మనసున్న మేడమ్‌

12 Jul, 2018 00:03 IST|Sakshi

ఆదర్శం

అందరమూ మనుషులమే, మామూలు మనుషులమే. బస్‌లో ప్రయాణిస్తూ కారులో వెళ్లే వాళ్లను చూస్తాం, చిన్న కారులో వెళ్తూంటే పెద్ద కార్ల వంక చూస్తాం. అద్దె ఇంట్లో ఉంటే సొంత ఇంటి గురించి ఆలోచిస్తాం. సొంత ఫ్లాట్‌లో ఉంటే ఇండిపెండెంట్‌ హౌస్‌ గురించి ఆలోచిస్తాం. వందమందిలో ఎనభై మంది ఇలా ఆలోచిస్తే... ఓ ఇరవై మంది ఇందుకు భిన్నంగా ఆలోచించే వాళ్లుంటారు. సీమ కూడా అలా భిన్నంగా ఆలోచించే మనిషే.

సీమ ఇంటి నుంచి కాలు బయటపెడితే ప్రభుత్వ వాహనం సిద్ధంగా ఉంటుంది. కలెక్టర్‌కు అందినంత గౌరవం కలెక్టర్‌ భార్యగా ఆమెకూ అందుతుంది. కొన్నిసార్లు అంతకంటే ఎక్కువగా కూడా. అయితే ఆమె దృష్టి గౌరవ వందనాలను దాటి సమాజపు లోతులను తాకింది. ఒకరోజు రోడ్డు మీద కారులో వెళ్తున్న సీమ రోడ్డు పక్కన బొమ్మలు అమ్ముకునే పిల్లలను, కారు అద్దాలు తుడిచి చెయ్యి చాచే పిల్లలను, డొక్కలు ఎండిపోయి, చింపిరి జుత్తుతో బిక్క ముఖాలు వేసుకుని ఉండే పిల్లలను చూసింది. చేతిలో పడ్డ పైసలతో రోడ్డు పక్కనే దొరికినది కొనుక్కుని ఆ దుమ్ములోనే తింటున్న పిల్లలను చూసి ‘ఎవరి బాల్యమూ ఇలా ఉండకూడదు. పువ్వులాంటి బాల్యం వికసించకుండానే వాడి రాలిపోకూడదు. పేదరికంలో పుట్టడం తప్పు కాదు, ఆ పేదరికాన్ని వాళ్ల నుంచి దూరం చేయాలని ఎవరూ అనుకోకపోవడమే తప్పు’ అనుకుంది. కారు దిగి వాళ్ల దగ్గరకు వెళ్లింది. ఆమె కంటపడిన వారినందరినీ బంగ్లాకు తీసుకెళ్లింది. వాళ్లకు మంచి భోజనం పెట్టి, దుస్తులు తెప్పించి ఇచ్చింది. ఒక గదిని ఈ పిల్లల కోసమే కేటాయించి వాళ్లకు చదువు చెప్పడం మొదలు పెట్టింది. అలా పాతిక మంది పిల్లలు అయ్యారు. సీమ లక్నోలో ఐఏఎస్‌ ఆఫీసర్‌ జితేంద్ర కుమార్‌ భార్య.

అన్నం పెట్టి చదువు చెబుతుంది
ఆమె చేస్తున్న సర్వీస్‌ చూసిన ఆమె భర్త జితేందర్‌ కుమార్‌ సీమ కోసం ఒక కారును, డ్రైవర్‌ను ఇచ్చాడు. ఆ డ్రైవర్‌ రోజూ ఆ పిల్లలు నివసించే వాడలకు వెళ్లి వాళ్లను కారులో ఎక్కించుకుని కలెక్టర్‌ బంగ్లాకు తీసుకువస్తాడు. ఆ పిల్లలందరికీ ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనాలు కలెక్టర్‌ బంగ్లాలోనే. పగలంతా చదువుకుంటారు, గార్డెన్‌లో ఆడుకుంటారు. సాయంత్రం డ్రైవర్‌ తిరిగి వాళ్లను ఇళ్ల దగ్గర దించుతాడు. పిల్లలు కూడా సంతోషంగా వస్తున్నారు. తల్లిదండ్రులు కూడా కలెక్టర్‌ గారి భార్య కావడంతో ధైర్యంగా పంపిస్తున్నారు. ఇతర ఎన్‌జీవోలు ఇలాంటి పని చేయడానికి ముందుకు వచ్చినా కూడా తల్లిదండ్రుల నమ్మకాన్ని చూరగొనడం పెద్ద సమస్య అయ్యేది. 

మేడమ్‌ మాత్రమే కాదు.. అమ్మ కూడా
సీమ ఆలోచన ఇప్పుడు ఒక్కటే. ఆ పిల్లలందరినీ స్కూళ్లలో చేర్చాలి. అందరికీ కలిపి ఆమె ప్రాథమికంగా చదువు చెప్పగలుగుతోంది. కానీ పెద్ద క్లాసులకు సబ్జెక్టుల వారీగా అన్నీ చెప్పడం ఒకరితో అయ్యే పని కాదు. వాళ్ల భవిష్యత్తు బాగుండాలంటే ప్రధాన స్రవంతిలో చదువుకోవాలనేది ఆమె కోరిక. వాళ్లంతా ప్రయోజకులైతే రేపటి తరంలో సమాజంలో పాతిక కుటుంబాల జీవన స్థితిగతులు మెరుగవుతాయంటారామె. సీమ మేడమ్‌ మాకు టీచరే కాదు, అమ్మతో సమానం అంటున్నాడు ఆమె పెంపకంలో ఉన్న ఆదిత్య.
– మంజీర

మరిన్ని వార్తలు