ఆదర్శ హనుమ

19 Aug, 2017 00:08 IST|Sakshi
ఆదర్శ హనుమ

ఆత్మీయం

నేటి కథానాయకుల నుంచి నేర్చుకోగలిగింది, నేర్చుకోవలసిందీ ఏమున్నా లేకపోయినా, యువత హనుమను చూసి నేర్చుకోవలసింది మాత్రం చాలా ఉంది. ఆయనను పూజించడం సరే, అసలాయనను ఎందుకు పూజించాలి, ఆయన నుంచి స్ఫూర్తిగా ఏమి తీసుకోవాలో చెబితే పిల్లలే కాదు, యువకులు కూడా హనుమను ఆదర్శంగా తీసుకోవాలనుకుంటారు. అవేమిటో చూద్దాం... స్వామి కార్యాన్ని నెరవేర్చడం కోసం నూరు యోజనాల విస్తీర్ణం గల సముద్రాన్ని అవలీలగా లంఘించాడు. తాను కనీసం ఎప్పుడూ చూసి ఎరుగని సీతమ్మను గుర్తించి, ఆమె ముందు శ్రీరాముని గుణగానం చేశాడు. తనపై ఆమెకు ఏమూలో శంక మిగిలి ఉన్నదని గ్రహించి ఆకాశమంత ఎత్తుకు ఎదిగి విశ్వరూపం చూపాడు. అడ్డువచ్చిన రాక్షసులను అవలీలగా మట్టుపెట్టాడు. బ్రహ్మాస్త్రం ఏ హానీ చేయదన్న వరం ఉన్నా, రావణుని సమక్షానికి వెళ్లేందుకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడి బ్రహ్మపట్ల తన విధేయతను చాటుకున్నాడు.

లంకాధీశుని కంటే ఎత్తుగా ఉండేట్లు తన వాలంతో ఆసనాన్ని ఏర్పరచుకుని దాని మీద ఆసీనుడయ్యాడు. నిష్కారణంగా అవతలివారికి హాని తలపెడితే తమకంతకన్నా ఎక్కువ కీడు జరుగుతుందన్న వాస్తవాన్ని నిరూపించేందుకు తన తోకకు పెట్టిన నిప్పుతోనే లంకాదహనం చేశాడు. సీతజాడకోసం పరితపిస్తున్న రామునికి అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా ‘దృష్ట్వాన్‌ దేవి’ (చూశాను సీతను) అని చెప్పి కొండంత ఉపశమనం కలిగించాడు. తాను ఆజన్మ బ్రహ్మచారి అయినప్పటికీ, ఆదర్శదంపతులైన సీతారాములను కలిపి భావితరాలకు ఆదర్శంగా నిలిచాడు. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, చురుకుదనం, మాటకారితనం, పౌరుషం, పరోపకారం, అచంచలమైన ఆత్మవిశ్వాసం, దీక్ష, కార్యదక్షత, అపారమైన ప్రభుభక్తి, వజ్రంలా ప్రకాశించే ఆరోగ్యకరమైన శరీరం కలవాడు ఆంజనేయుడు. హనుమంతుని వంటి నమ్మినబంటు, దౌత్యవేత్త, మంత్రి మరెక్కడా కానరాడు. అందుకనే ఆయన చిరంజీవిగా.. ఆదర్శప్రాయుడిగా నేటికీ శాశ్వతంగా భక్తుల మనోఫలకంపై నిలిచిపోయాడు.

మరిన్ని వార్తలు