? ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం ఓపిక అవసరం. వీళ్ల పెళ్లయ్యేనాటికే ఆ బిడ్డకు ఏడాది వయసు. కాబోయే భార్యకు బిడ్డ ఉన్నాడని తెలిసీ పెళ్లి చేసుకుని భర్త అయ్యాడు అతడు. భర్త అయ్యాడు తప్ప తండ్రి అవలేకపోయాడు. ఆ బాధ అతడిలో ఉండిపోయింది. వాడి తొలి అడుగులు చూశాడు. వాడి తొలి మాటలు విన్నాడు. నాకూ వీడిలో భాగం ఉంటే ఎంత బాగుండేది అనుకునేవాడు ఎత్తుకుని ఆడిస్తూ. ఓరోజు అలాగే ఆడిస్తూ ‘వీడిని నాకు ఇచ్చేయ్‌’ అన్నాడు. భార్య నవ్వింది. ‘ఇచ్చేయడమేంటి? మన బిడ్డే కదా’ అంది. ‘పెళ్లి చేసుకుంటేనే కదా నువ్వు నా భార్యవయ్యావ్‌. దత్తత తీసుకుంటేనే వీడు నా బిడ్డ అవుతాడు’ అన్నాడు. భార్య అయోమయంగా చూసింది. ‘నేనివ్వను’ అంది. ‘కడుపు చించుకుని పుట్టకపోయినా, నా కణాలు చీల్చుకుని పుట్టినవాడు వీడు. నేనివ్వను’ అంది.. బిడ్డను భర్త చేతుల్లోంచి లాక్కుని వాడి ఒంటి నిండా ముద్దులు పెడుతూ. భర్త అసూయగా చూశాడు! ‘వాడు నాకు పుట్టకపోవచ్చు, వాడిని నువ్వు నాకు దత్తత ఇవ్వకపోవచ్చు. కానీ పేరెంట్‌గా వాడి మీద నీతో సమానంగా నాకూ హక్కుంటుంది’ అన్నాడు. భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు హక్కు ఉండొచ్చు. భార్యాభర్తల మధ్య మాత్రం హక్కు అనే మాట రాకూడదు. వచ్చిందా ఇక అది ఇద్దరూ వేరవడానికే! భర్త నుంచి భార్య విడిపోయింది. భార్య విడిపోయింది కనుక కొడుకు మీద తం్రyì గా తన సగం హక్కు తనకు ఇప్పించమని కోర్టుకు వెళ్లాడు భర్త. ‘నేను లేకపోతే వాడు ఉండలేడు’ అని కోర్టు హాల్లో బోరుమన్నాడు. ‘వాడు లేకపోతే నేను ఉండలేను’ అని బోరుమనడానికి లోపల ఏదైనా అడ్డుపడి ఉండొచ్చు. ఇప్పుడింకా కేసు కోర్టులోనే ఉంది. ఒక కేసు కాదు. రెండు కేసులు. ఒకటి విడాకుల కేసు. అది అక్టోబర్‌లో తీర్పుకు వస్తోంది. రెండోది.. బిడ్డను ఒకరి తర్వాత ఒకరు మార్చి మార్చి దగ్గర ఉంచుకునే కేసు. దాని తీర్పుపై జడ్జిగారేమీ మాట్లాడలేదు. కొత్తగా ఇప్పుడు ఇంకో కేసు వచ్చి చేరింది! ఆ భర్తపై ఆ భార్య వేసిన కేసు అది. నీకూ నాకు ఏం సంబంధం లేదని ఆమె విడిపోయాక కూడా ఆమె బ్యాంక్‌ అకౌంట్‌లలోకి అతడు లాగిన్‌ అవుతున్నాడు.

భార్యాభర్తలు : సమ్మర్‌ వోర్డెన్, యాన్‌ మెక్లెయిన్‌
స్త్రీని స్త్రీ వివాహం చేసుకున్నప్పుడు కూడా ఆ దంపతులలో ఒకరికి భర్త లక్షణాలు ఎలా వస్తాయి? బాయ్‌ కట్, బలిష్టమైన భుజాల కారణంగానా లేక అది వివాహ వ్యవస్థ మహత్యమా?!
‘కారు కొన్నట్లున్నావ్‌? ఎక్కడివి నీకు డబ్బులు?’ అని ఈమధ్య ఫోన్  చేసి అడిగాడు. ఇంకా డబ్బుల విషయాలేవో చాలా అడిగాడు. అప్పుడొచ్చింది ఆమెకు అనుమానం.. భర్త తన బ్యాంక్‌ అకౌంట్‌లు చూస్తున్నాడేమోనని. గతంలో ఆమె ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కాబట్టి తన అకౌంట్‌ ఎక్కడి నుంచి లాగిన్‌ అవుతున్నదీ తేలిగ్గానే ఎంక్వయిరీ చేయించింది. నాసా వాళ్ల కంప్యూటర్‌ నుంచి అవుతోందది! నాసా అంటే ఇంకెవరు? భర్తే. గత ఏడాది డిసెంబర్‌–ఈ ఏడాది జూన్‌ మధ్య అతడు అనేకసార్లు ఆమె బ్యాంక్‌ అకౌంట్‌లు తెరిచి చూశాడు. అయితే ఆ టైమ్‌లో అతడు భూమి మీద లేడు. పైన భూకక్ష్యలో తిరుగుతుండే ‘ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌’లో ఉన్నాడు.. మిగతా వ్యోమగాములతో కలిసి నట్లూ బోల్టులూ బిగిస్తూ. ఉన్నవాడు ఉండకుండా భార్యమీద కూడా ఓ కన్నేసి ఉంచాడు. భార్య వదిలేసి వెళ్లిపోయినా అతడింకా ఆమె చుట్టూనే పరిభ్రమిస్తున్నాడు. ఏం చేస్తోంది? ఎక్కడ ఉంటోంది? ఎవరితో ఉంటోంది? ఏం కొంటోంది? ఏం కట్టుకుంటోంది? ఇవి కావాలి అతడికి. అంత ఎత్తుకు వెళ్లినా కిందే ఉండిపోయాడు! ‘‘కలిసి ఉన్నప్పుడు ఒకే పాస్‌వర్డ్‌ షేర్‌ చేసుకున్నాం. విడిపోయాక కూడా తను పాస్‌వర్డ్‌ మార్చుకోలేదంటే నేను తన అకౌంట్‌లు చూసినా పర్లేదనేగా’’ అని అతడి వాదన! అతడి అకౌంట్‌ పాస్‌వర్డ్‌ ఆమె దగ్గరా ఉంది. కానీ అతడిలా ఆమె మళ్లీ లాగిన్‌ అవలేదు. మనిషిలోంచే లాగవుట్‌ అయినప్పుడు, మనిషి అకౌంట్‌లోకి ఎందుకు లాగిన్‌ అవుతుంది? కానీ అతడు అలా ఉండలేకపోయాడు. పూర్వపు భార్యాభర్తలే అయినా అకౌంట్‌లలోకి చొరబడడం నేరం. అతడిని ఏ సెక్షన్‌ కింద అరెస్టు చేయాలో ఇప్పుడు పోలీసులకు పాలుపోవడం లేదు. నేరం జరిగింది అంతరిక్షంలో! అంతరిక్షంలో జరిగిన తొలి నేరం కూడా ఇదే. అతడు అమెరికన్‌ కాబట్టి అమెరికా చట్టాల ప్రకారం శిక్ష విధిస్తారేమో మరి. ఒక వేళ అతడి భార్య రష్యన్‌ అయివుంటే నేరస్థుల అప్పగింత ఒప్పందం ప్రకారం అమెరికా అతడిని రష్యాకు అప్పగించవలసి వచ్చేదేమో.

ఇక ఇప్పుడు అసలు విషయం. విదేశీ భార్యాభర్తల పేర్లు భర్తెవరో, భార్యెవరో మనం వెంటనే క్యాచ్‌ చేయగలిగేలా ఉండవు. ఈ దంపతులలో భార్య పేరు సమ్మర్‌ వోర్డెన్‌. భర్త పేరు యాన్‌ మెక్లెయిన్‌. ‘సమ్మర్‌ వోర్డెన్‌ బ్యాంక్‌ అకౌంట్‌లను యాన్‌ మెక్లెయిన్‌ దొంగతనంగా చూశాడు అంటే.. ‘చూశాడు’ అనే మాటను బట్టి అతడు భర్త అని అర్థం చేసుకోవడమే. అయితే ఈ భార్యభర్తల్ని అలాక్కూడా అర్థం చేసుకునే వీలు లేదు. ఎందుకంటే ఇద్దరూ స్త్రీలే! ఎక్కడో కలుసుకున్నారు. మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. పిల్లవాడి విషయంలో గత ఏడాదే విడిపోయారు. భర్త వయసు నలభై. భార్య వయసు కొంచెం తక్కువ. ఇద్దరూ స్త్రీలే అయినప్పుడు భర్తేమిటి? భార్యేమిటి? నిజమే. భర్త అనకూడదు. భార్య అనకూడదు. జీవిత భాగస్వామి అనాలి. సమ్మర్‌ వోర్డెన్‌కు పొడవాటి జుట్టు ఉంటుంది. ముఖం కోమలంగా ఉంటుంది. మెక్లెయిన్‌ది బాయ్‌ కట్‌. బలమైన బాడీ. వీటిని చూసి వోర్డెన్‌ని భార్య అని, మెక్లెయిన్‌ని భర్త అని ఎవరైనా అంటే అనొచ్చు. చుట్టుపక్కల వాళ్లు అనేస్తున్నారు కూడా. బిడ్డకు చందమామను చూపిస్తూ ఆడించే తల్లి మనసు వోర్డెన్‌లో ఉంది. ‘అదుగో.. ఆ చందమామ మీదకు వెళ్లొచ్చాడ్రా మీ నాన్న.. ’ అని బిడ్డకు గర్వంగా చెప్పుకుని, వాడి కళ్లల్లో ఆశ్చర్యం చూడాలనుకునే తండ్రి మనసు మెక్లెయిన్‌లో ఉంది. అలా కూడా ఆ ఇద్దరు స్త్రీలు భార్యాభర్తలు కావచ్చు. ఎలాగైనా కావచ్చు కానీ.. విడిపోయాక కూడా సతాయిస్తూ, బిడ్డ ముద్దు మురిపాలలో వాటా కావాలని వేధిస్తూ, నిఘా వేసి నీడలా వెంటాడుతూ, తెలిసినవాళ్లకు తెలియనివాళ్లకూ అలాంటిదనీ ఇలాంటిదనీ చెబుతూ ఉన్నందువల్ల ఇద్దర్లో ఒకరు భర్త స్థానంలోకి వెళ్లిపోవడం అంటే స్త్రీ స్త్రీగా నిలబడలేని బలహీనతలోకి కూలబడటమే. నాసా త్వరలో చంద్రుడి మీదకు తొలిసారిగా ఒక స్త్రీని పంపబోతోంది. ఆ లిస్టులో మెక్లెయిన్‌ పేరు కూడా ఉంది. పరీక్షల్లో ఆమె నెగ్గితే మెక్లెయిన్‌ చంద్రుడి మీదకు వెళుతుంది. అప్పుడైనా మెక్లెయిన్‌లోని ‘భర్త’ కిందికి దిగుతాడా?!-మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు