మీ ఇంటి స్త్రీని ధ్వంసం చేయకముందే..!

7 Feb, 2019 00:29 IST|Sakshi

మామూలుగా అయితే అతడు భర్త అవుతాడు.కడుపున జన్మించినవాడు కొడుకు అవుతాడు.కానీ భర్త, కొడుకు ఒకరితో ఒకరు ఘర్షణ పడితే వారు ఆమెకు శత్రువులౌతారు. వారు పెట్టే ఒత్తిడి ఆమెను శిధిలం చేస్తుందని ఎప్పటికి గ్రహిస్తారు?

సూపర్‌ మార్కెట్‌లో కొన్న సరుకులను డ్రైవర్‌ తీసుకుని కారులో పెడుతుంటే ఫ్రెండ్‌ కనిపించింది.‘హాయ్‌ రుక్కూ’ సంతోషంగా చేతులు పట్టుకుంది.‘ఊ... లగ్జరీ కారు... డ్రైవరు... బాగుందోయ్‌ నీ సంగతి’ అంది మెచ్చుకుంటూ.రుక్కు అనబడే రుక్మిణికి కూడా స్నేహితురాలు కనిపించడం బాగనిపించింది.‘ఇంటికి రారాదూ ఒకసారి’ అని పిలిచింది.‘వస్తాను.. వస్తాను.. నీ భవంతిని తప్పక సందర్శిస్తాను. ఎలా ఉన్నారు మీ ఆయన నీ పిల్లలు’ ఫ్రెండ్‌ అడిగింది.‘వాళ్లకేం. మా ఫ్యాక్టరీ మెల్లగా లాభాల్లో పడింది. పెద్దాడు ఎంబిఏ చేసి ఫ్యాక్టరీ పనులు చూసుకోవడం రెండు నెలలుగా మొదలెట్టాడు. చిన్నాడి చదువు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. లైఫ్‌ హ్యాపీగా ఉంది’....చెప్తున్న రుక్మిణి వైపు స్నేహితురాలు సాలోచనగా చూసింది.ఇద్దరిదీ దాదాపు ఇరవై ఏళ్ల స్నేహం. చిన్నప్పటి నుంచి కాలేజీ వరకూ కలిసి చదువుకున్నారు.

అందుకే అంది–‘కాని నువ్వు సంతోషంగా లేవు రుక్కూ. ఎందుకో సంతోషంగా లేవు. చెక్‌ చేసుకో. మళ్లీ కాల్‌ చేస్తాను’ అంటూ సూపర్‌ మార్కెట్‌లోకి వెళ్లిపోయింది.రుక్మిణికి కలవరంగా అనిపించింది ఆ మాటలకు.‘ఎలా కనిపెట్టింది?’ అనుకుంది.ఇంటికి చేరుకునేసరికి మధ్యాహ్నం రెండు దాటింది. అన్నం తినాలనిపించలేదు. ఈ మధ్య ఇలాగే ఉంటోంది. ఏదో ఆందోళన.ఫ్యాక్టరీలోని రిసెప్షనిస్ట్‌కి ఫోన్‌ చేసింది.‘సార్‌ ఎక్కడున్నారు?’‘ఆయన కేబిన్‌లో ఉన్నారమ్మా’‘చిన్న సారు’‘చిన్నసారు తన కేబిన్‌లో ఉన్నారు’‘ఇద్దరూ కలిసి భోజనం చేశారా?’‘లేదు... ఎవరికి వారు చేసినట్టున్నారు’‘ఏం టెన్షన్‌ లేదు కదా’‘ఏం టెన్షన్‌ లేదమ్మా’ఆ అమ్మాయి అంటోంది కాని నమ్మకం కలగడం లేదు. టెన్షన్‌ ఉంది. ఫ్యాక్టరీలో ఉంది. ఇంట్లో కూడా ఉంది.వారం క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది.తండ్రీ కొడుకులు ఇద్దరూ కోపంగా ఇంటికొచ్చారు.

కొడుకు విసురుగా తన గదిలోకి వెళ్లిపోయాడు. తండ్రి బుసలు కొడుతూ డ్రాయింగ్‌ రూమ్‌లో కూలబడ్డాడు. వాళ్లను అలా చూడటం ఆమెకు అదే మొదలు.‘ఏమైందండీ’‘ఫ్యాక్టరీలో నా పరువు తీశాడు’‘అదేంటి?’‘మన దగ్గర ఇరవై ఏళ్లుగా పని చేస్తున్న సీనియర్‌ వర్కర్‌ను పనిలో నుంచి తీసేశాడు. వాడొచ్చి నా దగ్గర మొరపెట్టుకున్నాడు. అలా తీయడం కరెక్ట్‌ కాదని చెప్పాను. అందరి ముందు నా మాట లెక్క చేయకుండా తీసేయాల్సిందే అని అకౌంట్‌ సెటిల్‌ చేసి పంపించాడు. ఏంటిది?’కొడుకు లోపలి నుంచి వచ్చాడు.‘మీ నిర్ణయమే చెల్లుబాటయ్యేటట్టుంటే నాకెందుకు ఫ్యాక్టరీ అప్పజెప్పినట్టు. రెండు నెలలుగా చూస్తున్నాను. నా ప్రతి మాటను మీరు తీసిపడేస్తున్నారు. వర్కర్లు బాగా లెక్కలేనితనానికి అలవాటు పడి ఉన్నారు. ఒక్కరూ సరిగ్గా పని చేయడం లేదు. చాలా అవకతవకలు ఉన్నాయి. సరిచేద్దామంటే చేయనిస్తేగా’‘నోర్మూయ్‌.

నీకేం తెలుసని. నిన్నగాక మొన్నొచ్చావ్‌. ఏ నిర్ణయానికైనా అనుభవం ఉండాలి’కొడుకు తల్లివైపు చూశాడు.‘ఇదమ్మా వరుస. ఇలాగైతే నాకు ఫ్యాక్టరీ వద్దూ ఇల్లూ వద్దు. వెళ్లిపోతాను’‘పోరా... పోతే పో. బెదిరిస్తున్నావా’ఆమెకు మెల్లగా తలనొప్పి మొదలైంది. గుండె దడ మొదలైంది. ఆ రాత్రి డిన్నర్‌ చేయడానికి అనువైన ఆకలీ చచ్చిపోయింది.పెద్దకొడుకును ఎం.బి.ఏ చదివించింది ఫ్యాక్టరీ కోసమే. చదువైపోయాక ఫ్యాక్టరీ అజమాయిషీని చూసుకోవాలన్నది కూడా కుటుంబ నిర్ణయమే. కొడుక్కి ఆ పని ఇంట్రెస్ట్‌ కూడా. కాని ఈ అధికార బదిలీ స్మూత్‌గా జరగడం లేదు. కొడుకు దూకుడుకి తండ్రి అడ్డం పడుతున్నాడు. అవరోధం అవుతున్నాడు. కంగారు పడుతున్నారు. దీనివల్ల ఒకరినొకరు అవమానించుకుంటున్నారు. శత్రువులుగా మారుతున్నారు.ఇందుకు వొత్తిడి వారికి ఉండాలి. కాని నలిగిపోతోంది తను.

రాత్రి భర్తకు సర్దిచెప్పబోయింది.‘చూడు... రూపాయికి గతిలేని రోజుల నుంచి రక్తమాంసాలు కరిగించి ఫ్యాక్టరీని ఈ స్థాయికి తెచ్చాను. వీడిలాగే పిచ్చివేషాలేస్తే దానిని అమ్మిపారేస్తాను’ అన్నాడు భర్త.కొడుక్కు సర్ది చెప్పబోయింది.‘అమ్మా... ఆయన నన్ను ఉద్యోగిగా అనుకుంటున్నాడా యజమానిగా అనుకుంటున్నాడా అది తేల్చు ముందు’ అన్నాడు.అప్పటి నుంచి తనకు ఏమిటోగా ఉంటోంది. మనసులో ఏమిటోగా. మెదడులో ఏమిటోగా. తృప్తిగా భోం చేసి చాలా రోజులు. అసలు ఇంట్లో అందరూ కలిసి భోజనం చేసి చాలా రోజులు. ఈ మధ్యాహ్నం కూడా తన పొట్ట ఖాళీయేనా?ఇంతలో రిసెప్షనిస్ట్‌ దగ్గర నుంచి ఫోన్‌ వచ్చింది.‘అమ్మా.. పెద్దసారు చిన్నసారు కేబిన్‌లోకి వెళ్లారు. ఇద్దరూ అరుచుకుంటున్నారు’అంతే. అప్రయత్నంగా ఆమె చేయి నుదురును తాకింది. తల కొట్టుకుంటూనే ఉంది. కొట్టుకుంటూనే ఉంది.

కొట్టుకుంటూ కొట్టుకుంటూ అలానే పడిపోయింది.‘ఈమెను తెచ్చారేమిటి... రావాల్సింది మీ ఇద్దరు కదా’ అంది లేడీ సైకియాట్రిస్ట్‌ రుక్మిణి భర్తను, కొడుకును చూస్తూ.వాళ్లు అర్థం కానట్టు చూశారు.‘నేను ఆమెతో మాట్లాడాను. ఇక మాట్లడాల్సింది మీతోనే. మీ మగవాళ్లు ఎప్పటికి మారతారు? మీరు ఆడవాళ్లతో గొడవపడితే వొత్తిడికి లోనయ్యేది ఆడవాళ్లే. మీరూ మీరూ గొడవపడినా ఒత్తిడి చెందేది ఆడవాళ్లే. భర్త హోదాలో మీరూ కొడుకు హోదా ఇతనూ చెరోవైపు ఆమెను గట్టిగా లాగేసరికి రెక్కలు తెగి పడిందామె. రామ్మోహన్‌రావుగారూ... కొందరు ఉన్నతోద్యోగులు రిటైరైనా తాము ఇంకా అధికారంలో ఉన్నామనుకుంటారు. అలా ఉంది మీ మానసికస్థితి. మీరు ఫ్యాక్టరీ నుంచి తప్పుకునే సమయం వచ్చిందని మీరు అంగీకరించడం లేదు. మీ కొడుకును ఒక సమర్థుడుగా గుర్తించడం లేదు.

అతడు కూడా తప్పులు ఒప్పులు చేసి మీలాగే నేర్చుకుంటాడన్న సంగతి మర్చిపోయి అవమానిస్తున్నారు. మీరు సలహాదారుగా ఉండగలరు తప్ప అజమాయిషీదారుగా ఉండకూడదని ఇప్పటికైనా గ్రహించి మీ కుమారుడికి విలువ ఇవ్వండి. అలాగే నువ్వుకూడా చూడు బాబు.. తండ్రితో ఫ్యాక్టరీలో గొడవపడి తండ్రి మర్యాద పోగొట్టడం పెద్ద హీరోయిజం అని ఫీలవుతున్నావు. ఆయన వల్లే నువ్వు. నీ వల్ల ఆయన కాదు. మీరిద్దరు కొట్లాడుకుంటున్నారన్న సంగతి బయటకు పొక్కితే కుటుంబగౌరవం పోతుంది. ఫ్యాక్టరీ ప్రమాదంలో పడుతుంది. అధికారం నువ్వు పొందలేదు. వారసత్వంగా దక్కించుకున్నావు.

దానికి తగ్గ యోగ్యత ప్రదర్శించి నమ్మకాన్ని పొందేవరకు మీ నాన్నగారి సలహాలు పాటించు. ఏ అనుభవమూ వృథాపోదు. అన్నింటికంటే ముఖ్యం... కోపతాపాలు మిషన్లకు తెలియవు. నడుస్తాయి. కాని మనిషికి తెలుస్తాయి. మీ కోపతాపాలు మీ ఇంటి స్త్రీని ధ్వంసం చేయకముందే మేల్కొనండి’....తండ్రీ కొడుకులు ముఖాముఖాలు చూసుకున్నారు.నెల రోజులు గడిచాయి.సూపర్‌ మార్కెట్‌లో రుక్మిణికి మళ్లీ స్నేహితురాలు కనిపించింది.హుషారుగా కనిపిస్తున్న రుక్మిణిని చూసి ‘అమ్మయ్య... నా పాత రుక్కూలానే ఉన్నావ్‌’ అంది దగ్గరకు తీసుకుని కావలించుకుంటూ.ఆడవాళ్లు సంతోషంగా ఉంటే సమాజం సంతోషంగా ఉన్నట్టే.
– కథనం: సాక్షి ఫ్యామిలీ
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా