నేను ఎముకని!

13 Jul, 2016 23:19 IST|Sakshi
నేను ఎముకని!

ఆనంద్ ఆరడుగులుంటాడు. ఆజానుబాహువుగా పెరిగాడు. అతనికి ఆ రూపం,ఆ ఆకృతి ఇచ్చింది ఎవరనుకున్నారు?  మేమే... అంటే అతని ఎముకలం!
 
 
మేము ఏమేం చేస్తామో, ముందుగా ఇక్కడ క్లుప్తంగా చెబుతాం. అవేమిటంటే... ఆనంద్ నడవడానికి అతని శరీరంలోని సున్నిత అవయవాల రక్షణకు, శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడతాం. అంతేకాదు... అతని రక్తం కోసం రసాయనాలు, ఎంజైములు మాలోనే ఉత్పత్తి అవుతాయి. అలాగే ఆనంద్ శరీరానికి కావలసిన కాల్షియం వంటి లవణాలకు గిడ్డంగిలా ఉపయోగపడతాం. ఇవన్నీ ఎలా చేస్తామో ఇప్పుడు వివరంగా చెబుతాను.


మేము మొత్తం 206 సభ్యులం, అతని శరీరంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆకృతిలో ఉండి, ఒక ఎముకలగూడును తయారు చేసి అతని శరీరానికి అవసరమైన చట్రంలా ఉంటాం. దానిపై అతను మళ్లీ పైపై అందాలు దిద్దుకుంటాడనుకోండి. మా 206 మందిలో అతి చిన్నవాడి పేరు - స్టేపిస్, వాడు చెవి మధ్యలో ఉండి వినికిడికి సహాయపడతాడు. ఇక  అతి పొడవైన వాడు తొడ ఎముక.

ఆనంద్ పుట్టినప్పుడు మా సంఖ్య 300కు పైమాటే. అప్పుడు మేము మెత్తగా కూడా ఉండి కొంచెం వంగుతుంటాము. బహుశ ఆనంద్ అతని తల్లి గర్భం నుంచి అందువల్లనే సులువుగా బయటకు రాగలిగాడు. తరువాత ఆనంద్‌కు 18 సంవత్సరాలు వచ్చేసరికి మాలో పక్కపక్కనే ఉన్న కొంతమంది సభ్యులు ఒకరితో ఒకరు కలిసిపోయి పరిమాణం పెరుగుతుంది కానీ మా సంఖ్య 206కు తగ్గుతుంది.
 
తల దగ్గర పెట్టెలా...  ఛాతీ దగ్గర పంజరంలా...
తలలో మేము పలుచగా, కాని చాలా గట్టిగా ఉండి ఆనంద్ పుర్రెను ఒక పెట్టెలా తయారు చేస్తాము. దానిలో మెదడును దాచి దానికి రక్షణ కలిగిస్తాం. అలాగే 12 జతల పక్కటెముకలతో ఆనంద్‌కు అందమైన, విశాలమైన ఛాతీ ఇచ్చాం. దానిలో ఆనంద్ గుండెను, ఊపిరితిత్తులను దాచి, వాటికి రక్షణ కల్పిస్తాం. ఆనంద్ నిటారుగా నిలబడడానికి అతని కాళ్లు ఎంత అవసరమో, అంతే పని అతని వెన్నెముక కూడా చేస్తుంది. మొన్నటికి మొన్న ప్రపంచ యోగా రోజున చక్కగా ఆసనాలు వేసి మనకు చూపించాడు కదా! అతను అలా మెలికలు తిరుగుతూ, వంగడానికి సాయపడింది వెన్నులో ఉన్న మా సభ్యులే. అతడి వెన్నులో మావాళ్లు 33 మంది పూసల రూపంలో ఉంటారు.

 సంఖ్య ఎక్కువైనా సమష్టి బాధ్యతలు
 ఇక ఆనంద్ చేతిలోను, పాదంలోను మావాళ్లు చాలామందే ఉంటారు. మేమంతా భిన్నమైన పరిమాణం, ఆకారాలలో ఉండి సున్నితమైన పనులు చేస్తుంటాం. మీకు ఇప్పుడు ఓ సందేహం రావచ్చు. ఆనంద్ శరీరంలో మేము ఇంతమంది ఉన్నప్పుడు మేం ముక్కలు ముక్కలుగా కాకుండా సమష్టిగా ఎలా ఉంటామని? అది ఎలాగంటే, మమ్మల్ని ఒక దానితో ఒకదాన్ని కలుపుతూ గట్టి తాళ్లు (లిగమెంట్స్) ఉంటాయి. అంటే ఏ ప్రమాదాలోనైనా ఈ తాళ్లు తెగిపోతే మేము విడిపోయే అవకాశం కూడా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం... మాలో మేము ఒకదానితో మరొకటి జతకలిసే చోటును ఏమంటారో తెలుసా మీకు? అదేనండి ‘కీలు’. మీకు ఉన్న కదలిక అంతా వచ్చేది ఈ కీలు వల్లనే.

 నేనెలా రూపొందానంటే...?
 ఇక నేను ఎలా తయారయ్యానో చెబుతాను. కొలాజెన్ అనే మాంసకృత్తుల తాళ్లతో తయారైన సూక్ష్మమైన వల ఉంటుంది. ఆ వలలో కాల్షియం, పాస్ఫరస్ వంటి అనేక లవణాలు బందీలై, వలకు గట్టిదనం ఆపాదిస్తాయి. మాకు ఆ గట్టిదనంలో కూడా కొంత మెత్తదనం ఉంటుంది. మేము పిల్లల శరీరంలో ఉన్నప్పుడు బాగా వంగగలం. కానీ ఆనంద్ పెద్దవాడు. అలాంటప్పుడు మాకు వంగే శక్తి తగ్గి, కొంత పెళుసుగా మారుతాం. ఎముకలలో ఈ పదార్థంలో (ఆస్టియోబ్లాస్ట్), ఆస్టియోక్లాస్ట్ అనే కణజాలం ఉంటుంది. మొదటి కణాలు నిరంతరం ఎముకను కరిగిస్తూ ఉంటాయి. నాలోని పదార్థం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఇప్పుడు నాలో ఉన్న మాంసకృత్తులు, లవణాలలోని 10 శాతం వచ్చే ఏడాది ఉండవు. సరికొత్తవి వచ్చి చేరతాయి. కాని ఆనంద్‌కు సుమారు 35 సం॥వచ్చేవరకు వచ్చే ఎముక పదార్థం ఎక్కువ, కరిగిపోయేది తక్కువ. అంటే మేము బలంగా లావుగా తయారవుతాం. కానీ తరువాత కరిగేది ఎక్కువ. కొత్తగా వచ్చి చేరేది తక్కువ. 50 ఏళ్లు పైబడ్డ తర్వాత ముఖ్యంగా ఆడవారిలో రుతుస్రావం ఆగిపోయిన తర్వాత కరిగిపోయే మరింత ఎక్కువ అవుతుంది. అప్పుడే అస్థిహీనత (ఆస్టియోపోరోసిస్) వస్తుంది.  అప్పుడు మాలోని మాంసకృత్తులు, లవణాలు మొత్తంగా తగ్గి ఎముక తేనెపట్టులోని ఖాళీ గదుల్లా తయారవుతుంది. మరి దీనిని తగ్గించాలంటే ఏమి చేయాలి? ఆనంద్ ఎప్పుడూ కష్టపడి, బరువు పనులు చేస్తుండాలి. అదేపనిగా శరీరానికి విశ్రాంతి ఇవ్వకూడదు. పొగతాగరాదు. కష్టేఫలి.

 నేనో అద్భుతమైన గిడ్డంగిని...
 ఇక నేను చేసే గిడ్డంగి పని గురించి చెబుతాను. ఆనంద్ శరీరంలోని కాల్షియం, ఇతర లవణాలు సుమారు ఒక కిలో వరకూ నాలో దాచి ఉంచుతాను. ఆనంద్ తిన్న ఆహారంలో కాల్షియం, విటమిన్-డి సాయంతో నాలోకి తీసుకుని భద్రపరుస్తాను. ఒకవేళ రక్తంలో కాల్షియం తగ్గిందనుకోండి. అప్పుడు ఆనంద్ మెడలో ఉన్న పారా థైరాయిడ్ గ్రంథి ఆదేశాల మేరకు తగినంత కాల్షియంను రక్తంలోకి పంపిస్తాను. ఈ పని నేను ప్రతిక్షణం చేస్తూనే ఉంటాను తెలుసా!

 అప్పట్లో పిండికట్లు... ఇప్పుడు లోహపు ప్లేట్లు
 ఏదైనా ప్రమాదంలో మేము విరిగామనుకోండి, పూర్వం అయితే అందరికీ పిండికట్టు కట్టి నెలల తరబడి విశ్రాంతి ఇచ్చేవారు. కాని ఇప్పుడు అలాకాదు. లోహపు బద్దీలు, ఊచలు, తీగలు, మొదలైనవి ఉపయోగించి మా విరిగిన ముక్కల్ని కలిపి, రెండవ రోజు నుండే మాచేత మరల పని చేయిస్తున్నారు ఈ ఎముకల డాక్టర్లు. పని చేయడానికి మొరాయిస్తే ఫిజియోథెరపిస్టులను పెట్టి మరీ చేయిస్తారు. కాని డాక్టర్లకు తెలీని ఓ రహస్యం మేము ఇంక దాచిపెట్టాం. విరిగిన తర్వాత ఒక్కొక్కసారి మేము ఎందుకు అతుక్కోమో డాక్టర్లకు మేము చెప్పం.

ఇక చివరగా పాపం మన ఆనంద్ జీవితం అంతా కాలుగాలిన పిల్లిలా తిరిగి మా ఎముక చివర్లను అంటే కీళ్లను అరగదీశా డనుకోండి లేదా కీళ్లవాతం వచ్చి కీళ్లు అరిగిపోయాయనుకోండి. పూర్వం అయితే ఆనంద్ పిల్లలు అతనికి రిటైర్‌మెంట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఈ ఎముకల డాక్టర్లు అరిగిపోయిన కీలు పొర తీసేసి, మరో కొత్త పొర వేసి, కీలును మళ్లీ  పనిచేసేలా చేస్తున్నారు. కాలు చేయి మళ్లీ కదిపేలా చూస్తున్నారు.
 
 
 సోమరిగా ఉంటే...
 ఆనంద్ ఇప్పుడు ఏ పనీ, వ్యాయామం చేయకుండా సోమరిపోతులా తయారయ్యాడు అనుకుందాం. అప్పుడు ఆనంద్‌కు 60 లేదా 70 సం॥దాటిన తర్వాత చాలా సులువుగా మణికట్టు ఎముక, వెన్నెముక వంటి ఎముకలు విరుగుతాయి. చాలావరకు తుంటి ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉంటుంది. అలా చేయకుండా పూర్వపురోజుల్లో  సౌకర్యాలు లేక వాళ్ల కాళ్లకు ఇసుక మూటలు కట్టి కదిలేసేవారు. ఇటువంటి సందర్భాల్లో ఊపిరితిత్తుల సమస్యలు, వీపుపైన పుండ్లు మొదలైనవి వచ్చి రోగి చనిపోవడానికి కారణమయ్యేవి.
 
 మితిమీరితే ముప్పు...
 ఒక్కొక్కసారి ఈ తయారీ కేంద్రాలు అతిగా పనిచేసి అవసరం లేనన్ని రక్తకణాలను పుట్టిస్తుంటాయి. దానినే లుకేమియా వ్యాధి అంటారు. దీనివల్ల మాకు చెడ్డపేరు వస్తుంది కూడా! అప్పుడు డాక్టర్లు మందులతో మాలో ఉన్న ఎముక మజ్జను, మొత్తం రక్తం తయారీ కేంద్రాలను నాశనం చేస్తారు. తరువాత ఆనంద్ శరీరానికి సరిపడే మరో వ్యక్తిలోని ఎముక మూలుగ కణాలను ఆనంద్ రక్తంలోకి ఎక్కిస్తారు. ఆ కణాలకు మేము ఆశ్రయం కల్పించి, మాలో ఉన్న మజ్జ ఖాళీస్థలంలో అవి పెరగడానికీ, మంచి రక్తం పుట్టించడానికి అవకాశం కల్గిస్తాం. ఒక్కొక్కసారి మాలోని మజ్జ తప్పు లేకపోయినా మాకే చివాట్లు పడతాయి. ఎందుకంటే కొన్ని రకాల రొమ్ము, థైరాయిడ్, ఊపిరితిత్తుల క్యాన్సర్‌లు ఎవరికీ తెలియకుండా మాలో ప్రవేశించి మమ్మల్ని నాశనం చేస్తాయి. మమ్మల్ని బలహీన పరచడం వల్ల, ఏ చిన్న దెబ్బ తగలకపోయినా మేము విరిగిపోతుంటాయి.
 
 ఎముక మధ్యన ఉండే మూలుగలో నిమిషానికి 18 కోట్ల ఎర్రరక్తకణాలు ఉత్పత్తి అవుతుంటాయి. అయితే ఆ ఎర్రరక్తకణాలను స్థిరంగా ఉంచడం కోసం పాత కణాలను నశింపజేయడానికి ప్లీహం (స్ప్లీన్) తోడ్పడుతూ ఉంటుంది.
 
 డాక్టర్ ఎన్. సోమశేఖర్‌రెడ్డి
  సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్,
 అపోలో హాస్పిటల్స్, జూబ్లీహిల్స్, హైదరాబాద్
 
 

మరిన్ని వార్తలు