నీ కడుపు సల్లంగుండ

1 Jun, 2019 07:11 IST|Sakshi
చేతులు లేని వృద్ధురాలికి నీరు తాగిస్తున్న శంకరన్న

జలదాత

వేసవిలో ప్రధాన చౌరస్తాలలో, కాలనీ రోడ్లపై, బస్టాండ్, రైల్వే స్టేషన్‌ల వద్ద చలివేంద్రాలను  మనం చూస్తూనే ఉంటాం. బాటసారుల దాహార్తిని తీర్చేవారి సేవానిరతి అభినంద నీయం. అయితే ఫుట్‌పాత్‌లపై నడవలేని వారు, కళ్లులేని వారు మనకు కనిపిస్తూనే ఉంటారు. అలాంటి వారు అక్కడెక్కడో చౌరస్తా దగ్గర లేదా కాలనీ ప్రధాన రోడ్డుపై ఏర్పాటు చేసిన  చలివేంద్రానికి వెళ్లలేరు కదా... మరి అలాంటి వారి పరిస్థితి ఏమిటి? సమాజం పట్ల ప్రేమ ఉన్న ఓ వ్యక్తి  చలివేంద్రాన్నే వారి వద్దకు తీసుకు వెళ్తున్నాడు. అదెలా.. అనే సందేహం కలుగుతుంది కదా! ఎలాగో చూద్దాం.

కదిలించిన ఆ రోజు సంఘటన...
ఓ రోజు ఫుట్‌పాత్‌పై ఖాళీ వాటర్‌ బాటిల్‌తో ఓ నడవలేని భిక్షగాడు బాటిల్‌లో నీళ్లు నింపి ఇవ్వండి అంటూ.. అటుగా వెళ్లే బాటసారులను బతిమాలుతున్నాడు. ఇదంతా ఆటో నడుపుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి గమనించాడు. ఆటో నడుపుతున్నా.. తన మనసులో మాత్రం ఆ రోజు మధ్యాహ్నం చూసిన సంఘటన మెదులుతూనే ఉంది. ఏదో చేయాలనే తపన ఆ వ్యక్తిలో మొదలయ్యింది. ఆ తపనే ఆ వ్యక్తిలో మంచి ఆలోచనకు శ్రీకారం చుట్టింది.

చలివేంద్రాన్ని వారి వద్దకే తీసుకెళ్తే పోలా...
ఆ రోజంతా తనలో జరిగిన అంతర్మథనానికి వచ్చిన ఆలోచనకు ఆచరణ రూపం తీసుకొచ్చాడతను. రోజు మాదిరిగా ఆ రోజు ఉదయం ఆటోని తీసుకుని బయల్దేరాడు. వెళ్తూ.. వెళ్తూ.. ఓ థర్మాకోల్‌ డబ్బా కొని అందులో ఒక పెద్ద ఐస్‌ ముక్కను పెట్టి, దానిపైన వాటర్‌ ప్యాకెట్లతో నింపేశాడు. ఫుట్‌పాత్‌లపై ఉన్న వారికి ఆ వాటర్‌ ప్యాకెట్లను ఇచ్చుకుంటూ తన సవారితో బిజీబిజీగా ఉన్నాడు. ఆ రోజు సాయంత్రం తనను కదిలించిన సంఘటన ప్రాంతం నుంచే సవారీతో వెళ్తున్నాడు.  అక్కడకి రాగానే వెంటనే తన ఆటోలో ఏర్పాటు చేసుకున్న డబ్బా నుంచి చల్లటి వాటర్‌ ప్యాకెట్లను తీసుకుని ఆ ఫుట్‌పాత్‌పై ఉన్న వ్యక్తికి ఇచ్చాడు. వాటర్‌ ప్యాకెట్లు తీసుకున్న ఆ వ్యక్తి ‘‘సల్లగా ఉండు నాయనా’’ అని ఆశీర్వదించాడు. ఇంతకీ ఇదంతా చేస్తున్న వ్యక్తి గురించి చెప్పలేదు కదూ...

సమాజాన్ని మేల్కొలిపే పాటలు రాస్తూ...
కేవలం పదో తరగతి వరకే చదువుకున్న శంకరన్న సమాజాన్ని మేల్కొలిపే పాటలు రాయడం విశేషం. తన సొంతంగా పాటలు రాస్తూ.. పాడుతూ.. పెద్దల మన్ననలు పొందాడు. ఉప్పల్‌లో జరిగిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పారిశుద్ధ్యంపై పాడిన పాటకు జీహెచ్‌ఎంసీ కమిషనర్, అక్కడే ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల నుంచి మన్ననలు పొందాడు. అదే విధంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై శంకరన్న రాసిన పాట ఓ పత్రికలో ప్రచురితమైంది. మందు బాబులకు మత్తు వదిలేలా ఉన్న ఆ పాటకు అభినందనలు వెల్లువెత్తాయి. కాని ఆ పాటతో సహా ఎన్నో పాటలు తన వద్ద డబ్బులు లేక రికార్డింగ్‌ చేయించలేకపోయాడు. అయినా నిరాశ చెందలేదు.. తన అభిరుచినీ వదులుకోలేదు శంకరన్న. పాటలు రాస్తూ.. తన జీవితాన్ని గడుపుతున్నాడు.

మండుటెండల నుంచి తొలకరి వరకు ..
అంబర్‌పేటలో నివసించే ఇరుగు శంకరన్న ఇరవై ఏళ్లుగా ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత మూడేళ్లుగా అతను ‘శక్తి కొద్ది సేవ’ పేరుతో అభాగ్యులకు, భిక్షగాళ్లకు తాగునీరు అందిస్తున్నాడు. వృద్ధులు, వికలాంగులకు ఉచిత సేవ చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. శంకరన్న. సమాజానికి తన వంతుగా ఏదో చేయాలనే తపనతో ఉన్నదానిలోనే అలా ఖర్చు పెడుతూ సమాజం పట్ల తన ప్రేమను చాటుకుంటున్నాడు.
– సచీందర్‌ విశ్వకర్మ, సాక్షి సిటీ డెస్క్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా