నన్ను చూస్తే చాలు... పారిపోయేవాళ్లు!

2 Jul, 2014 22:50 IST|Sakshi
నన్ను చూస్తే చాలు... పారిపోయేవాళ్లు!

కనువిప్పు
 
‘వీడితో గొడవ ఎందుకు?’ అనుకునేవారో ఏమో తెలియదుగానీ, అప్పు మాత్రం ఇచ్చేవారు. నా గురించి కాలేజీ మొత్తం తెలిసిపోయింది. ఎక్కడ అప్పు అడుగుతానోనని నన్ను తప్పించుకొని తిరిగేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగింది.
 
 అందరూ అవసరాల కోసం అప్పులు చేస్తారు. నేను మాత్రం సరదా కోసం చేసేవాడిని. ఇతరులను పరీక్షించడానికి కూడా అప్పులు చేసేవాడిని. అప్పు ఇస్తే స్నేహంగా ఉండేవాడిని.  ఇవ్వకపోతే వారితో ఏదో విధంగా తగాదాకు దిగేవాడిని.
 
నేను కథా రచయితను కాదు. కానీ అప్పుల కోసం కథలు చెప్పడంలో నన్ను మించిన వాడు లేడు.
 ‘‘నేను కాలేజీకి వస్తుంటే.... ‘ఆకలిగా ఉంది పది రూపాయలు ఉంటే ఇవ్వు బాబూ’ అని ఎవరో ముసలాయన అడిగాడు. నేను వెంటనే నా జేబులో నుంచి వందరూపాయలు తీసి ఆయన చేతిలో పెట్టాను. ప్రస్తుతం నా చేతిలో చిల్లిగవ్వ లేదు. ఒక వంద ఉంటే ఇవ్వు. రేపు ఇస్తాను’’ అని ఒకరోజు, ‘‘నాకు బాగా తెలిసిన వ్యక్తి  వెయ్యి రూపాయలు అప్పు అడిగితే ఇచ్చాను. నిజానికి నాకు కూడా డబ్బులకు ఇబ్బందిగా ఉంది. అంత పెద్దమనిషి అలా అడిగేసరికి కాదనలేకపోయాను.

ఒక అయిదువందలు ఉంటే ఇవ్వు వారంలోపు  ఇస్తాను’’ అని మరొకసారి... ఇలా రకరకాల అబద్ధాలు ఆడేవాడిని. విన్న వాళ్లు నమ్మేవారో, ‘వీడితో గొడవ ఎందుకు?’ అనుకునేవారో తెలియదుగానీ, అప్పు మాత్రం ఇచ్చేవారు. నా గురించి కాలేజీ మొత్తం తెలిసిపోయింది. ఎక్కడ అప్పు అడుగుతానోనని నన్ను తప్పించుకొని తిరిగేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగింది.
 
ఒకసారి మా అమ్మకు కంటి ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. డబ్బు కోసం నాన్న రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అది తెలిసి  వారించాను. నేను రంగంలోకి దిగాను.  తొలిసారి ఒక నిజమైన కారణం కోసం అప్పు అడిగాను. ఒక్కరంటే ఒక్కరు కూడా సహాయం చేయలేదు. కొందరైతే ఏకంగా గొడవకు కూడా దిగారు.
 
‘‘ఎన్ని రోజులు ఇలా ఇతరుల చెవిలో పూలు పెడతావు?’’ అన్నవాళ్లు కూడా ఉన్నారు. ఇక నాకు అప్పు పుట్టదనే విషయం స్పష్టంగా అర్థమైంది. నా పరిస్థితి గమనించిన నాన్న ఎవరి కాళ్లో పట్టుకొని అప్పు తెచ్చి అమ్మకు కంటి ఆపరేషన్ చేయించాడు. ఇక అప్పటి నుంచి నాలో పూర్తిగా మార్పు వచ్చింది.
 
‘ఒక్కసారి నమ్మకం కోల్పోతే వందసార్లు ప్రయత్నించినా రాదు’ అనే విషయం అర్థమైంది. ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను.
 
-టి.కె, రాజమండ్రి
 

మరిన్ని వార్తలు