నాకు పెళ్లయి ఆరు నెలలవుతోంది...

16 Mar, 2016 23:03 IST|Sakshi
నాకు పెళ్లయి ఆరు నెలలవుతోంది...

యూరాలజీ కౌన్సెలింగ్
 

నాకు పెళ్లయి ఆరు నెలలవుతోంది. అప్పటి నుంచి తరచూ మూత్రంలో మంట, నొప్పి వస్తున్నాయి. పరిష్కారం చెప్పండి. - ఒక సోదరి, హైదరాబాద్

మహిళలకు పెళ్లైన కొత్తలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా సాధారణంగా వస్తుంటాయి. దీన్నే హనీమూన్ సిస్టైటిస్ అంటారు. కలయిక సమయంలో యోనిమార్గంలోని సూక్ష్మక్రిములు మూత్రాశయంలోకి ప్రవేశించడం వల్ల ఇలా అవుతుంది. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మూడు రోజులు యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఇది తగ్గిపోతుంది.  మళ్లీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి కొన్ని మందులు వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా నీళ్లు ఎక్కువగా తాగడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం కూడా చాలా అవసరం.
 
మా ఆవిడ వయసు 45 ఏళ్లు. నెల రోజల క్రితం మూత్రంలో రక్తం పడిపోయింది. అప్పటి నుంచి క్యాన్సరేమోనని ఆందోళన పడుతోంది.
 - మహేందర్‌రావు, మెదక్

మూత్రంలో రక్తం పోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మూత్రాశయంలో ఇన్ఫెక్షన్, మూత్రవాహికలో రాళ్లు ఉండటం, క్యాన్సర్, టీబీ వంటి ఎన్నో కారణాల వల్ల ఇలా రక్తం పోతుంది. ఏ కారణం వల్ల ఇలా జరుగుతుందో తెలుసుకోడానికి స్కానింగ్, ఎక్స్-రే వంటి పరీక్షలు చేస్తారు. కారణానికి తగిన చికిత్స చేస్తారు. ఒక్కోసారి రక్తం పడుతుండే ఈ లక్షణాన్ని చూసి ఇన్ఫెక్షన్‌గా భావించి, యాంటీబయాటిక్స్ ఇస్తుంటారు. ఇది సరికాదు. కనీసం అల్ట్రా సౌండ్ స్కాన్ చేసి... రాళ్లు, గడ్డలు లాంటివి ఏమీ లేవని నిర్ధారణ చేసుకోవడం చాలా అవసరం.

 
డాక్టర్ సనంద్ బాగ్
సీనియర్ యూరాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్

 

హోమియో కౌన్సెలింగ్
 
 నా వయసు 35 ఏళ్లు. గత ఆర్నెల్లుగా మెడ, చెవుల భాగంలో దురద వస్తోంది. నా రోల్డ్‌గోల్డ్ చైన్ మెడకు ఆనే చోట ఈ దురద వస్తోంది. ఎన్ని ఆయింట్‌మెంట్స్, క్రీమ్స్  వాడినా తగ్గడం లేదు. హోమియోలో దీనికి శాశ్వత చికిత్స ఉందా?
 - సునీత, కర్నూలు

 మీరు చెబుతున్న లక్షణాలను బట్టి అది డర్మటైటిస్ కావచ్చు. ఇందులో కొన్ని రకాలు ఉన్నాయి. అవి..
 కాంటాక్ట్ డర్మటైటిస్: స్పర్శను బట్టి వచ్చే చర్మ వ్యాధి ఇది. ఇందులో చర్మం గులాబీ రంగుకు మారుతుంది. ఇది దురదను కలిగిస్తుంది. చికాకు, అలర్జీని కలిగిస్తుంది. రబ్బరు తొడుగుల వల్లగానీ లేదా ఆభరణాలోని కోబాల్ట్ వంటి లోహాలు ఈ జబ్బుకు కారణమవుతాయి. కొన్ని పరిమళ ద్రవ్యాలు, నగలు, చర్మసంరక్షణ ఉత్పత్తుల వల్ల ఇది సంభవించవచ్చు.

నుమ్యులార్ డర్మటైటిస్: నుమ్యులార్ డర్మటైటిస్‌లో నాణెం ఆకృతిలో మచ్చలు వస్తాయి. ఇవి కాళ్లు, చేతులు, భుజాలు, నడుముపై వస్తుంది. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో ఎక్కువ. సాధారణంగా ఇది 55 నుంచి 65 ఏళ్ల వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
 
ఎగ్జిమా: ఇది కూడా ఒక రకం డర్మటైటిస్. క్రానిక్ స్కిన్ ఇన్‌ఫ్లమేషన్‌ని ఎగ్జిమా అంటారు. ఇందులో చర్మం ఎరుపుదనంతో కమిలినట్లుగా ఉండటం, కొద్దిగా పొరలు తయారవ్వడం, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దురద ఎక్కువగా కనిపిస్తుంది. ఎగ్జిమా వ్యాధి బయటపడేటప్పుడు ఒక నిర్దిష్టమైన విధానాన్ని అవలంబిస్తుంది. మొదట చర్మం ఎరుపు రంగులో కములుతుంది. తర్వాత వాపుతో కూడిన పొక్కులు వస్తాయి. ఇవి క్రమంగా నీటి బుగ్గల ఆకృతిని సంతరించుకుంటాయి.
 
సెబోరిక్ డర్మటైటిస్: ఇది ముఖ్యంగా పిల్లలలో కనిపిస్తుంది. ముఖం, తల మీద చర్మంపై ఎరుపు లేదా పసుపు రంగులో చర్మం కమిలినట్లుగా ఉంటుంది. కనుబొమల వద్ద, ముక్కు పక్కల వ్యాపిస్తుంది. ఇది అధిక ఒత్తిడి వల్ల రావచ్చు.
 
కారణాలు:  కొన్ని రకాల మందులు  జుట్టుకోసం వాడే రంగులు  కుంకుమ మొదలైన పదార్థాల వల్ల డర్మటైటిస్ వస్తుంది. జంతుచర్మాలతో తయారైన ఉత్పాదనలు, రోల్డ్‌గోల్డ్ నగల వల్ల కూడా డర్మటైటిస్ రావచ్చు. డర్మటైటిస్‌కు హోమియోలో మంచి మందులు ఉన్నాయి. యాంటిమోనియమ్, క్రూడమ్, అపిస్ మెల్లిఫికా, రస్టాక్సికోడెండ్రాన్, సల్ఫర్ వంటి మందులను రోగి లక్షణాలను బట్టి అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే డర్మటైటిస్ పూర్తిగా నయమవుతుంది.
 
డాక్టర్ మురళి
కె. అంకిరెడ్డి
డీ (హోమియో)
స్టార్ హోమియోపతి
హైదరాబాద్
 
 
కార్డియాలజీ కౌన్సెలింగ్
 
మా అత్తగారి వయసు 52 ఏళ్లు. ఈమధ్య పొడిదగ్గు, పడుకుంటే ఆయాసంతో నిద్రలేవడం, గుండెదడ వంటివి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాం. హార్ట్ వాల్వ్‌లలో సమస్య ఉందని డాక్టర్ గారు అన్నారు. అసలు ఈ వాల్వ్స్ సమస్య ఎందుకు వస్తుందో వివరించి, లక్షణాలు కారణాల గురించి దయచేసి తెలపండి.    - సునీత, నందిగామ
మీరు చెప్పిన లక్షణాల బట్టి మీ అత్తగారికి గుండె కవాటాలలో సమస్య (హార్ట్ వాల్వ్ డిసీజ్) ఉందని తెలుస్తోంది. గుండెలో నాలుగు కవాటాలు ఉంటాయి. అవి.. 1) ట్రైకస్పిడ్ వాల్వ్ 2) పల్మనరీ వాల్వ్ 3) మైట్రల్ వాల్వ్ 4) అయోర్టిక్ వాల్వ్. వీటిలో రెండు రకాలు సమస్యలు రావచ్చు. అవి...  వాల్వ్స్ సన్నబడటం (స్టెనోసిస్)తో పాటు వాల్వ్ లీక్ కావడం (రీగర్జిటేషన్).
 
వాల్వ్ సమస్యలకు కారణాలు: కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల, కొందరిలో రుమాటిక్ హార్ట్ డిసీజెస్ వల్ల, మరికొందరికి ఇవి పుట్టుకతోనే రావచ్చు. కొందరిలో వయసు పెరగడం వల్ల కూడా రావచ్చు.

వాల్వ్ సమస్యలో లక్షణాలు: హార్ట్ ఫెయిల్యూర్ వల్ల ఆయాసం, పొడి దగ్గు, పడుకుంటే ఆయాసం వల్ల నిద్ర నుంచి లేవాల్సి రావడం, గుండె దడ కనిపిస్తాయి. నిస్సత్తువతోనూ ఒక్కోసారి గుండెనొప్పి రావచ్చు. కొందరిలో సమస్య వచ్చిన కవాటాన్ని బట్టి నిర్దిష్టంగా కొన్ని లక్షణాలు కనిపించవచ్చు.  ఉదాహరణకు  ట్రైకస్పిడ్ వాల్వ్ లీక్ (రీ-గర్జిటేషన్) సమస్యతో కాళ్ల వాపు  మైట్రల్ వాల్వ్ సన్నబడితే (స్టెనోసిస్‌తో) రక్తపు వాంతులు   అయోర్టిక్ వాల్వ్ సన్నబడితే (స్టెనోసిస్‌తో) స్పృహ తప్పవచ్చు. ఇప్పుడు ‘ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎకో కార్డియోగ్రామ్’ అనే పరీక్ష వల్ల గుండెను మరింత స్పష్టంగా చూడటానికి అవకాశం ఉంది. కాబట్టి నిర్దిష్టంగా సమస్య ఒక్క చోటే ఉంటే మొత్తం వాల్వ్‌ను మార్చవచ్చు.

వాల్వ్ సమస్యలకు చికిత్స: వీటికి కొంతవరకు మందులతో చికిత్స చేయవచ్చు. మందులతో చికిత్స సాధ్యం కాకపోతే రోగి పరిస్థితిని బట్టి సర్జరీ అవసరమవుతుంది. మైట్రల్ వాల్వ్ సన్నగా మారడం (స్టెనోసిస్) జరిగితే... రోగులకు బెలూన్ వాల్విలోప్లాస్టీ చికిత్స ద్వారా సన్నబడ్డ వాల్వ్‌ను తిరిగి తెరవవచ్చు. అయితే మిగతా గుండె కవాటాల్లో సమస్య తలెత్తితే ఈ ప్రక్రియ సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు వాల్వ్ రీప్లేస్‌మెంట్ అన్నదే పరిష్కారం.
 వాల్వ్స్‌ను రీప్లేస్ చేసే క్రమంలో రెండు రకాల వాల్వ్స్‌ను ఉపయోగించవచ్చు. అవి...
 
1) మెకానికల్ వాల్వ్స్ 2) టిష్యూ వాల్వ్స్. మెకానికల్ వాల్వ్స్ విషయంలో ఒక ప్రతికూలత ఉంది. ఈ రోగులకు జీవితాంతం రక్తాన్ని పలుచబార్చే మందు ఎసిట్రోమ్ వాడాల్సి ఉంటుంది  టిష్యూ వాల్వ్స్ ఇతర జంతువుల కండరాలతో చేసినవి. ఈ టిష్యూ వాల్వ్స్ వాడిన వాళ్లలో రక్తాన్ని పలుచబార్చే మందు ఎసిట్రోమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది 15 ఏళ్ల వరకు పనిచేస్తుంది. ప్రస్తుతం వాల్వ్స్ మార్చడం కన్నా ఉన్న వాల్స్ ఎప్పుడూ మెరుగైనవి కావడంతో సర్జరీ కంటే వాల్వ్స్ రిపేర్ చేయడమే మేలు.
 
 డాక్టర్
 హేమంత్ కౌకుంట్ల కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాసిత్పటల్స్,
 బంజారాహిల్స్, హైదరాబాద్.
 

మరిన్ని వార్తలు