ఐ ఫోన్ డెలివరీ!

19 Mar, 2015 22:50 IST|Sakshi
ఐ ఫోన్ డెలివరీ!

చదివింత...
సత్యవర్షి

 
‘‘గుప్పిట్లోకి ప్రపంచాన్నే తెచ్చేస్తా... గుట్టుగా ప్రసవమూ చేయించేస్తా’’ నంటోంది మొబైల్ టెక్నాలజీ. న్యూజెర్సీ నివాసి రివెరా స్వీయానుభవమిది. మధ్య వయస్కురాలైన రివెరా నిండు గర్భిణిగా రెగ్యులర్ చెకప్స్ కోసం డాక్టర్ మీనా దేవెళ్లను కలిసేందుకు వెళ్లింది. అయితే అపాయింట్‌మెంట్ ఇచ్చిన ఆ డాక్టర్ అనుకోకుండా వేరే చోట ఉన్న ఆసుపత్రిలో ఉండిపోవాల్సి వచ్చింది. అదే సమయంలో రివెరాకి పురిటి నొప్పులు రావడం మొదలయ్యాయి.

అప్పుడా కన్సల్టేషన్ క్లినిక్‌లో దిగువ స్థాయి సిబ్బంది తప్ప వైద్య నిపుణులు ఎవరూ లేరు. అంత గాభరాలోనూ కాస్త స్థిమితంగా ఆలోచించిన రివెరా భర్త... ‘‘ఐఫోన్ ఉండగా... డాక్టరెందుకు దండగా’’ అంటూ అప్పటికప్పుడు తన ఐఫోన్‌ను సమయోచితంగా ఉపయోగించాడు. తమ డాక్టర్‌కు ఫేస్‌టైమ్‌ను కనెక్ట్ చేశాడు.  వీడియో మెసేజింగ్ యాప్ ద్వారా డాక్టర్ ప్రత్యక్షంగా ఇస్తున్న సూచనలతో సిబ్బంది రివెరాకి సుఖప్రసవం జరిగేలా చూశారు. మొత్తం మీద ఇరవై నిమిషాల వ్యవధిలో ప్రసవం జరిగిపోవడం, పండంటి మగబిడ్డ రివెరా ఒడిలోకి చేరిపోవడం జరిగిపోయాయి.
 
 

మరిన్ని వార్తలు