లాయక్‌ అలీ విషాదం

24 Feb, 2020 04:08 IST|Sakshi

అనువాదం

మీర్‌ లాయక్‌ అలీ (1903–71) హైద్రాబాద్‌ సంస్థానం అస్తమించే రోజుల్లో తొమ్మిదిన్నర నెలలపాటు ప్రధానమంత్రిగా పనిచేసిన రాజమంత్ర ప్రవీణుడు. స్వతంత్ర భారత ప్రభుత్వం 566 స్వదేశీ సంస్థానాల్ని విలీనం చేసుకొన్న తర్వాత నిజాం సరకారును స్వాధీనం చేసుకొనేందుకు ప్రయత్నిస్తే, సైంధవునిలా అడ్డుకోవడానికి కృషి చేసిన అభినయ చతురుడు. నిజాం ప్రభుత్వాన్ని స్వతంత్ర భారతదేశంలో ప్రత్యేక స్వతంత్ర దేశంగా నిలపాలని శతధా ప్రయత్నించి విఫలుడైన వ్యక్తి. మునుపటి నిజాం ప్రభుత్వ ప్రధానులైన సర్‌ అక్బర్‌ హైదరీ, మిర్జా ఇస్మాయిల్‌ ఛత్తారీలను అసమర్థులుగా చిత్రించి, తన్ను తాను పరిపాలనా దక్షునిగా చెప్పుకొన్న చతుర వచోనిధి. ఈ మీర్‌ లాయక్‌ అలీ తన అనుభవాలను, భావాలను ‘హైద్రాబాద్‌ ట్రాజెడీ’ అన్న ఇంగ్లిష్‌ గ్రంథ రూపంలో(1962) గుదిగుచ్చాడు.

లాయక్‌ అలీ హైద్రాబాద్‌ స్వతంత్ర దేశంగానే వుండాలని వాదించాడు. నవాబు అదే భల్లూకపు పట్టు పట్టాడు. కాని సంస్థానపు ప్రజలు మాత్రం భారత ప్రభుత్వంలోనే విలీనం కావాలని అభిలషించారు. కానీ లాయక్‌ అలీ వాదన ఇంకోలా ఉంది: ‘‘హిందువులంతా మున్షీ, భారత్‌ భావించినట్లు భారత్‌ వైపు నిలబడక మాతృభూమి వైపు నిలబడ్డారు’’. అలాగే ఖాసిం రజ్వీని కూడా ఎంతో ఉదాత్త నాయకునిలా చిత్రించాడు. ‘‘మతసామరస్య నిర్వహణ పట్ల ఆయన చాలా ఆసక్తిగా ఉండేవాడు. రజాకార్లలో హిందువుల సంఖ్యను పెంచడం ఆయన జీవితాశయములలో ఒకటిగా ఉండేది. రజాకార్ల ఛత్రఛాయలో ఉన్నవారు అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోవాలని, అందరి అభిప్రాయాలను గౌరవించే సహన శీలతను పెంచుకోవాలని ఆయన బోధిస్తూ ఉండేవారు.’’ ఇక, నిజాం నవాబు గురించి రాసిన ఈ మాటలు ఆయన ప్రజా సంరక్షణకు ఎంతటి ప్రాధాన్యమిచ్చేవాడో తెలుస్తుంది. ‘‘మొదట డబ్బుకు, తర్వాత తన వ్యక్తిగత ఆధిపత్యానికే ప్రాధాన్యతనిచ్చేవాడు. వయసు పెరిగినకొద్దీ ఆయన అధికార కాంక్ష ఎంతగా పెరిగిందంటే, ఈర్ష్యతో ప్రభుత్వానికి కూడా స్వేచ్ఛనివ్వకపోయేవాడు.’’

హైద్రాబాద్‌ సంస్థానంపై భారత ప్రభుత్వ మిలిటరీ చర్యను ‘దుర్మార్గమైన బలం’గా పేర్కొన్న లాయక్‌ అలీ రచన ఇంకో వెర్షన్‌ వినడానికి పనికొస్తుంది. కానీ వ్యాఖ్యానం పట్ల జాగరూకతతో ఉండాలి. ఈ పుస్తకాన్ని కవి, విమర్శకుడు ఏనుగు నరసింహారెడ్డి సరళమైన భాషలో, సాఫీగా సాగే శైలిలో చక్కగా తెలుగులోకి అనువదించారు. 

 ఘట్టమరాజు

మరిన్ని వార్తలు