అహాహ్హ  నాకే ముందు నాన్న చేతి వంట

8 Apr, 2019 23:20 IST|Sakshi

అంతా గొప్పగొప్ప  నాన్నలు! టైమే లేనివాళ్లు.  వంటసలే రాని వాళ్లు. వాళ్లొచ్చి కుకింగ్‌ మొదలు పెట్టేశారు. రిజల్టేమిటి? పాస్‌ అయిన వాళ్లెందరు?  పాస్‌ చేయబడిన వాళ్లెందరు?!

నాన్న వండితే ఎలా ఉంటుంది? అమ్మ వండినట్లయితే ఉండదు. కానీ ఆ వంటలో నాన్న ప్రేమ ఉంటుంది. కూతురు ఆ ప్రేమను రుచి చూస్తుంది. అందుకే నాన్న వంటలో లోపాలను కూతురి ‘టేస్ట్‌ బడ్స్‌’ గుర్తించవు. అదే అమ్మ వంటలో ఏదో ఒక రోజు ఒక్క ఆవగింజ పేలకపోయినా సరే... ‘పంటి కింద పడుతున్నాయమ్మా’ అంటూ కంప్లయింట్‌ చేస్తారు అమ్మాయిలు. ‘నువ్వు వండేటప్పుడు అన్నీ సమంగా వేయించు. నేనూ చూస్తాగా’ అంటూ తల్లి మొట్టికాయ వేసినట్లు బదులిస్తుంది. ఆ చిన్నారి అమ్మవైపు గుర్రుగా చూడడాన్ని ఓరకంట గమనిస్తూ ముసిముసిగా నవ్వుకుంటుంటాడు తండ్రి. ఆ మాత్రం భరోసా దొరికితే ఇంకేం కావాలి... అమ్మను ఈజీగా ఆట పట్టించేయవచ్చు. అంతే... ఏ ఇంట్లో అయినా తండ్రీకూతుళ్లు ఒక జట్టు. ఆ ఇద్దరూ జట్టుకట్టి వారంలో ఓ రోజు తామే వండితే ఎలా ఉంటుంది? ఆ వండుకున్న వాళ్లకు మాత్రం తండ్రీ కూతుళ్ల ప్రేమలా రుచిగానే అనిపిస్తుందా వంట. కానీ ఆ వంటలో లోపాలు అమ్మకు మాత్రమే తెలుస్తాయి. అందుకే, ఎందుకైనా మంచిదని అమ్మల గైడెన్స్‌లో అనేక మంది తండ్రీకూతుళ్లు వండడానికి సిద్ధమైన ఒక ఈవెంట్‌ ఇది. ఇంట్రెస్టింగ్‌ కదా!

ఐఏఎస్‌ ‘చెఫ్‌’
జయేశ్‌ రంజన్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌. తెలంగాణ రాష్ట్రంలో ఇండస్ట్రీస్‌ అండ్‌ కామర్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖలకు ప్రిన్సిపల్‌ సెక్రటరీ. 1992 బ్యాచ్‌ కు చెందిన జయేశ్‌ ఐఏఎస్‌లో ఆల్‌ ఇండియా టాపర్‌. ఆయన ఢిల్లీయూనివర్సిటీ, కోల్‌కత్తా యూనివర్సిటీ, నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్, బర్మింగ్‌ హామ్, టోక్యో, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్, హార్వర్డ్‌ యూనివర్సిటీ, స్టాక్‌హోమ్‌లోని స్వీడిష్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో చదువుకున్నారు. ఉద్యోగంలో బిజీ కాకపోతే ఇంకా చదువుకోవడానికి ఏమేమి కోర్సులు న్నాయా అని చూసుకుని చేరిపోయే వారేమో! ఇప్పుడైతే ఉద్యోగంలో కొంచెం ఆటవిడుపు చూసుకుని హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఉన్న ‘ద  కలినరీ లాంజ్‌’లో ఉగాది పచ్చడి చేయడం నేర్చుకు న్నారు. ‘డాడ్స్‌ కుకింగ్‌ క్లబ్‌’లో చేరి కూతురితో కలిసి వంటలు చేస్తున్నారు. ఏప్రాన్‌ కట్టుకుని గరిటె పట్టుకున్నారాయన. జయేశ్‌ పుట్టింది, పెరిగింది రాజస్థాన్‌లో. వాళ్ల పూర్వీకులది పంజాబ్‌ రాష్ట్రం. తెలుగు వాళ్ల ఉగాది పచ్చడితో పరిచయమే లేని రంజన్‌ ఉగాది పచ్చడి కలపడానికి రెడీ అయ్యారు. కూతురు ఇషిక మాత్రం ‘మా నాన్న అన్నింటిలో బెస్ట్‌’ అన్నంత ధీమాతో చూస్తోంది. అయితే... భార్య రుచీ రంజన్‌ మాత్రం ఈ తండ్రీకూతుళ్లు.. çపచ్చడి కోసం ఏమేమి కలుపుతున్నారో, ఎంతెంత కలుపుతున్నారోనని చూస్తూ, కడుపు కకావికలం కానివ్వకుండా జాగ్రత్త కోసం సూచనలిస్తున్నారు. 

ఉడికిందా? ఐతే ఓకే! 
‘ద కలినరీ లాంజ్‌’ ఇటీవల నిర్వహించిన డాడ్స్‌ కుకింగ్‌ క్లబ్‌లో వండడానికి తండ్రులు చాలామందే వచ్చారు. చెయ్యి తిరిగిన తండ్రులు కూతుళ్లకు నేర్పిస్తూ వండారు. లెర్నర్‌ తండ్రులు కూతుళ్ల సలహా, సహాయం తీసుకుంటూ వండారు. మొదటగా ఉగాది పచ్చడి కలిపి, ఆ తర్వాత పాస్తా చేసి భార్యాపిల్లలకు తినిపించారు మగవాళ్లు. వంట చేస్తే మానసిక ఒత్తిడి ఎంతగా తగ్గుతుందోనని సంతోషపడిపోయారు వంట చేసిన మగవాళ్లందరూ. వాళ్లంతా ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో, ఊపిరి సలపనంత బిజీగా ఉండేవాళ్లే. అందుకే వాళ్లకు వండడం ఒక ఆటవిడుపైంది. కూతుళ్లు గరిటె తిప్పుతుంటే తండ్రులు పెనంలో దినుసులు వేస్తున్నారు. తండ్రులు ఉడికిందా లేదా అని చూస్తుంటే కూతుళ్లు... నాన్నకసలు వంట వచ్చా రాదా, నాన్న వంట చూడడానికేనా తినడానికి కూడానా అని సందేహంగా రుచి చూస్తున్నారు. ఆ ప్రోగ్రాంలో కూతుళ్లందరూ తండ్రులకు పాస్‌ సర్టిఫికేట్‌లు ఇచ్చేశారు. తర్వాత అంతా కలిసి ఆనందానుభూతులను పంచుకుంటూ భోజనం చేశారు. 

‘‘మా ఉద్యోగాల్లో టైమ్‌ మా చేతిలో ఉండదు. చాలాసార్లు కుటుంబంతో క్వాలిటీ టైమ్‌ గడపలేక పోతుంటాం. టైట్‌ షెడ్యూల్‌లో ఇలాంటి ఒక సరదా ప్రోగ్రామ్‌ని కూడా చేర్చుకుంటే చాలా బాగుం టుంది. బిజీగా ఉండే తండ్రులు పిల్లలతో అనుబంధాన్ని పెంచుకోవడానికి ఇలాంటి కుకింగ్‌ క్లబ్‌లు బాగా ఉపయోగపడతాయి’’ అన్నారు జయేశ్‌ రంజన్‌. ఆ కార్యక్రమాన్ని రూపొందించిన జయ్‌ కిషన్‌ మాట్లాడుతూ ‘‘వారంలో ఒక రోజు డాడ్స్‌ క్లబ్‌కి వచ్చి కుటుంబం అంతా ఆనందంగా గడపడానికి ఇదో మంచి మార్గం. మంచి ఆహారంతో ఆరోగ్యం కూడా బావుంటుంది’’ అన్నారు. జయ్‌ కిషన్‌ సీరియల్‌ ఎంటర్‌ప్రెన్యూర్,  టీ హబ్‌ మాజీ సీఈవో.
– వాకా మంజులారెడ్డి
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు