పరుగుల జ్యోతి

5 Jun, 2019 02:14 IST|Sakshi

బుల్లితెర మీద పరుగుల రాణి ‘జ్యోతి’గా తెలుగువారికి పరిచయమైంది. తెర వెనుక ‘చదువుల తల్లి’ అని అమ్మానాన్నల చేత భేష్‌ అనిపించుకుంది. శాస్త్రీయ నృత్యంతో ఆకట్టుకుంది. నటన చదువు రెండూ నాకు ఇష్టమే అంటూ తన గురించి ‘సాక్షి’తో పంచుకున్న ‘జ్యోతి’ సీరియల్‌ నటి ‘వేద నారాయణ్‌’ ముచ్చట్లివి.  

‘నేను పుట్టి పెరిగింది బెంగుళూరులోనే. కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజనీరింగ్‌ చేశాను. చిన్నప్పటి నుంచి క్లాసికల్‌ డ్యాన్స్‌ నేర్చుకున్నాను. అనుకోకుండా స్నేహితుల ద్వారా వచ్చిన అవకాశంతో నటనవైపు ఆసక్తి చూపాను. కన్నడలో నాలుగు సీరియల్స్‌ చేశాను. అయితే, అవి మెయిన్‌ రోల్స్‌ కాదు. తెలుగులో మా టీవీలో ప్రసారమయ్యే ‘జ్యోతి’ సీరియల్‌ ద్వారా మెయిన్‌ రోల్స్‌గా మీ ముందుకు వచ్చాను.

‘జ్యోతి’ సీరియల్‌లో... ఇందులో జ్యోతి పాత్ర చాలా స్ఫూర్తిమంతంగా ఉంటుంది. పల్లెటూరి అమ్మాయి జ్యోతి. రన్నింగ్‌ కోసం ఏమైనా చేస్తుంది. ఒకసారి జ్యోతి రోడ్డుపై వెళ్లే వాహనాలతో పోటీ పడి పరిగెత్తుతూ వాటిని ఓవర్‌టేక్‌ చేసే సాహసం చేస్తుంది. కోచ్‌ ఈ అమ్మాయిని చూసి ప్రతిభ ఉందని స్పోర్ట్స్‌ అకాడెమీకీ సెలక్ట్‌ చేస్తాడు. అలా ఆ అమ్మాయి పల్లెటూరి నుంచి హైదరాబాద్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో చేరడం, అక్కడ ఉండే వాతావరణం .. ప్రతీది నేచురల్‌గా ఉంటుంది. ఒలంపిక్స్‌లో మెడల్‌ సాధించడమే జ్యోతి ముందున్న లక్ష్యంగా సీరియల్‌ రన్‌ అవుతుంది. ఈ సీరియల్‌లో స్పోర్ట్స్‌ మాత్రమే కాకుండా సిటీలో జ్యోతికి ఒక చిన్న లవ్‌ స్టోరీ కూడా ఉంటుంది.  నేనూ స్కూల్‌ రోజుల్లో కబడ్డీ ప్లేయర్‌ని. అకాడమీ వరకు వెళ్లాను. ఈ సీరియల్‌ స్పోర్ట్స్‌ థీమ్‌ ఉన్న లైన్‌ అవడంతో వెంటనే ఒప్పుకున్నాను.

ఎంట్రీ ఇలా... మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి. పేరు నారాయణ్‌. ఈ ఫీల్డ్‌కి నేను రావడం నాన్నగారికి ఇష్టం లేదు. ‘ఇంజనీయర్‌ చేశావు, సీరియల్స్‌ ఏంటి?’ అనేవారు. నాకు ఐటీ వైపు వెళ్లడం ఇష్టం లేదు. అదే విషయం చెప్పాను. అమ్మ మంజుల బ్యూటిషియన్‌. యాక్టింగ్‌ ఫీల్డ్‌ అంటే అమ్మకు ఇంట్రస్ట్‌ ఉంది. దీంతో నాన్నకు నచ్చజెప్పడం సులువు అయ్యింది(నవ్వుతూ). అమ్మానాన్నల వైపు ఎవరూ టీవీ, సినిమా పరిశ్రమలో లేరు. అయితే, మా తాతగారికి మాత్రం నాటకాలలో ప్రవేశం ఉంది. అలా నాకు ఈ ఆసక్తి వచ్చి ఉంటుందని అమ్మానాన్నలు అంటుంటారు. నాకు ఓ తమ్ముడు. ప్రస్తుతం వాడు చదువుకుంటున్నాడు. వచ్చిన ఆఫర్స్‌ని యాక్సెప్ట్‌ చేస్తూనే నేనూ ఐఎఎస్‌ ఎగ్జామ్‌కి ప్రిపేర్‌ అవుతున్నాను.

ఏ చిన్న లోపమైనా... నాన్నగారు ముందు ఈ ఫీల్డ్‌ అంటే ఇంట్రస్ట్‌ చూపకపోయినా ఇప్పుడు నా సీరియల్‌ని తప్పనిసరిగా చూస్తారు. నటనలో ఏ చిన్న లోపం ఉన్నా వెంటనే చెప్పేస్తారు. దాంతో మరోసారి అవి రిపీట్‌ కాకుండా జాగ్రత్తపడతాను. ఇక అమ్మ అయితే రెగ్యులర్‌గా నా కాస్ట్యూమ్స్, ఇతర యాక్సెసరీస్‌ అన్నీ తనే సెలక్ట్‌ చేస్తుంది. నాకేం సూటవుతాయో అమ్మకు బాగా తెలుసు. అందుకే, బెస్ట్‌ అనిపించే ఆ ఛాయిస్‌ అమ్మదే. కుటుంబం సపోర్ట్‌ ఉంటడంతో మరింత హ్యాపీగా వర్క్‌ చేసుకోగలుగుతున్నాను.

జీవితంలో పరుగులు పెట్టను... సీరియల్‌లోనే పరుగులు తప్ప జీవితం అంతా పరుగులతో నిండి ఉండాలని అనుకోను. కూల్‌గా, హ్యాపీగా గడిచిపోవాలని కోరుకుంటాను. నా చుట్టూ ఉన్నవారు నన్ను ఎంకరేజ్‌ చేసేవారే కావడంతో నా జీవితం మరింత సంతోషంగా గడిచిపోతుంది. నటనలో ఇంతవరకే అనే పరిమితులు ఉండవు. కన్నడలో చేసిన సీరియల్స్‌ అన్నీ నెగిటివ్‌ పాత్రలే. ఇక్కడ పాజిటివ్‌... అందులోనూ లీడ్‌ రోల్‌ చేస్తున్నాను. కాకపోతే ఎప్పటికైనా ‘అరుంధతి’ సినిమాలో హీరోయిన్‌లా ఒక రోల్‌ చేయాలని ఉంది.’
– నిర్మలారెడ్డి

మరిన్ని వార్తలు