బ్యాంకు లాకరు కీ పోతే..

27 Jun, 2014 23:07 IST|Sakshi
బ్యాంకు లాకరు కీ పోతే..

ఎంత జాగ్రత్తగా దాచుకున్నా ఇంటివి కావొచ్చు... వాహనంవి కావొచ్చు.. తాళం చెవులను ఎక్కడో ఒక దగ్గర మర్చిపోవడమో లేక పోగొట్టుకోవడమో లాంటి పరిస్థితి అప్పుడప్పుడు ఎదురవుతూనే ఉంటుంది. ఇవి మన చేతిలో విషయాలే కాబట్టి డూప్లికేట్ తయారు చేయించుకోవడం లేదా కొత్త తాళం కొనుక్కోవడమో చేస్తుంటాం. మరి.. ఎంతో విలువైన వాటిని భద్రపర్చుకునే బ్యాంకు లాకరు తాళం చెవి పోగొట్టుకుంటే  పరిస్థితి ఏంటి? కొత్తది తీసుకోవాలంటే ఏం చేయాలి? ఎంత భారం పడుతుంది? ఇలాంటివి వివరించేదే ఈ స్టోరీ.
 
సాధారణంగా లాకరు తీసుకునేటప్పుడు బ్యాంకును బట్టి ముందుగానే 3 సంవత్సరాల సరిపడా అద్దె, బ్రేకింగ్ చార్జీలు (అత్యవసర పరిస్థితుల్లో లాకరును పగలగొట్టాల్సి వచ్చే సందర్భాల కోసం) కట్టాల్సి ఉంటుంది. తాళం చెవుల విషయానికొస్తే.. లాకరుకు రెండు తాళం చెవులు ఉంటాయి. మనకు ఒకటే ఇస్తారు. రెండోది బ్యాంకు దగ్గర ఉంటుంది. ఈ రెండూ ఉపయోగిస్తేనే లాకరు తెరవడం సాధ్యపడుతుంది.

మనకి ఇచ్చే దానికి డూప్లికేటు ఉండదు కాబట్టి తాళం చెవిని అత్యంత జాగ్రత్తగా భద్రపర్చుకోవాలి. ఎంత జాగ్రత్త పడినా కీ పోయిందంటే.. ఆ విషయాన్ని బ్రాంచి మేనేజరుకు రాతపూర్వకంగా తెలియజేయాలి. తద్వారా తాళం చెవి దొంగిలించిన వారు దుర్వినియోగం చేయకుండా చూడొచ్చు.
 
ఇక ఆ తర్వాత కొత్త లాకరు ఏర్పాటు చేయడమో లేదా డూప్లికేట్ కీస్ చేయించి ఇవ్వడమో చేస్తుంది బ్యాంకు. ఇందుకోసం సదరు లాకరును తయారీ చేసిన కంపెనీకి బ్యాంకు సమాచారం ఇస్తుంది. ఆ కంపెనీ టెక్నీషియన్ బ్యాంకుకు వచ్చి, అధికారులు, ఖాతాదారుల సమక్షంలో మాత్రమే లాకరును కట్ చేసి తెరుస్తాడు. లాకరులో దాచిన వస్తువుల గురించి వివాదం తలెత్తకుండా ఉండేందుకే ఈ జాగ్రత్త. ఒకవేళ ఖాతాదారు రాలేకపోయిన పక్షంలో.. బ్యాంకే లాకరును బ్రేక్ చేయించి, అందులోని వస్తువులను సీల్డ్ బాక్సులో ఉంచి కస్టమరుకు తర్వాత అందజేస్తుంది.
     
అయితే, పోయింది చిన్న తాళం చెవే కదా మహా అయితే యాభయ్యో, వందో చార్జీ పడుతుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. కొత్త తాళం, కీ కోసం కొన్ని బ్యాంకులు దాదాపు రూ. 1,000 నుంచి రూ. 3,000 దాకా వసూలు చేస్తున్నాయి. అదనంగా సర్వీసు చార్జీలు కూడా ఉంటాయి.

లాకరు కంపెనీ టెక్నీషియన్‌ని రప్పించి, లాకరును చూపించి, డూప్లికేట్ కీ చేయించి ఇచ్చే క్రమంలో ఎదురయ్యే రవాణా, అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు మొదలైన వాటిని బ్యాంకు ఈ విధంగా తీసుకుంటుందన్న మాట. అలాగని అన్ని లాకర్లకు ఒకే రేటు ఉండదు. లాకరు సైజును బట్టి కట్టాల్సిన చార్జీల పరిమాణం మారుతుంటుంది. ఇన్ని తలనొప్పులు ఎదురవకుండా ఉండాలంటే.. లాకరు కీని భద్రంగా దాచుకోవడం ఉత్తమం?
 

మరిన్ని వార్తలు