నేను మీ ఊపిరితిత్తిని

27 Jan, 2016 22:43 IST|Sakshi
నేను మీ ఊపిరితిత్తిని

నేను ఆనంద్ కుడి ఊపిరితిత్తిని. ఎడమ వైపు ఉన్న నా భాగస్వామి కంటే కాస్త పెద్దగా ఉంటాను. నాలో మూడు భాగాలు ఉంటే, నా భాగస్వామిలో రెండు భాగాలే ఉంటాయి. నేను లేత గులాబిరంగులోని ఫుట్‌బాల్ బ్లాడర్‌లా తన ఛాతీలో వేలాడుతూ ఉంటాననుకుంటాడు ఆనంద్. నిజానికి నేను రబ్బరుతో చేసిన బాత్ స్పాంజ్‌లా ఉంటాను. తను చంటిపిల్లాడిగా ఉండేటప్పుడే నా ఛాయ లేతగులాబిగా ఉండేది. ఇప్పటి వరకు ఆనంద్ తాగి పారేసిన రెండులక్షల సిగరెట్ల పొగకు తోడు పట్టణ కాలుష్యం ఫలితంగా అసహ్యకరమైన నల్లని మచ్చలతో నేను బూడిద రంగులోకి మారాను.
 
ఆనంద్ ఛాతీలో మూడు మూసేసిన గదులు ఉంటాయి. ఒకటి నాకు, రెండోది నా భాగస్వామికి, మూడోది ఆనంద్ గుండెకు. నేను నా గదిలో వేలాడుతూ ఉంటాను. నాకు ఎలాంటి కండరాలూ లేవు. అందువల్ల శ్వాసక్రియలో నాది పరోక్ష పాత్ర మాత్రమే. దాదాపు అరకిలో బరువు తూగే నేను, నా గదిని పూర్తిగా ఆక్రమించుకుని ఉంటాను. ఆనంద్ ఊపిరి పీల్చుకునేటప్పుడు నేను వ్యాకోచించడానికి వీలుగా నా గదిలో కాస్తంత ఖాళీ జాగా ఉంటుంది. అలాగే, అతడు ఊపిరి విడిచి పెట్టేటప్పుడు నేను ముడుచుకుంటాను. నాలో జరిగే ఈ ప్రక్రియ అంతా ఒక రీకాయిల్ మెకానిజం.  స్వచ్ఛంద నియంత్రణ

ఆనంద్ శరీరంలోని గుండె, మెదడు వంటి చాలా ఇతర అవయవాల మాదిరిగానే నేను కూడా స్వచ్ఛంద నియంత్రణతోనే పనిచేస్తాను. అంటే, ఆనంద్ ప్రమేయం  లేకున్నా నా పని నేను చేసుకుపోతూనే ఉంటాను. శ్వాసక్రియకు సంబంధించిన స్వయం నియంత్రణ అంతా ‘మెడ్యులా ఆబ్లంగేటా’లో జరుగుతూ ఉంటుంది. వెన్నెముక మెదడుకు అనుసంధానమైన చోట చిన్న బుడిపెలా ఉండే ఈ భాగం సున్నితమైన కెమికల్ డిటెక్టర్‌గా పనిచేస్తుంది. శ్రమించే కండరాలు పుష్కలంగా ఆక్సిజన్ వాడుకుంటూ, వ్యర్థమైన కార్బన్ డయాక్సైడ్‌ను బయటకు పంపే క్రమంలో రక్తంలో స్వల్పంగా ఆమ్లస్వభావం ఏర్పడుతుంది. ‘మెడ్యులా ఆబ్లంగేటా’ ఈ మార్పును సత్వరమే గుర్తించి, నన్ను మరింత వేగంగా పనిచేసేలా ఆదేశిస్తుంది. ఆనంద్ కఠిన వ్యాయామం చేసినట్లయితే, మరింత గాఢంగా, మరింత వేగంగా ఊపిరి తీసుకునేలా ఆదేశిస్తుంది. ఆనంద్ విశ్రాంతిగా మంచం మీద పడుకుని ఉంటే, అతడికి నిమిషానికి తొమ్మిది లీటర్ల ఆక్సిజన్ అవసరమవుతుంది. కూర్చుని పనిచేసుకుంటూ ఉంటే నిమిషానికి 18 లీటర్లు, నడుస్తుంటే నిమిషాలు 27 లీటర్లు, పరుగు తీస్తే నిమిషానికి 56 లీటర్ల ఆక్సిజన్ అవసరమవుతుంది. సాధారణంగా ఆనంద్ నిమిషానికి పదహారుసార్లు ఊపిరి తీసుకుంటాడు. ఒక్కోసారి అరలీటరు గాలి లోపలకు పీల్చుకుంటాడు. అయితే, అతడు పీల్చిన గాలంతా నా లోపలకు చేరుకోదు. చాలా వరకు గాలి వాయునాళంలో, శ్వాసనాళాల్లో దిశారహితంగా సంచరిస్తూ ఉంటుంది. అయితే, నాలోకి చేరే గాలి వెచ్చగా, కాస్త తేమగా ఉండాలని కోరుకుంటాను. కొద్ది సెంటీమీటర్ల మార్గంలో ప్రయాణించే గాలిని అలా వెచ్చగా, తేమగా మారడం ఒక విచిత్రమైన ప్రక్రియ. ఆనంద్ కంట్లో ఉంటే అశ్రుగ్రంథులు, ముక్కులో, నోట్లో, గొంతులో ఉండే తేమ ఉత్పత్తి చేసే గ్రంథుల ద్వారా నాలోకి వచ్చే గాలిలోకి రోజుకు అరలీటరు వరకు తేమ చేరుతుంది. వాయుకోశాల్లోని రక్తనాళాలు చలికాలంలో వ్యాకోచించుకుని, వేసవిలో సంకోచించుకుని ఉంటాయి. ఫలితంగా నాలోకి చేరే గాలి నిరంతరం ఒకే రకమైన వెచ్చదనంతో ఉంటుంది.

వీటి వల్లే ఇబ్బందులు
నిజానికి చెప్పుకోవాలంటే నాకు తలెత్తే ఇబ్బందులకు సవాలక్ష కారణాలు ఉన్నాయి. ఆనంద్ ప్రతిరోజూ గాలితో పాటే రకరకాల బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులను, దుమ్ము ధూళి కాలుష్యాలను కూడా లోపలకు పీల్చుకుంటూ ఉంటాడు. అయితే, చాలా వరకు నన్ను నేను రక్షించుకునే ఏర్పాట్లు నాలోనే ఉన్నాయి. ఆనంద్ ముక్కు, గొంతులో ఉండే లైసోజైమ్ ప్రభావానికి బ్యాక్టీరియా, వైరస్‌లు చాలా వరకు మరణిస్తాయి. అప్పటికీ అవి తప్పించుకుని శ్వాసకోశంలోకి చేరితే, అక్కడ ఉండే ‘ఫాగోసైట్’ కణాలు వాటిని వెంటాడి మరీ తినేస్తాయి. సూక్ష్మజీవులతో పెద్దగా ఇబ్బంది లేదు గానీ, రసాయనాలతో కలుషితమైన గాలితోనే నాకు ఎక్కువగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. గాలితో పాటు నాలోకి చేరే సల్ఫర్ డయాక్సైడ్, బెంజోపైరిన్, నైట్రోజన్ డయాక్సైడ్, లెడ్ వంటి రసాయనాలను చాలా వరకు ఎదుర్కోగలను. ఇలాంటి పదార్థాల్లో కొన్ని నైలాన్‌ను సైతం కరిగించగలవు. ఇవి నేరుగా నాలోకి చేరితే, నాకు ఎంతటి ముప్పు కలిగించ గలవో ఊహించండి. అయితే, చాలా వడపోత తర్వాతే గాలి నాలోకి చేరుతుంది. ముక్కులోని సన్నని వెంట్రుకలు కాస్త పెద్దగా ఉండే కాలుష్య కణాలను అక్కడే అడ్డుకుంటాయి. ముక్కులో, గొంతులో, వాయునాళం, శ్వాసనాళాల్లో ఉండే జిగురు పదార్థం మ్యూకస్ మిగిలిన కాలుష్య కణాలను అడ్డుకుని, బయటకు పంపేస్తుంది. ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైన కాలుష్య పదార్థాలను శ్వాసనాళాల్లో ఉండే సన్నని వెంట్రుకల వంటి ‘సిలియా’ బయటకు పంపేస్తాయి. ఈ ‘సిలియా’ సెకనుకు పన్నెండుసార్లు కదలాడుతూ కాలుష్యాలను బయటకు తరిమేస్తాయి. వాటి కదలికల వేగానికే, శ్వాసనాళాల్లో దిగువన ఉండే మ్యూకస్ కఫంగా గొంతులోకి చేరుతుంది.    
 
పొగ మానేస్తే మళ్లీ పర్ఫెక్ట్

ఆనంద్ సిగరెట్ తాగితే ఆ పొగ ప్రభావానికి ‘సిలియా’ కదలికలు తాత్కాలికంగా నిలిచిపోతాయి. ఫలితంగా ఒక్కోసారి శ్వాసనాళంలో దురద ఏర్పడి దగ్గుతెర తరుముకొస్తుంది. ఆనంద్‌కు ముప్పయ్యేళ్లుగా సిగరెట్ అలవాటు ఉంది. ఈ పాడు అలవాటు వల్ల శ్వాసనాళాల్లో మ్యూకస్‌ను స్రవించే పొర మూడురెట్లు మందంగా మారింది. దీనివల్ల తలెత్తే ముప్పును ఆనంద్ తెలుసుకోలేకపోతున్నాడు. బరువెక్కిన మ్యూకస్ శ్వాసకోశాల్లోకి జారుతున్న కొద్దీ, అతడు మునిగిపోతున్నట్లే లెక్క. శ్వాసకోశాలు మ్యూకస్‌తో నిండిపోతూ ఉండటంతో సరిగా ఊపిరి కూడా తీసుకోలేడు. అయితే, ‘సిలియా’ కదలికల వల్ల తరచుగా వచ్చే దగ్గు అతడిని రక్షిస్తూ ఉంటుంది. దగ్గు వేగానికి లోపల పేరుకున్న కాలుష్యాల్లో కొన్ని బయటకు పోతూ ఉంటాయి. అయితే, ఆనంద్ మరీ ఎక్కువగా సిగరెట్లు తాగేస్తూ నాలోకి నానా చెత్తా పంపిస్తూ ఉంటాడు. పొగతో వచ్చే కొన్ని కణాలు నాలోని సూక్ష్మ మార్గాల్లోకి చేరి, వాటిని మూసేస్తూ ఉంటాయి. ఇంకొన్ని నా కణజాలంపై మచ్చలుగా మిగిలిపోతాయి. ఎక్కువ కాలం ఇలా సాగితే, నా గోడలు ఎలాస్టిసిటీని కోల్పోతాయి. అందువల్ల గాలి విడిచేటప్పుడు నేను పూర్తిగా ముడుచుకోలేకపోతాను. అలాంటప్పుడు నాలోని కార్బన్ డయాక్సైడ్ పూర్తిగా బయటకు పోదు. లోపలకు చేరే ఆక్సిజన్‌కు తగినంత చోటు ఉండదు. నా పరిస్థితి బాగుపడాలంటే, సిగరెట్లు మానేయడం తప్ప ఆనంద్‌కు మరో మార్గం లేదు. పొగ తాగడం మానేసిన నెల్లాళ్లలోనే నేను పునరుత్తేజం పొందడం ప్రారంభిస్తాను. కొద్ది నెలల్లో తిరిగి పూర్తి జవసత్వాలను సంతరించుకుంటాను.
 
 
 
 ఇదీ నా నిర్మాణం
 పది సెంటీమీటర్ల పొడవున ఉండే ఆనంద్ వాయునాళం దిగువ వైపు రెండు శాఖలుగా విడిపోతుంది. ఇవే శ్వాసనాళాలు వాటిలో ఒకదాని దిగువ నేను, మరోదాని దిగువ నా భాగస్వామి వేలాడుతూ ఉంటాం. వాయునాళం నుంచి ఆకారాన్ని గమనిస్తే, తలకిందులుగా వేలాడే చెట్టులా కనిపిస్తా. శ్వాసనాళాలు కాస్త పెద్దగానే ఉంటాయి. అవి మరిన్ని శాఖలుగా... సూక్ష్మ శ్వాసనాళాలుగా విస్తరించి ఉంటాయి. వీటి వ్యాసం సెంటీమీటరులో నలభయ్యవ వంతు మాత్రమే ఉంటుంది. ఇవన్నీ నాలోకి గాలిని పంపే వాహకాలు. అయితే, నా అసలు పనంతా వాయుకోశాలలోనే. ద్రాక్షపళ్ల గుత్తిలా ఉంటుందా తిత్తి. బయట దానిని పరిస్తే, టెన్నిస్ కోర్టులో సగం విస్తీర్ణాన్ని ఆక్రమిస్తుంది. ప్రతి వాయుకోశంలో కొన్ని వేల రక్తకేశనాళికలు సాలెగూడులా అల్లుకుని ఉంటాయి. ఒక్కో కేశనాళిక గుండా రెప్పపాటు కాలంలో ఎర్ర రక్తకణాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఉల్లిపొరలాంటి కేశనాళికల ద్వారా ఈ ఎర్ర రక్తకణాలు తమతో తీసుకువచ్చిన కార్బన్ డయాక్సైడ్‌ను వదిలేసి, అక్కడ ఉన్న ఆక్సిజన్‌ను తీసుకుని ముందుకు సాగుతాయి.
 
 ఇంట్లోని కాలుష్యంతోనూ ఇబ్బందులు
 కాలుష్యం అనగానే మనం బయటి కాలుష్యమే అనుకుంటాం. కానీ ఇంట్లోనూ కాలుష్యం ఉంటుంది. ఇల్లు ఊడ్చేటప్పుడు, బూజు దులిపేటప్పుడు రేగే ధూళికణాలతో పాటు.. అగరుబత్తీలు, కర్పూరం వంటివి వెలిగించినప్పుడు, హారతి ఇచ్చేటప్పుడు, వంటింట్లో పోపు పెట్టేటప్పుడు వచ్చే ఘాటైన వాసనను కూడా మనం ఇంటి కాలుష్యంగానే పరిగణించాలి. ఈ ఘాటు వల్ల ఇంట్లోని పిల్లలకు, వయసులో పెద్దవాళ్లకు ఎలర్జీలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎలర్జీ స్వభావం లేని వాళ్లకు సైతం.. ఘాటు తీవ్రతను బట్టి తమ్ములు, దగ్గు, ఆయాసం, జలుబు వంటివి రావచ్చు. ఎలర్జీ స్వభావం ఉన్నవాళ్లకైతే ఇవే మరింత తీవ్రమై ఊపిరి తీసుకోవడం కూడా కష్టం కావచ్చు. అందుకే ఇంట్లోని కిటికీలన్నీ వీలైనంత వరకు తెరచి ఉంచడం మంచిది. ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఉంటే మరీ మంచిది. ఇవి లేనప్పుడు, ఇంట్లోని పొగల ఘాటు ఎక్కువగా ఉన్నప్పుడు ముక్కుకు మందపాటి కర్చీఫ్‌ను కట్టుకోవడం ద్వారా కాలుష్యాన్ని నిరోధించవచ్చు.
 చిన్న పిల్లలు స్కూలుకు వెళ్లేటప్పుడు ఆటోలలో, బస్సులలో, టూ వీలర్స్‌లో బయటి కాలుష్యానికి గురవుతారు. మాస్కులు ధరించడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది.
 - డాక్టర్ రమణ ప్రసాద్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్
 కిమ్స్ హాస్పిటల్, హైదరాబాద్
 
 

>
మరిన్ని వార్తలు