భయ ధైర్యాలు

4 Apr, 2019 00:28 IST|Sakshi

బుద్ధివృక్షం

చెయ్యి వేసినా ఏం కాదనే ధైర్యం, చెయ్యి వేస్తే ఏమౌతుందోనన్న భయం.. ఈ భయ ధైర్యాలను.. స్త్రీలపై లైంగిక నేరాలు జరగడానికి, జరగకపోవడానికి కారణాలు కానివ్వని సంస్కరణ అయితే సమాజానికి ఒకటి అవసరం.

మాధవ్‌ శింగరాజు
మనుషులు ఎవరి పని వారు చేసుకుపోతే, చట్టానికి తన పని తాను చేసుకుపోయే అవసరం ఉండదు. చట్టం తన పని తాను చేసుకుపోతోందంటేనే.. ‘ఓరి దేవుడా’ అనుకోవాలి.. మనుషులెవరో తాము చేయవలసిన పని చేయకుండా ఉండడమో, చేయ తగని పనిని చేసి ఉండడమో జరిగిందని! బిహార్‌లోని బుద్ధగయలో ఒక కేసు విషయంలో చట్టం ఇప్పుడు తన పని తను చేసుకుపోతోంది. బుద్ధగయలోని మహాబోధి ఆలయం ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేతం. ఆలయ దర్శనానికి దేశవిదేశాల నుంచి భక్తులు వచ్చివెళుతుంటారు. ఇటీవల 32 ఏళ్ల చైనా మహిళ ఒకరు షాంఘై నుంచి ఒంటరిగా ఈ పుణ్యక్షేత్రానికి వచ్చినప్పుడు గైడ్‌నని చెప్పుకున్న పాతికేళ్ల యువకుడు ఆమెతో అభ్యంతరకరమైన రీతిలో ప్రవర్తించాడు. ‘‘మీరిక్కడ చూడవలసినవి, చాలామందికి తెలియనివి అనేకం ఉన్నాయి’’ అని తీసుకెళ్లి సీసీ కెమెరాల లేని ప్రదేశంలో ఆ మహిళ చెయ్యి పట్టుకున్నాడు. ఆమె నిర్ఘాంతపోయారు. పవిత్ర బుద్ధ భగవానుని సన్నిధిలోనూ ఇలా చేసేవాళ్లుంటారా అని నిశ్చేష్టులయ్యారు.

ఆలయ నిర్వహణ కమిటీ కార్యదర్శి ఎన్‌.దోర్జే వెంటనే విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ఆమె చేత కంప్లయింట్‌ రాయించుకుని, కేస్‌ ఫైల్‌ చేశారు. బుద్ధగయలో అధికారిక గైడ్‌లు ఉంటారు. కానీ ఎలాగో ఆమె ఆ నకిలీ గైడ్‌ ట్రాప్‌లో పడిపోయారు. బహుశా అధికారిక గైడ్‌ నిర్లక్ష్యానికి భిన్నంగా అతడు ఎంతో మర్యాద ఇచ్చి, ఆమెకు నమ్మకాన్ని కలిగించి ఉంటాడు. చాలాసార్లు ఇలాగే జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న గైడ్‌లు ఉద్యోగానికి అలవాటు పడిపోయి, టూరిస్టులతో.. ‘వస్తే వచ్చారు... పోతే పోయారు’ అన్నట్లు వ్యవహరిస్తుంటారు. ప్రైవేటు గైడ్‌లు అలా కాదు. శ్రద్ధ తీసుకుంటారు. దగ్గరుండి అన్నీ చూపిస్తారు. డబ్బెంత తీసుకుంటారన్నది ముఖ్యంగా కనిపించదు. విధేయంగా ఉన్నాడా లేదా అన్నదే భాష తెలియనివారికి ముఖ్యం అవుతుంది. షాంఘై మహిళ నుంచి కంప్లయింట్‌ తీసుకున్నాక బుద్ధగయ పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. రిమాండ్‌లో పెట్టారు. ఇక అతడికి శిక్ష వేస్తారు అనుకుంటుండగా.. షాంఘై వెళ్లిపోయిన ఆ మహిళ నుంచి ఇక్కడి పోలీసులకు ఒక లెటర్‌ వచ్చింది.

యువకుడిని శిక్షించవద్దని, అతడిలో పరివర్తన తెచ్చే ప్రయత్నాలు చేయమని ఆమె అభ్యర్థన! ‘‘నేను బౌద్ధమతాన్ని విశ్వసిస్తాను. అందుకే అంతదూరం వచ్చాను. కానీ ఒక చేదు అనుభవం ఎదురైంది. అపరాధిని క్షమించమని బౌద్ధం చెబుతోంది. మీరు ఇప్పుడు అతడిని శిక్షిస్తే సంస్కరణ అతడితో ఆగిపోతుంది. శిక్షించకుండా సత్ప్రవర్తనపై శిక్షణ ఇప్పిస్తే అతడు మారడమే కాదు, మరికొందరిలో మార్పునకు కారణం అవుతాడు. అధికారులను నేను ఒకటే కోరుతున్నాను. అతడికి మంచి చదువును అందించండి. జీవితంలో మంచి పనులు చేసేలా అతడిలో ఆలోచన కలిగించండి. ఆ విధంగా బుద్ధగయను దర్శించుకునే ఒంటరి మహిళలకు, ఒంటరిగా ప్రయాణించి వచ్చే మహిళలకు భద్రతను, భరోసాను కలుగజేయండి’’ అని రాశారు షాంఘై మహిళ. అయితే ఆమె కోరినట్లు ఇప్పుడేమీ జరగబోవడం లేదు. డిస్ట్రిక్ట్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్‌.ఎస్‌.పి) రాజీవ్‌ మిశ్రా.. చట్టం తన పని తను చేసుకుపోయే యంత్రాంగంలో ఉద్యోగధర్మగ్రస్తుడైన ఒక నిమిత్త మాత్రపు చోదకశక్తిగానే ఉండబోతున్నారు.

‘‘భావోద్వేగాలకు చట్టంలో చోటు ఉండదు. తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడి తీరవలసిందే. బాధితురాలు క్షమాభిక్ష ప్రసాదించినప్పటికీ, బాధితురాలి తరఫున క్షమాభిక్ష ప్రసాదించడానికి చట్టానికి హక్కు లేదు’’ అని ఆయన నిక్కచ్చిగా చెప్పేశారు. నేడో రేపో ఆ యువకుడిపై చార్జిషీటు వేయబోతున్నారు. దానిని కోర్టుకు సమర్పించగానే శిక్ష ఖరారవుతుంది. ఉరిశిక్షేం వెయ్యరు కానీ.. శిక్షయితే వేస్తారు. చట్టం తన పని తాను చేసుకుపోవడానికి ఒక కంప్లయింట్‌ అయితే అవసరమే కానీ, కంప్లయింట్‌ని వెనక్కు తీసుకుని చట్టం చేత ఆ పనిని ఆపించడం తేలిక కాదు. పోలీసులు నిందితుడి పట్టుకుని, కోర్టులో  నిందితుడిని హాజరు పరిచి, కోర్టు రెండు వైపుల వాదనలు వినీ.. ఇన్ని జరగడానికి ఎంతో విలువైన వివిధ శాఖల సమయం ఖర్చవుతుంది. తీరా శిక్ష విధిస్తున్నప్పుడు.. ‘స్టాప్‌.. ఆపండి’ అని వస్తే ఆ శాఖలు మందలిస్తాయి.

ఒక్కోసారి ఆగ్రహిస్తాయి. షాంగ్‌ మహిళ రాసిన లెటర్‌లో ఒక పాయింట్‌ ‘అవున్నిజమే’ అనిపించేలా ఉంది. ‘అపరాధిని శిక్షిస్తే అతడొక్కడే మారతాడు. అపరాధిని సంస్కరిస్తే ఎందరినో మారుస్తాడు’ అని ఆమె రాశారు. చట్టానికి కావలసిందీ అదే. నేరం జరగకుండా ఉండడం. అయితే ఇదే విషయాన్ని చట్టం మరోలా చెబుతుంది. ‘అపరాధిని శిక్షిస్తే భయంతో సమాజం మారుతుంది. అపరాధిని సంస్కరించి వదిలేస్తే శిక్ష ఉండదన్న ధైర్యంతో మారాల్సి అవసరం లేదనుకుంటుంది’ అని! ఎవరి పాయింట్‌ కరెక్ట్‌? రెండు పాయింట్లూ కరెక్టే. అయితే చెయ్యి వేసినా ఏం కాదనే ధైర్యం, చెయ్యి వేస్తే ఏమౌతుందోనన్న భయం.. ఈ భయ ధైర్యాలను.. స్త్రీలపై లైంగిక నేరాలు జరగడానికి, జరగకపోవడానికి కారణాలు కానివ్వని సంస్కరణ అయితే సమాజానికి ఒకటి అవసరం. ఆ సంస్కరణను శిక్షే తెచ్చినా, శిక్షణే తెచ్చినా.    

మరిన్ని వార్తలు