వ్యాయామంతో తీవ్రమైన ఆయాసం

22 Nov, 2019 03:23 IST|Sakshi

పల్మునాలజీ కౌన్సెలింగ్‌

నా వయసు 34. నాకు దుమ్ము సరిపడదు. డస్ట్‌ అలర్జీ ఉంది. దుమ్ముకు ఎక్స్‌పోజ్‌ అయితే ఆయాసం వస్తుంటుంది. వింటర్‌ వచ్చింది కదా అని వ్యాయామం చేయదలచినప్పుడల్లా నాకు ఆయాసం వస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వగలరు.

వ్యాయామ ప్రక్రియ ఒక్కోసారి ఆస్తమాను ప్రేరేపించి, ఆయాసం వచ్చేలా చేస్తుంటుంది. దీర్ఘకాలిక ఆస్తమాతో బాధపడే చాలామందిలో వ్యాయామం చేసినప్పుడల్లా ఆస్తమా కనిపిస్తుంటుంది. సాధారణంగా మనం శ్వాస తీసుకునే సమయంలో బయటిగాలి కాసేపు ముక్కురంధ్రాలలో ఉండి వెచ్చబడటంతో పాటు తేమపూరితమవుతుంది. కానీ వ్యాయామం చేసే సమయంలో గాలి ఎక్కువగా తీసుకోవడం కోసం నోటితోనూ గాలిపీలుస్తుంటారు. అంటే వారు తేమలేని పొడిగాలినీ, చల్లగాలినీ పీలుస్తుంటారన్నమాట. దాంతో గాలిని తీసుకెళ్లే మార్గాలు ఈ చల్లగాలి వల్ల ముడుచుకుపోతాయి. ఫలితంగా గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకేళ్లే  మార్గాలన్నీ సన్నబడతాయి. దాంతో కొన్ని లక్షణాలు కనబడతాయి. అవి...

►పొడి దగ్గు వస్తుండటం  ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం
►పిల్లికూతలు వినిపించడం  వ్యాయామం తర్వాత తీవ్రమైన అలసట (మామూలుగా వ్యాయామం చేసేవారిలో ఇంత అలసట ఉండదు)
►వ్యాయామ సమయంలో గాలి తీసుకోవడంలో ఇబ్బంది / ఆయాసం. సాధారణంగా వ్యాయామం మొదలుపెట్టిన 5 నుంచి 20 నిమిషాల్లో ఈ లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. లేదా కొద్దిగా వ్యాయామం చేసి ఆపేసినా... 5 – 10 నిమిషాల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. అయితే వ్యాయామంతో వచ్చే ఆయాసం (ఎక్సర్‌సైజ్‌ ఇండ్యూస్‌డ్‌ ఆస్తమా) కారణంగా వ్యాయామ ప్రక్రియను ఆపాల్సిన అవసరం లేదు. దీన్ని అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.

వ్యాయామం మొదలుపెట్టడానికి ముందుగా పీల్చే మందులైన బ్రాంకో డయలేటర్స్‌ వాడి, వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. ఇక తక్షణం పనిచేసే లెవోసాల్‌బ్యుటమాల్‌ వంటి బీటా–2 ఔషధాలను వ్యాయామానికి 10 నిమిషాల ముందుగా వాడి, వ్యాయామ సమయంలో గాలిగొట్టాలు మూసుకుపోకుండా జాగ్రత్తపడవచ్చు. దీనితో పాటు వ్యాయామానికి ముందర వార్మింగ్‌ అప్, వ్యాయామం తర్వాత కూలింగ్‌ డౌన్‌ ప్రక్రియలను చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. సాధారణంగా వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు గాలిలో పుప్పొడి ఎక్కువగా ఉంటుంది.

కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు ఉదాహరణకు జలుబు, ఫ్లూ, సైనసైటిస్‌ వంటివి ఆస్తమాను మరింత ప్రేరేపిస్తాయి. ఇలా నలతగా ఉన్న సమయాల్లో వ్యాయామం చేయకూడదు. ఆస్తమా ఉన్నవారు త్వరగా ముగిసే ఆటల్లాంటివి... అంటే వాలీబాల్, బేస్‌బాల్, వాకింగ్‌ వంటివి చేయాలి. అంతేగానీ దీర్ఘకాలం పాటు కొనసాగుతూ, దూరాలు పరుగెత్తాల్సి వచ్చే సాకర్, బాస్కెట్‌బాల్, హాకీ వంటివి ఆడకూడదు. అయితే నీరు వేడిగా ఉన్న సమయాల్లో ఈతను అభ్యసిస్తూ, క్రమంగా వ్యవధిని పెంచుకుంటూ పోతే దేహానికి వ్యాయామం సమకూరడంతో పాటు వ్యాధి తీవ్రత కూడా తగ్గుతుంది.

పల్మునరీ ఫైబ్రోసిస్‌ అంటే ఏమిటి?
నాకు కొద్దినెలలుగా నెలలుగా దగ్గు, విపరీతమైన ఆయాసం వస్తోంది. చాలామంది డాక్టర్లకు చూపించుకున్నాను. చివరకు ఒక డాక్టర్‌గారు దాన్ని పల్మునరీ ఫైబ్రోసిస్‌ అని నిర్ధారణ చేశారు. ఆ తర్వాత ‘జబ్బుకు కారణమేమిటో తెలుసుకోవా’లన్నారు. నాకు చాలా ఆందోళనగా ఉంది. పల్మునరీ ఫైబ్రోసిస్‌ అంటే ఏమిటి? దయచేసి తగిన సలహా ఇవ్వండి.  

పల్మునరీ ఫైబ్రోసిస్‌ అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక జబ్బు. ఇందులో ఊపిరితిత్తుల మీద చారల్లాగా వస్తాయి. ఇలా చార (స్కార్‌) రావడం పెరిగిపోతే కనెక్టివ్‌ టిష్యూ అనే కణజాలమంతా ఒకేచోట పోగుబడుతుంది. దాంతో మృదువుగా ఉండాల్సిన ఊపిరితిత్తుల గోడలు మందంగా మారతాయి. ఫలితంగా రక్తానికి తగినంత ఆక్సిజన్‌ అందదు. దీని వల్ల రోగులు ఆయాసపడుతూ ఉంటారు. కొంతమంది రోగుల్లో దీనికి కారణం ఏమిటో తెలుసుకుంటారు. అయితే కొందరికి ఇలా జరగడానికి కారణం ఏమిటో తెలియదు.

ఇలాంటి జబ్బును ఇడియోపతిక్‌ పల్మునరీ ఫైబ్రోసిస్‌ అంటారు. సాధారణంగా ఆయాసం, ఏదైనా పనిచేస్తున్నప్పుడు అది మరింత ఎక్కువ కావడం, ఎప్పుడూ పొడిదగ్గు వస్తుండటం, అలసట, ఛాతీలో ఇబ్బంది, కొంతమందిలో ఛాతీనొప్పి, ఆకలి తగ్గడం, నీరసించిపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఇది ప్రధాన జబ్బు కాదు. ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య తర్వాత రెండో (సెకండరీ) సమస్యగా ఇది వస్తుంది. కొన్నిసార్లు మన వ్యాధి నిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం (ఆటో ఇమ్యూన్‌), వైరల్‌ ఇన్ఫెక్షన్స్, టీబీ లాంటి బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌ వంటి కారణాలతో ఇది వస్తుంది.

ఇక ఎప్పుడూ ఆస్బెస్టాస్, సన్నటి ఇసుక రేణువులనూ, సిమెంటు నిండి గాలి పీలుస్తుండటం, నిమోనియాను కల్పించే బ్యాక్టీరియా, ఫంగస్‌లతో ఉన్న గాలిని పీల్చడం, కోళ్ల దాణా వంటి వ్యవసాయ పరిశ్రమలకు సంబంధించిన వాసనలు ముక్కుకు తగులుతూ ఉండటం వల్ల కూడా ఈ జబ్బు రావచ్చు. సిగరెట్‌ పొగ ఈ కండిషన్‌ను మరింత తీవ్రతరం చేస్తుంది. సాధారణంగా దీనికి చాలా పరిమితమైన చికిత్స మాత్రమే లభ్యమవుతోంది. మంచి మందులు ఇంకా ప్రయోగదశలోనే ఉండి, అందుబాటులోకి రావల్సి ఉంది. ప్రస్తుతం కార్టికోస్టెరాయిడ్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటర్‌ మందులు వాడుతూ ఊపిరితిత్తుల్లో వచ్చే వాపు, నొప్పి, ఎర్రబారే పరిస్థితిని (ఇన్‌ఫ్లమేషన్‌ను) అదుపు చేసే స్థితిలోనే వైద్యశాస్త్రం ఉంది. దీనికి తోడు అవసరమైనప్పుడు ఆక్సిజన్‌ పెట్టాల్సి ఉంటుంది. మీరు పెద్ద సెంటర్‌లలో నిపుణులైన పల్మునాలజిస్ట్‌లను సంప్రదించండి.
డాక్టర్‌ రమణ ప్రసాద్, కన్సల్టెంట్‌ స్లీప్‌ స్పెషలిస్ట్‌
అండ్‌  పల్మునాలజిస్ట్, కిమ్స్‌ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌

మరిన్ని వార్తలు