ఇల్లు దాటాక స్వేచ్ఛ విలువ తెలిసింది!

30 Jun, 2014 23:10 IST|Sakshi
ఇల్లు దాటాక స్వేచ్ఛ విలువ తెలిసింది!

 లైఫ్ బుక్: వాణీకపూర్

మా నాన్నకు జంతువుల హక్కులకు సంబంధించి ఒక స్వచ్ఛంద సంస్థ ఉండేది. దీంతో మా ఫామ్‌హౌజ్‌లో ఎటు చూసిన బాతులు, శునకాలు, కోతులు, గుర్రాలు, కుందేళ్లు ఉండేవి. బుజ్జికుక్కపిల్లలు బయట ఎక్కడైనా దీనస్థితిలో కనిపించినా, మురికిగా కనిపించినా ఇంటికి తెచ్చేదాన్ని. వాటిని శుభ్రంగా ఉంచేదాన్ని. నాకు అలా జంతువులన్నీ ఫ్రెండ్స్‌గా మారిపోయాయి. మనుషులతో కంటే వాటితో ఆడుకున్నదే ఎక్కువ.
     
చిన్నప్పుడు చాలా నియమనింబంధనల మధ్య పెరిగాను. కొంత కాలానికి నాకు స్వేచ్ఛ కావాలనిపించింది. ఢిల్లీలో టూరిజం కోర్సు చేసినప్పుడుగానీ నాకు ఆ అవకాశం రాలేదు. అప్పుడు నేను మొదటి సారిగా హాస్టల్‌లో ఉన్నాను. స్వేచ్ఛ విలువ ఏమిటో అప్పుడు తెలిసింది. అయినప్పటికీ, పబ్‌లకు, డిస్కోలకు వెళ్లడం కంటే ఇంట్లో జరిగే విందులనే బాగా ఇష్టపడతాను.
 నాలో ఆధునిక భావాలు ఉన్నప్పటికీ... నా హృదయం  మాత్రం పాత ప్రపంచంలోనే ఉంది!
     
కొన్నిసార్లు అడగకుండానే అదృష్టం ఆప్యాయంగా పలకరిస్తుంది. మోడల్ కావాలనేది నా కోరిక. అయితే నా కోరికకు నా బరువు ప్రతిబంధకంగా కనిపించేది. అయినప్పటికీ ఏదో ఆశ. 75 కిలోల బరువుతో ఢిల్లీలోని ఒక ప్రముఖ మోడలింగ్ ఏజెన్సీకి ఇంటర్వ్యూకు వెళ్లాను. ఎంపికవుతానని పొరపాటున కూడా అనుకోలేదు. అదేం అదృష్టమోగానీ ఎంపికయ్యాను. ఆ తరువాత చాలా బరువు తగ్గాను.
     
‘ఇది జరగాలి’ ‘అది జరగాలి’ అనే కోరికలు ఏమీ లేవు. జరగాల్సి ఉంటే కచ్చితంగా జరుగుతుందని నమ్ముతాను. నేను పుట్టి పెరిగిన వాతావరణంలో సినిమాల్లో నటించాలనే ఊహే రాదు. నేను కూడా సినిమాల్లోకి రావాలనే ఎప్పుడు అనుకోలేదు. కానీ విధి ఇలా నిర్ణయించింది!
 

మరిన్ని వార్తలు