ఏసీఎల్‌ టేర్‌ అంటే ఏమిటి? 

6 Feb, 2019 00:45 IST|Sakshi

ఆర్థోపెడిక్‌ కౌన్సెలింగ్‌

నా వయసు 27 ఏళ్లు. నేను మంచి స్పోర్ట్స్‌ పర్సన్‌ను. ఇష్టంగా ఆటలాడుతుంటాను.  ఏడాది కిందట ఒకసారి హైజంప్‌ చేసే సమయంలో మోకాలిలో తీవ్రమైన నొప్పివచ్చింది. డాక్టర్‌ను కలిస్తే ‘పార్షియల్‌ ఏసీఎల్‌ టేర్‌’ జరిగిందని వివరించారు. కొన్ని రోజులు ఫిజియోథెరపీ తీసుకొమ్మనీ, ఆ తర్వాత ఎప్పట్లాగే ఆటలాడవచ్చని చెప్పారు. నాకు ఇప్పటికీ నాకు అప్పుడప్పుడూ ఇంకా నొప్పిగానే ఉంటోంది. అసలీ ఏసీఎల్‌ టేర్‌ అంటే ఏమిటి? నాకు తగిన సలహా ఇవ్వండి. 

ఆటలు ఆడే సమయంలో మీరు చెప్పిన యాంటీరియర్‌ క్రూసియేట్‌ లిగమెంట్‌ (ఏసీఎల్‌) గాయపడటం చాలా సాధారణంగా జరిగేదే. పాశ్చాత్యదేశాల వారు స్పోర్ట్స్‌ సమయంలో దీనికి ఏసీఎల్‌కు లోనవుతుంటారు. కానీ మనదేశంలో సాధారణంగా టూవీలర్‌ నడిపేవారు యాక్సిడెంట్‌కు గురైనప్పుడు ఈ లిగమెంటు దెబ్బతింటుంది. ఇది మోకాలిలో ఉండే కీలకమైన లిగమెంటు. ఒకసారి ఇది గాయపడితే దీనికి రక్తసరఫరా జరగదు కాబట్టి ఇది ఒక శాశ్వతనష్టం చేకూర్చే ప్రమాదంగా పరిణమిస్తుంది. ఈ లిగమెంట్‌ దెబ్బతిన్న వారు... అంటే ఏసీఎల్‌కు గాయం అయిన వారు సరిగా నిలబడలేకపోవడం మామూలే.

కొన్నేళ్ల తర్వాత అది ఆర్థరైటిస్‌గా మారడం కూడా జరుగుతుంది. సాధారణంగా 50 ఏళ్ల కంటే పెద్ద వయసు ఉన్న వారిలో ఏసీఎల్‌ గాయపడితే సాధారణ సంప్రదాయ చికిత్స చేస్తూ, మోకాలి కదలికలు తగ్గించుకొమ్మని చెబుతూ, వ్యాయామాలను సూచిస్తుంటాం. కానీ చిన్న వయసు వారిలో అంటే... 40 ఏళ్ల కంటే తక్కువ వారికి మాత్రం శస్త్రచికిత్స సూచిస్తుంటాం. ఇందులో కొత్త లిగమెంటు పునర్నిర్మాణం చేస్తుంటాం.

దీనివల్ల వారిలో ఆర్థరైటిస్‌ రాకుండా నివారించడం సాధ్యమవుతుంది. మీరు ఎమ్మారైను బట్టి పార్షియల్‌ టేర్‌ అంటున్నారనుకుంటాను. కానీ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే ఆ లిగమెంట్‌ పూర్తిగా చిరిగిపోయి ఉంటుందని ఊహించవచ్చు. కాబట్టి మీరు ఇప్పట్లో జంపింగ్స్, రన్నింగ్‌ వంటి వ్యాయామాలు, స్పోర్ట్స్‌ మొదలుపెట్టకండి. మీ పరిస్థితిని పూర్తిగా సమీక్షించేలా ఒకసారి మీకు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్‌ నిపుణుడిని కలిసి, తగిన సలహా తీసుకోండి. 

ఇంత చిన్న వయసులోనేమోకాళ్లనొప్పులా?

నా వయసు 29 ఏళ్లు. గత కొద్ది నెలలుగా నేను రెండు మోకాళ్లలోనూ తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను. మెట్లు ఎక్కుతున్నప్పుడు నొప్పి మరీ ఎక్కువగా వస్తోంది. నేను చాలారకాల మందులు వాడాను. ఇప్పటికీ వాడుతూనే ఉన్నాను. ఈ చిన్న వయసులోనే ఇలా మోకాళ్ల నొప్పులు రావడం ఆందోళన కలిగిస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి. 

మీ సమస్యను నిశితంగా విశ్లేషించాక మీకు మోకాలిచిప్ప ముందు భాగంలో ఉండే పటెల్లా అనే ఎముకపై ఒత్తిడి పడుతున్నట్లుగా అనిపిస్తోంది. చాలామంది యువకుల్లో వచ్చే సమస్యే ఇది. ఇది కొందరిలో కొన్ని నెలల నుంచి కొన్నేళ్ల వరకు ఉంటుంది. ఏదైనా బరువులు ఎత్తినప్పుడు దానిపై పడే అదనపు భారం వల్లనే ఈ సమస్య వస్తుంటుంది. లేదా అతిగా మెట్లు ఎక్కుతుండటం, ఎప్పుడూ బాసిపట్లు (సక్లంముక్లం) వేసుకొని కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇది చాలా తాత్కాలికమైన సమస్య. ఇదేమీ ఆర్థరైటిస్‌ వంటి దీర్ఘకాలిక సమస్య కాబోదు. కాబట్టి అతిగా ఆందోళన పడకుండా మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్‌ సర్జన్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. 


పిల్లాడి పాదంలోఉండాల్సినఒంపు లేదు...ప్రమాదమా? 

మా బాబు వయసు నాలుగున్నరేళ్లు. వాడి ఎదుగుదల, ఆకృతి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కొంతమంది వాడి పాదాలు చూసి... పాదంలో సహజంగా ఉండే ఒంపు లేదనీ, పాదం పూర్తిగా ఫ్లాట్‌గా ఉందని అన్నారు. భవిష్యత్తులో నడకగానీ, ఆటలాడటం గానీ కష్టమవుతుంది అన్నారు. దాంతో మేము ఆందోళనతో డాక్టర్‌కు చూపించాం. బాబును చూసి, డాక్టర్‌గారు ప్రత్యేకమైన షూ సూచించారు.

భవిష్యత్తులో సర్జరీ అవసరం కావచ్చని కూడా చెప్పారు. మా బాబుకు ఆ ప్రత్యేకమైన షూ తొడిగించాలని ప్రయత్నించాం. కానీ వాడు ఆ షూస్‌ తొడుక్కోడానికి ఇష్టపడటం లేదు. పైగా అవి లేకుండానే మామూలుగా నడవడం, పరుగెత్తడం చేస్తున్నాడు. వాడికి భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తుందేమోనంటూ ఇప్పుడు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం. దయచేసి మాకు తగిన సలహా ఇవ్వగలరు. 

మీరు పాదం మధ్యలో ఒంపు లేకుండా ఉంటే ఫ్లాట్‌ ఫీట్‌ గురించి పూర్తిగా అపోహపడుతున్నారు. అలా పాదం మధ్య ఒంపు ఉండాలన్నది కేవలం ఒక దురభిప్రాయం మాత్రమే. మన జనాభాలోని 6 – 8 శాతం మందిలో పాదంలో ఒంపు (ఆర్చ్‌) ఉండదు. పైగా అప్పుడే పుట్టిన నవజాత శిశువుల్లో పాదం మధ్యలో ఉండాల్సిన ఒంపు సరిగా కనిపించదు. మూడు నుంచి ఐదేళ్ల వయసు నుంచి ఆ ఒంపు పెరుగుతూ పోతుంటుంది. కేవలం కొద్దిమంది పిల్లల్లోనే పాదంలో ఉండాల్సిన ఎముకలన్నీ కలిసిపోయి, అది చాలా బాధాకరమైన సమస్యగా పరిణమిస్తుంది.

కానీ ఇలా జరగడం చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే కనిపిస్తుంది. చిన్నారులు పెరుగుతున్న కొద్దీ ఒంపు లేని పాదాలు (ఫ్లాట్‌ ఫీట్‌) ఉన్న చాలామందికి ఎలాంటి చికిత్స లేకుండానే ఆ సమస్య సరైపోతుంది. ఇలాంటి పిల్లలు భవిష్యత్తులో ఆటలాడలేరన్నది కూడా పూర్తిగా తప్పుడు అభిప్రాయం. వాళ్లు కూడా అందరు పిల్లల్లాగానే ఆడుకోగలరు. ఉదాహరణకు సయీద్‌ ఓవుటా అనే మొరాక్‌ ఆటగాడు ఒలిపింక్స్‌లో 1984లో ఒలిపింక్స్‌లో బంగారు పతకం సాధించాడు.

అలాన్‌ వెబ్‌ అనే అమెరికన్‌ అథ్లెట్‌ పరుగులో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. వాళ్లంతా ఫ్లాట్‌ ఫీట్‌తో పుట్టిన వాళ్లే. కాబట్టి మీరు మీ బాబు గురించి ఆందోళనపడటం మానేయండి. అతడు బాగా నొప్పి అని ఫిర్యాదు చేస్తే తప్ప... సాధారణంగా అతడికి ఎలాంటి సర్జరీ అవసరం ఉండకపోవచ్చు. మీకు ఉన్న దురభిప్రాయమే చాలాకాలం కిందట చాలమందిలో ఉండేది. ఇప్పటి ఆధునిక వైద్యవిజ్ఞాన పరిశోధనల్లో అది తప్పు అని తేలింది.


 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు