షైనెస్‌..

5 Feb, 2020 10:21 IST|Sakshi

ఫోన్‌ ఎడిక్షన్‌తో భావప్రకటన నైపుణ్యాన్ని కోల్పోతున్న యువత

ముఖాముఖి మాట్లాడేందుకు తడబాటు

వాట్సాప్‌ మెసేజ్‌లు, చాటింగ్‌లే కమ్యూనికేషన్స్‌గా మారుతున్న వైనం

సాక్షి, సిటీబ్యూరో: ‘‘పద్దెనిమిదేళ్ల వయసు. బీటెక్‌ చదువుతోంది. కానీ నోరు తెరిచి తండ్రితో నాలుగు మాటలు మాట్లాడలేదు. ఇంటికి చుట్టాలొచ్చినా పలకరించదు. తన లోకం తనది, అలాగని చదువులో ఏ మాత్రం వెనుకబడకుండా బాగానే చదువుతోంది. తనకు కావలసినవన్నీ తండ్రికి  వాట్సాప్‌లో మెసేజ్‌ చేస్తుంది. ఈ ధోరణి చూస్తోంటే ఆందోళనగా ఉంది..’ నగరానికి చెందిన ఒక ప్రముఖ మానసిక వైద్య నిపుణుడి వద్ద  వారం రోజుల క్రితం  హిమాయత్‌నగర్‌కు చెందిన ఒక తల్లి తన కూతురు ప్రవర్తన పట్ల వ్యక్తం చేసిన ఆవేదన ఇది. ‘ఇంటికి వచ్చిన అతిథులను బాగున్నారా అని కూడా పలకరించకపోతే  ఎలా..’ అని ఆ తల్లి ఆవేదన. ఇది ఆ ఒక్క తల్లి  ఆందోళనే కాదు. చాలామంది తమ పిల్లల తీరు పట్ల ఇదే  తరహా ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు రోజు రోజుకు ఇలాంటి మానసిక సమస్యలు  పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మానసిక వైద్యుల పరిభాషలో చెప్పే ‘షైనెస్‌’ (బిడియం) సమస్యల ఇటీవల కాలంలోపెరుగుతోంది. చాలా మంది పిల్లలు చదువుల్లో ర్యాంకులకు ర్యాంకులు సాధించినప్పటికీ  భావప్రకటన నైపుణ్యాన్ని  కోల్పోతున్నారు. మర్యాదపూర్వకమైన సంభాషణలు, పలకరింపులు కూడా ఈ తరం పిల్లలకు తెలియకుండా పోతోందని  మానసిక వైద్యనిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇరవై నాలుగ్గంటలు మొబైల్‌ ఫోన్‌కు అతుక్కుపోవడమేనని స్పష్టం చేస్తున్నారు.

చాటింగ్‌ తారకమంత్రం...
సాధారణంగా పిల్లలు గలగలా మాట్లాడుతూ ఇల్లంతా సందడి చేస్తుంటే ఇంటిల్లిపాది ఎంతో సంతోషంగా ఉన్నట్లు లెక్క. స్కూల్, కాలేజీల్లోనూ పిల్లల సందడి ఎంతో సృజనాత్మకంగా ఉంటుంది. పిల్లల అల్లరి కూడా ముచ్చటగా ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో మొబైల్‌ఫోన్‌కు అడిక్ట్‌ కావడం వల్ల చాలా మంది పిల్లలు షైనస్‌కు గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఎదుటి వ్యక్తి ముఖంలోకి చూసి స్పష్టంగా మాట్లాడలేకపోవడమే ఈ షైనస్‌ లక్షణం. తమకు ఏం కావాలన్నా, తాము ఎదుటి వారిని ఏదైనా అడగాలనుకున్నా వాట్సప్‌లో మెసేజ్‌ పోస్టు చేయడం అలవాటుగా మారింది. ‘ ఫేస్‌బుక్, వాట్సప్, ఇతరత్రా సోషల్‌ మీడియాలో బంధువులకు, స్నేహితులకు ఎంతో ఘనంగా పుట్టిన రోజు వేడుకలను పోస్టు చేస్తారు. కానీ సదరు వ్యక్తులు తారసపడినప్పుడు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పలేకపోతున్నారు’ అని విస్మయం వ్యక్తం చేశారు ప్రముఖ మానసిక వైద్యనిపుణులు డాక్టర్‌ సంహిత. ఇలాంటి పిల్లలు  ఆఖరికి తల్లిదండ్రులతోనూ స్పష్టంగా మాట్లాడలేకపోతున్నట్లు పేర్కొన్నారు. టీనేజ్‌ యూత్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. అన్నింటికీ ఇంటర్నెట్, మెబైల్‌ ఫోన్‌ తాకరమంత్రంగా భావించడమే ఇందుకు కారణం. భావప్రకటనా నైపుణ్యాన్ని అలవర్చుకోకపోవడం వల్ల, ఎదుటి వారి కళ్లల్లోకి సూటిగా చూస్తూ స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారు. దీంతో ఇలాంటి పిల్లలు బంధుమిత్రులు, ఇరుగుపొరుగు వారి మధ్య సరైన వ్యక్తిత్వం లేని వారుగా చులకనకు గురవుతున్నారు. ఎవరితో ఏం మాట్లాడాలో తెలియకపోవడమే వారు ఎదుర్కొంటున్న అసలు సమస్య. 12 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు వారిలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. 

‘సున్నితం’గా పెంచేస్తున్నారు....
పేరెంటింగ్‌లోని లోపాలు కూడా ఈ సమస్యకు కారణంగా మారుతున్నాయి. అమ్మాయిలు సున్నితంగా, ఒద్దికగా ఉండాలనే భావన, గలగలా మాట్లాడకుండా బిడియపడుతూ మాట్లాడాలని తల్లితండ్రులు పదే పదే చెప్పడం వల్ల కూడా  చాలామంది భావప్రకటన నైపుణ్యాన్ని కోల్పోతున్నారు. మర్యాదపూర్వకంగా మాట్లాడలేకపోవడమే కాదు, జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఎదుర్కోలేక విలవిలలాడిపోతున్నట్లు సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి విషయానికి పిల్లలు తమపైనే ఆధారపడేలా పెంచడం కూడా మరో ప్రధాన లోపం. అమ్మాయిల్లోనే కాదు. అబ్బాయిల్లోనూ ఇది ప్రబలంగానే ఉంది. ఇలాంటి వారు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించలేకపోతున్నారు. 

లోపాన్ని గుర్తించడమే పరిష్కారం  
మొబైల్‌ ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్‌ మీడియాకు బాగా అలవాటుపడడం వల్లనే  అభిప్రాయాలను, ఆలోచనలను, తమ భావాలను ప్రకటించలేకపోతున్నారనే లోపాన్ని మొదటి గుర్తిస్తే పరిష్కారం తేలిగ్గా లభిస్తుంది. సమస్య తెలిసిన తరువాత ఆ అలవాటు నుంచి దూరంగా ఉండాలి. వాటి పైనుంచి దృష్టి మళ్లించేందుకు, భావప్రకటన నైపుణ్యాన్ని పెంచుకొనేందుకు మంచి లిటరేచర్‌ చదవాలి. మంచి సినిమాలు, సాహిత్యం, స్నేహితులతో మాట్లాడం ఇందుకు దోహదం చేస్తాయి.  – డాక్టర్‌ సంహిత, మానసిక వైద్య నిపుణులు

మరిన్ని వార్తలు