ఆ బాధ నన్నెప్పటికీ వదలదేమో!

20 Aug, 2014 08:28 IST|Sakshi
ఆ బాధ నన్నెప్పటికీ వదలదేమో!

అవి నేను జూనియర్ కాలేజీలో చదివే రోజులు... నేను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే రెండో సంవత్సరం చదువుతోన్న ఓ అబ్బాయి నాకు ప్రపోజ్ చేశాడు. నేను ఓకే చెప్పేద్దామనుకునేంతలో నా స్నేహితురాలు సంధ్య నా దగ్గరకు వచ్చింది. నన్ను ఇష్టపడుతోన్న అబ్బాయికి సంధ్య చుట్టం.

అందుకే తన దగ్గర నేను ఆ అబ్బాయి గురించి మాట్లాడేదాన్ని కాదు. కానీ ఆ రోజు తనే నా దగ్గర తన గురించి ప్రస్తావించింది. ‘తను నీకు ప్రపోజ్ చేసిన విషయం నాకు తెలుసు, కానీ ఒప్పుకోవద్దు, తనకు చిన్నప్పుడే పెళ్లయిపోయింది’ అని చెప్పింది. నేను షాకైపోయాను. అలా ఎలా జరిగిందని ప్రశ్నించాను. చిన్నప్పుడే కొన్ని పరిస్థితుల్లో ఆ అబ్బాయికి తన మరదలితో పెళ్లి జరిగిందట. పిల్లలు పెద్దయ్యేవరకూ కావాలని దూరంగా పెట్టారట పెద్దలు... అంటూ జరిగినదంతా చెప్పింది సంధ్య.
 
నాకు మతి పోయింది... విషయం తెలిశాక కూడా అడుగు వేయడం తప్పు కాబట్టి నా మనసులో నుంచి వెంటనే ఆ ఆలోచన తీసేశాను. ఆ రోజు నుంచీ అతడి వైపు చూసేదాన్ని కాదు. అతడు మాట్లాడాలని ప్రయత్నించినా స్పందించేదాన్నీ కాదు. అది తెలిసీ తెలియని వయసు కావడం వల్ల తనని త్వరగానే మర్చిపోయాను. కానీ తను మాత్రం నన్ను మర్చిపోలేదు. దాదాపు నా డిగ్రీ పూర్తయ్యేవరకూ కూడా నా వెంట పడుతూనే ఉండేవాడు. నాతో మాట్లాడాలని ప్రయత్నిస్తూనే ఉండేవాడు. కానీ ఏ ఒక్కరోజూ నేను తనకి అవకాశం ఇవ్వలేదు. డిగ్రీ పూర్తవ్వగానే నాన్నగారు చూసిన  వ్యక్తితో తాళి కట్టించుకుని, కాపురానికి వెళ్లిపోయాను.
 
ఆ తర్వాత రెండు నెలలకు సంధ్య నుంచి ఫోన్ వచ్చింది. నా గొంతు వినగానే చాలాసేపు ఏడుస్తూనే ఉంది. తర్వాత చెప్పింది... ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడని. నివ్వెరపోయాను. నేనేదో అనబోతుండగా ‘క్షమించు రాధా... ఇదంతా నావల్లే జరిగింది’ అంది సంధ్య. అలా ఎందుకందో తెలిశాక నేను మామూలుగా షాకవ్వలేదు. ఆ అబ్బాయికి  చిన్నప్పుడు పెళ్లి కాలేదట. అదంతా అబద్ధమట. తనకు అతనంటే ఇష్టమట. అతనికి నేనంటే ఇష్టం కాబట్టి మా ఇద్దరినీ కలవనివ్వకుండా చేసేందుకే అలా చేశానని చెప్పింది. మౌనంగా ఫోన్ పెట్టేశాను. అపరాధభావం దహించివేసింది. సంధ్య చెప్పిన ఒక్క మాటతో అతన్ని దూరంగా నెట్టేశాను.

ఒక్కసారైనా అతడికి మాట్లాడే అవకాశం ఇచ్చివుంటే బాగుండేది. నా మౌనం అతడి మనసును కాల్చేసి ఉంటుంది. నా పెళ్లి అతడి మనసును ముక్కలు చేసుంటుంది. అందుకే ప్రాణాలు తీసుకున్నాడు. పాతికేళ్లు గడచిపోయినా ఈ విషయం నన్ను వేధిస్తూనే ఉంటుంది. అతను నాకు ప్రపోజ్ చేయడం, సంధ్య నాకు ఫోన్ చేయడం గుర్తుకొస్తూ, నన్ను అశాంతికి గురి చేస్తుంటాయి.
 
- లక్ష్మీకళ్యాణి, నూజివీడు
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు