మార్పు కోసం...

8 Nov, 2013 00:52 IST|Sakshi

అఖిల కొవ్వూరి... సింపుల్‌గా పరిచయం చేయాలంటే హైదరాబాద్ స్థాయిలో హార్లిక్స్ విజ్‌కిడ్స్ ఫైనలిస్ట్. త్వరలో అంతర్జాతీయ స్థాయిలో జరిగే విజ్‌కిడ్స్ కాంపిటీషన్ ఫైనల్స్‌లో పాల్గొనబోయే అమ్మాయి. విజ్‌కిడ్స్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల్లోని మేధ, ప్రజ్ఞ, వ్యక్తిత్వం, సృజనాత్మకతను, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని, వారిలోని కమ్యూనికేషన్ స్కిల్స్‌కు పరీక్షలు పెట్టి.. ఉత్తమ స్థాయి ప్రతిభ ఉన్న వారిని విజేతలుగా నిర్ణయిస్తారు. అలాంటి పోటీల్లో హైదరాబాద్ నగరానికి  ప్రాతినిధ్యం వహించబోతోంది. ఆమె ప్రత్యేకత ఇంతే కాదు. ఒక స్టూడెంట్ ఎన్జీవోగా అనాథలను, స్లమ్స్‌లోని పిల్లలను సంస్కరించడానికి పూనుకొంది. ఇంటర్మీడియట్‌స్థాయికే తన సేవాకార్యక్రమాలతో మంచి గుర్తింపు తెచ్చుకొంది.
 

ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులు మంచిస్థాయిలో మార్కులు సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకోవచ్చు, భవిష్యత్తులో చదువుపరంగానో, వ్యక్తిగత ప్రతిభ ద్వారానో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే ప్రయత్నాలు చేస్తుండవచ్చు.. అయితే అఖిల మాత్రం చదువు పక్కనపెట్టైనా సరే అనాథలు, స్లమ్స్‌లోని పిల్లల స్థితిగతులు మార్చాలని తపిస్తోంది. తనకు చేతనైనంత స్థాయిలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడానికి ప్రయత్నిస్తోంది. ప్రత్యేకంగా అనాథశరణాలయాలు, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి పిల్లలతో గడుపుతూ వారికి ఒక ‘అక్క’లా మెలుగుతూ, వైవిధ్యమైన చదువును బోధిస్తోంది.
 
 ఇగ్నైటీ...

 అనాథల సంస్కరణ కోసం తను చేపట్టిన ప్రాజెక్ట్‌కు ‘ఇగ్నైటీ’ అని పేరు పెట్టుకొంది అఖిల. జ్ఞానం, చదువు పట్ల పిల్లల్లో ఆసక్తిని పెంపొందించ డమే లక్ష్యమైన తన కార్యక్రమానికి ఈ పేరు పెట్టుకొంది. అత్యంత సాధారణమైన పరిస్థితుల మధ్య, సౌకర్యాల లేమితో ఉన్న పాఠశాలల్లోని విద్యార్థులకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అఖిల. చదువు, హాబీల పరంగా ప్రతిభను ప్రదర్శించాలనుకునే విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది.  ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే పిల్లలకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్‌ను పరిచయం చేయడం, వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించడానికి  పుస్తకపఠనం లాంటి  హాబీల మీద ఆసక్తిని పెంపొందించే ప్రయత్నం చేస్తోంది. ఫ్రెండ్స్, తెలిసిన వారి ద్వారా పుస్తకాలను సేకరించి ఆయా స్కూళ్ల గ్రంథాలయాలకు కానుకగా ఇస్తోంది.
 
 స్కూల్‌కు హాఫ్‌డే మాత్రమే..!

 తమ ఇంటి వాచ్‌మెన్ పిల్లలను చేరదీయడంతోటి సేవాకార్యక్రమాన్ని మొదలుపెట్టింది అఖిల. ప్రస్తుతం ‘హైదరాబాద్ పబ్లిక్ స్కూల్’లో 12వ తరగతి చదువుతున్న అఖిల మూడు సంవత్సరాల నుంచి తమ ఇంటికి దగ్గరలో  ఉండే ‘గతి ప్రభుత్వ పాఠశాల’తో కలిసి పనిచేస్తోంది. అక్కడి ఉపాధ్యాయులు కూడా సహకరించడంతో అఖిల పని సులువు అయ్యింది. ఒక ప్రముఖ పాఠశాలలో తను నేర్చుకొన్న వివిధ అంశాలను ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నేర్పిస్తుంది. ఆ తర్వాత తన కార్యక్రమాలను మరికొన్ని ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించింది. ఈ నేపథ్యంలో తను స్కూల్‌కు వెళ్లడాన్ని హాఫ్‌డేకే పరిమితం చేసుకొంది. మధ్యాహ్నమే స్కూల్ నుంచి అనాథశరణాలయాలు, స్కూళ్లకు వెళుతూ ‘ఇగ్నిటీ’ పనులు చూస్తోంది. ఈ విషయంలో తన తల్లిదండ్రులు సహకారం అందిస్తున్నారని అఖిల చెప్పింది.
 
 వినోదం, విజ్ఞానం...

 విద్యార్థులను ఒకవైపు ఎంటర్‌టైన్ చేస్తూనే వారికి చదువుపై ఆసక్తి పెంపొందేలా చేస్తున్నానని, ఒరిగమీ, డ్రాయింగ్, పెయింటింగ్, డ్రామా, డాన్సులు...మొదలైన కళల  విషయంలో ఆసక్తి ఉన్న వారి ప్రతిభను వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నానని అఖిల చెప్పింది. చదువు, విజ్ఞానానికి సంబంధించి ఇంటర్నెట్ నుంచి వీడియోలను సేకరించి పిల్లల కోసం ప్రదర్శిస్తోంది. ‘ఆరెంజ్‌లీవ్’ అనే ఎన్జీవోలో పని చేసిన అఖిల... తర్వాత ‘ఇగ్నిటీ’ని స్థాపించి తన పరిధిలో సేవాకార్యక్రమాలు చేస్తూ ‘భేష్’ అనిపించుకొంటుంది.
 
వ్యక్తిగత ప్రతిభ

భరతనాట్యం నేర్చుకున్న అఖిల ప్రముఖుల మధ్య ప్రదర్శనలు ఇచ్చింది. తమ కళాశాల పత్రికకు ఎడిటర్‌గా కూడా పనిచేసింది. ఈ నేపథ్యంతోనే విజ్‌కిడ్స్ ప్రోగ్రామ్‌కు ఎంట్రీ పొందింది. నవంబర్ 11 నుంచి 15 మధ్య బెంగళూరులో వివిధ దేశాల యువత పాల్గొనే విజ్‌కిడ్స్ కాంపిటీషన్‌లో పాల్గొనబోతోంది.
 

మరిన్ని వార్తలు