నేను.. మీ పాదాన్ని!

8 Jun, 2016 22:48 IST|Sakshi
నేను.. మీ పాదాన్ని!

ఆనంద్‌కు తన గుండె, కాలేయం, ఊపిరితిత్తుల వంటి అవయవాల మీద మక్కువ ఎక్కువ. నేను అంత సమస్యలను తెచ్చిపెట్టే అవయవాన్ని కాదని ఆనంద్ నమ్మకం. అందుకే నా గురించి పెద్దగా ఆలోచించడు. కానీ నేనొక నిర్మాణపమైన అద్భుతాన్ని. నేను ఆనంద్ పాదాన్ని.

 
నేనెంత సంక్లిష్టమైన అవయవాన్నో తెలియక కాలిని కాస్తంత చిన్నచూపు చూస్తుంటాడు ఆనంద్. అతడి నడక సాఫీగా సాగడం అన్నది నేను సెలైంట్‌గా పనిచేస్తుండటం వల్లనే. నాలో 26 ఎముకలు ఉంటాయి. ఆనంద్ మొత్తం కాలిలో ఉండే మొత్తం ఎముకల సంఖ్యతో పోలిస్తే నాలుగో వంతు అతడి పాదంలోనే ఉంటాయి. 107 లిగమెంట్లు, 19 కండరాలు ఉంటాయి. అతడి 72 కిలోల బరువును నేనే మోస్తుంటాను. అతడి ఒంటిలోని అత్యంత పొడవైన ఎముక, దాని చుట్టూ ఉండే కండరాన్ని నేనే బ్యాలెన్స్ చేస్తుంటాను. ఆ బరువు మోయడానికి వీలుగా విశాలంగా రూపొందించుకోవడం కోసం అరికాలుగా మారి నన్ను నేను విస్తరించుకున్నాను.

 
నడక... తెలియకుండానే రోజూ జరిగే సంక్లిష్ట ప్రక్రియ  నిజానికి నడక అన్నది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. పాదం నేల మీద మోపగానే మొదటి షాక్ నాకు తగులుతుంది. ఆ షాక్ ప్రభావాన్ని తగ్గించడం కోసం... షాక్ అబ్జార్బర్‌లా పనిచేయడం కోసం... ఆ ప్రభావాన్ని నేను పాదమంతటికీ విస్తరింపజేస్తాను. కానీ ఆనంద్ మాత్రం నాకంటే అతడి వాహనం టైర్ల మీదే ఎక్కువగా దృష్టిసారిస్తుంటాడు. నాకు ఎప్పుడైనా దెబ్బతగిలితే... నాకు గాయమైందన్న అంశం కంటే తాను నడవలేకపోతున్నాననే అంశమే అతడిని బాధిస్తుంది.

 
నడక ఎలా సాగుతుందంటే...

పాదం మోపగానే మొదటి బరువు అతడి మడమలోని బంతిలాంటి ఎముకపై పడుతుంది. ఆ తర్వాత కాలివేళ్లలో ఎముకలైన  ఐదు మెటాటార్సల్స్‌పై పడుతుంది. వాటి సాయంతో నేను నేలను వెనక్కుతోస్తాను. కానీ నేల కదలదు కదా. దాంతో ఆ చర్య ప్రభావంతో నేను ముందుకు కదిలి, ఆనంద్‌ను ముందుకు నడిపిస్తుంటాను.

 
గచ్చు గట్టిదనంతో మరిన్ని గాయాలు...

యుగాలనాటి ఆనంద్ పూర్వీకులు పాదరక్షలు ఏవీ లేకుండానే నడుస్తుండేవారు. ఆ తర్వాత నన్ను రక్షించుకోడానికి నా చుట్టూ చర్మాన్ని కట్టారు. ఇప్పుడు ఆధునిక కాలంలో షూస్ ధరిస్తున్నారు. ఆనంద్ పూర్వీకులు నేలపై నడిచినప్పుడు నాకు బాగానే ఉండేది. కానీ ఇప్పుడు సిమెంట్ చేసిన, కఠినమైన పేవ్‌మెంట్ల మీద ఆనంద్ నడుస్తున్నాడు. మెత్తటి నేల మీద, గడ్డి మీద నడవకుండా ఇలా కఠినమైన ఉపరితలం మీద నడవడం నాకు కష్టాలు తెస్తోంది. నాలోని ఎముకలు కాస్త మృదువుగా, కాస్తంత సాగే గుణంతో ఉంటాయి.


ఇరవైలలోపే ఆంక్షలు ఆరంభం
ఆనంద్‌కు 20 ఏళ్ల వయసు వచ్చే వరకూ నేను రూపొందే ప్రక్రియ పూర్తి కాదు. అందువల్ల ఈ లోపే నన్ను షూస్, సాక్స్ వంటి వాటితో బంధిస్తూ ఉండటం, నా ఎదుగుదలకు ప్రతిబంధకంగా నిలుస్తూ ఉండటం వల్ల నాలో చాలా కొద్దిపాటి లోపాలు తలెత్తుతూ ఉండవచ్చు. అయితే అందరు తల్లిదండ్రుల్లాగే ఆనంద్ పేరెంట్స్ కూడా అతడు బుడిబుడి అడుగులు వేయాలని ఎదురుచూశారు. అంతవరకూ మామూలుగా నన్ను ఉండనిచ్చినవాళ్లు అతడు అడుగులు వేయడం మొదలుపెట్టగానే నన్ను బంధించారు. దీనివల్ల నాకు వచ్చేవి చిన్నచిన్న లోపాలే అయినా అవి మున్ముందు ఆనంద్ పాదాలకు నష్టం కలిగించే అవకాశాలు ఎక్కువ. అతడు చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు ఆనంద్ పేరెంట్స్ అతడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేవారు. అతడి గుండె, ఊపిరితిత్తులు ఇతర అవయవాలు బాగానే ఉన్నాయా లేదా అని చూపించేవారు. కానీ నన్ను, నా ఆకృతి తీరును విస్మరించేవారు. కానీ ఆ అవయవాలతో పోలిస్తే... ఆ టైమ్‌లో నాకు వచ్చే ఇబ్బందులు ఎక్కువ. ఆనంద్‌కు నాలుగేళ్ల వయసులో నన్ను గనక  ఆర్థోపెడిక్ సర్జన్‌కు / డాక్టర్‌కు చూపిస్తే వారు నాకు జరుగుతున్న నష్టాలు గుర్తించేవారు. (విదేశాల్లో అయితే పాదాల ప్రాథమిక సంరక్షణ కోసమే పనిచేసే వారుంటారు. వాళ్లను పోడియాట్రిస్ట్ అంటారు) ఆనంద్‌కు ఆరేళ్ల వయసు వచ్చే సరికి, దాదాపు 40 శాతం మంది పిల్లల్లో వచ్చే నష్టాలే నాకూ వచ్చాయి. నా పాదం వేళ్లు నష్టపోవడం మొదలైంది. ఇది జన్యుపరంగానో లేదంటే షూస్ వల్లనో జరుగుతుంది. ఆనంద్‌కు బ్రష్‌చేసుకోవడం ఎలా, జుట్టు దువ్వుకోవడం ఎలా అని నేర్పుతారు. కానీ పాద సంరక్షణ నేర్పరు.


పొడిగా ఉంచితే ఆరోగ్యంగా ఉంటాను
ఒక్కోసారి ఆనంద్ పాదాలకు కాయకాచి అందులో పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఇలా జరిగినప్పుడు పాదాల డాక్టర్‌కు చూపించుకుని, తగిన చికిత్స చేయించుకోవాలి. అథ్లెట్స్ ఫుట్ అనే సమస్య ఫంగస్ కారణంగా నాకు వస్తుంది. నిజానికి ఈ ఫంగస్ నాపై ఎప్పుడూ ఉండనే ఉంటుంది. కానీ పాదం ఎప్పుడూ తేమ, తడిలో ఉన్నప్పుడు ఫంగస్ పెరిగి, చర్మం చిట్లి, అథ్లెట్స్ ఫుట్ సమస్య వస్తుంది. అరికాళ్లలో ఉండే చెమట గ్రంథులు స్రావాలతో పాదం చెమ్మబారి ఈ సమస్య రావచ్చు. ఇలాంటప్పుడు ఆనంద్ పాదాన్ని శుభ్రంగా కడిగి, వీలైతే ఆల్కహాల్ ఉన్న వాష్‌లను ఉపయోగించి శుభ్రం చేసి, పాదాల మీద పౌడర్ చల్లి, ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకుంటే నేను ఆరోగ్యంగా మారతాను. అవసరాన్ని బట్టి యాంటీ ఫంగల్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాలి.

 
ఆనంద్‌కు బొటనవేలిపై ఉన్న గోరు లోపలివైపునకు పెరుగుతూ ఉంది. ఇలా జరగకుండా చూసుకోవాలంటే కాలి గోర్లు తీసే సమయంలో మూలల్లో మరీ చిగుర్ల నుంచి కాకుండా కాస్తంత దూరం నుంచే కట్ చేసుకుంటే ఈ సమస్యను ఎప్పటికీ రాకుండా చూసుకోవచ్చు. ఇక ఈ మధ్య ఆనంద్‌కు కాలు చల్లగా అనిపించడం, పాదం మొద్దుబారినట్లుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. పాదానికి రక్తప్రసరణ పెరిగేలా చూసుకోవడం వల్ల ఈ సమస్య రాదు. అన్నిటికంటే ఆనంద్ పూర్వికులలాగే అతడు కూడా కాసేపు వ్యాయామం చేస్తే మంచిది.

 
ఇక చివరగా నేను ఆనంద్‌ను కాస్త భయపెట్టాలి. మున్ముందు ఆనంద్‌కు వయసు పెరగబోతోంది. ఆ సమయంలో అతడు ఒకింత వ్యాయామం ఇచ్చి నా ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి. లేదంటే నేను అతడిని నడిపించలేకపోవచ్చు. అందుకు ఇకపైన అయినా అతడు నా పట్ల దృష్టిసారించాలి. అది కూడా మరింత సునిశితమైన దృష్టి.

 

ప్రమాద అవకాశాలు  అతడిలో కంటే ఆమెకే ఎక్కువ
పాదం గాయపడిందంటే దేహం గాయపడినట్లే అన్న పాత సూక్తిని గుర్తుంచుకోవడం మేలు. ఆనంద్ బూట్లు ధరించడం వల్ల నిల్చునే భంగిమలోనే మార్పువస్తుంది. దాంతో మొత్తం ఆకృతిలోనే మార్పురావచ్చు. అది చేదు పరిణామాలు దారితీయవచ్చు. ఆనంద్‌తో పోలిస్తే అతడి భార్యకు ఇలా జరిగే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువ. ఎందుకంటే ఆనంద్ భార్య ధరించే హైహీల్స్ వల్ల ఈ ప్రమాదం నాలుగింతలు ఎక్కువగా ఉంటుంది. ఆమెకే కాదు... మహిళలందరికీ ఈ ముప్పు ఉంటుంది.

 

కాలికి వచ్చే ఆరోగ్య సమస్యలు ఎన్నెన్నో!
నాకు వచ్చే ఆరోగ్య సమస్యలు చాలా రకాలుగా ఉంటాయి. పాదాలపై ఆనెకాయలు రావచ్చు. షూ వల్ల ఒకేచోట అదేపనిగా ఒత్తిడి పడుతుండటం వల్ల ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అక్కడ మృతకణాలు చేరుతూ పోవడం వల్ల ఇలా ఆనెకాయలు రావచ్చు. ఆనంద్ పాదాలలోని నరాలలో కొన్నింటిపై ఎక్కువ, మరికొన్నింటిపై తక్కువ ప్రభావం పడుతుండవచ్చు. అలా నరాలపై ఎక్కువ ఒత్తిడి పడ్డప్పుడు అతడికి నొప్పి వస్తుండవచ్చు. ఆనెకాయల విషయంలో ఆనంద్ తానే ఒక సర్జన్ అనుకుంటాడు. రేజర్‌బ్లేడు తీసుకుని, దాన్ని కోస్తూ ఉంటాడు. ఆనెకాయలను మాడ్చటానికి దానిపై కొన్ని చుక్కల యాసిడ్  పోస్తూ ఉంటాడు. కానీ నిజానికి ఆనెకాయలు వస్తే దాని చూట్టూ ప్లాస్టర్ వేసి డాక్టర్‌కు చూపించాలి. ఇక షూ ముందు భాగం సన్నగా ఉండటం వల్ల కాలి బొటనవేలు లోపలి వైపునకు నొక్కుకుపోయి, దాని వెనకవైపు ఎముక ముందుకు పొడుచుకువచ్చినట్లుగా అవుతుంది. ఈ సమస్యను ‘బ్యూనియన్’ అంటారు. కొందరిలో ఇది వారసత్వంగానూ కనిపిస్తుంది. షూ వల్ల మరింత పెరుగుతుంది. షూ ఒరుసుకుపోతున్న చోట... నన్ను నేను రక్షించుకునేందుకు మరో అదనపు కణజాలాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటాను. ఇలాంటప్పుడు దాని చుట్టూ ఆనంద్ పట్టీ

 
కట్టి దాని పైన షూ తొడుగుతుంటాడు. దాని వల్ల సమస్య మరింత పెరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఆనంద్ డాక్టర్‌ను కలిసి, అవసరమైతే శస్త్రచికిత్స లేదా బొటనవేలిని మరింత దృఢతరం చేసుకునే చికిత్సలు చేయించుకోవడం అవసరం.

 

పాదరక్షల ఎంపిక ఎలా ఉండాలంటే...
ఆనంద్ తన జీవితకాలంలో సగభాగం నన్ను బూట్ల జైలులో బంధించి ఉంచుతాడు. కానీ అతడికి సరైన పాదరక్షల ఎంపిక ఎలాగో తెలియదు. ఒక కాలికి సరిపోగానే వెంటనే అలాంటిదే మరోకాలికి పరీక్షించకుండానే తొడిగేస్తాడు. ఆనంద్ చేయాల్సింది అది కాదు. తన రెండు పాదాల పొడవును కొలిచి, రెండింటికీ సౌకర్యంగా ఉండే జోళ్లనే ఇవ్వమని చెప్పాలి. అతడి షూస్ అతడి పాదం చివరే ముగియకుండా... మరో రెండు సెంటీమీటర్లు ఎక్కువగా ఉండాలి. పాదంలో వెడల్పుగా ఉండే భాగం ముడుచుకోకుండా, సౌకర్యంగా పరచుకునేలా అతడి షూ ఉండాలి. ఈమధ్య ఆనంద్ షార్ట్ సాక్స్ తొడుగుతున్నాడు. ఇవి చాలా వరకు కాలిని ముడుచుకుపోయేట్లుగా చేసే బిగుతు షూ అంతటి ప్రమాదకరమైనవి. సాక్స్ కాస్త సాగుతూ ఉండేవి అయితేనే మంచిది.

>
మరిన్ని వార్తలు