ఐస్‌క్రీమ్‌ భౌల్‌

11 Apr, 2017 00:26 IST|Sakshi
ఐస్‌క్రీమ్‌ భౌల్‌

ఐస్‌ క్రీమ్‌లను ‘హిమక్రీములు’ అన్నాడు సినీ కవి. మెక్సికన్‌ వర్తకుడు ఒకడు ఒక అడుగు ముందేసి ‘శునక క్రీము’లకు తెర తీసి నేనేం తక్కువ కాదు అంటున్నాడు. మెక్సికో నగరంలో  ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ నడిపే ‘మోరిసియో మొంటోయా’ అనే వర్తకుడు మామూలు మనుషులకు ఐస్‌క్రీములు అందరూ అమ్ముతారు నేను కుక్కలకు అమ్ముతాను అని తీర్మానించుకున్నాడు.

 వాటి కోసమని సహజంగా తోడుబెట్టిన పెరుగు, అరుగుదలకు ఉపయోగపడే బ్యాక్టీరియాను మిక్స్‌ చేసి శునకక్రీములు తయారు చేశాడు. ‘మామూలు ఐస్‌క్రీములు కుక్కలకు కడుపునొప్పి విరేచనాలు కలిగిస్తాయి. కాని నేను తయారు చేసినవి వాటికి సులభంగా అరుగుతాయి’  అని సదరు వర్తక మహాశయుడు సెలవిస్తున్నాడు. అన్నట్టుగానే అతడి షాప్‌కు గిరాకీ పెరిగింది.

  ‘రోమీ’, ‘ట్యాంక్, ‘సూపర్‌’, ‘ట్సుకీ’... అనే రకరకాల పేర్లున్న కుక్కలు సాయంత్రమైతే చాలు యజమానుల వెంట తోక ఊపుకుంటూ నాలుకతో ఐస్‌ క్రీమ్‌ చప్పరించడానికి ఈ షాప్‌కు వచ్చేస్తున్నాయి. ‘రోజూ ఒకేలాంటి తిండి ఇంట్లో తిని వాటికి విసుగెత్తుతుంది. ఈ ఐస్‌క్రీములేవో బాగానే ఉన్నట్టున్నాయి’ అంటున్నారు ఓనర్లు. అందుకు అంగీకారంగా భౌభౌమంటున్న శునకాలు మరో ధ్యాసలేనట్టు ఐస్‌క్రీమ్‌ బౌల్స్‌లో మూతి దూరుస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు