ఐఐటీల్లో బీటెక్..బెస్ట్ బ్రాంచ్‌లు.. బెటర్ క్యాంపస్‌లు

15 Jun, 2014 23:47 IST|Sakshi

జేఈఈ-అడ్వాన్స్‌డ్ ర్యాంకులు మరో రెండు రోజుల్లో వెల్లడి కానున్నాయి. ఐఐటీల్లో ప్రవేశానికి హాజరైన లక్షన్నర మంది అభ్యర్థుల భవితవ్యం తెలియనుంది. ఆన్‌లైన్ ఛాయిస్ ఫిల్లింగ్‌కు సమయం (జూన్ 20 నుంచి 24 వరకు) సమీపించింది. అందుబాటులోని సీట్ల సంఖ్యతో పోల్చితే తుది విజేతలుగా నిలిచేది కొందరే. ఆ కొందరిలోనూ ఎన్నో సందేహాలు. ఏ ఐఐటీలో చేరితే మంచిది? ఏ బ్రాంచ్‌కు ఏ ఐఐటీ బెస్ట్? తదితర సందేహాలు తలెత్తడం సహజం. ఈ నేపథ్యంలో.. గతేడాది (2013లో) ఇన్‌స్టిట్యూట్‌లు, బ్రాంచ్‌ల వారీగా క్లోజింగ్ ర్యాంకుల వివరాలు తెలుసుకుంటే కొంతమేర అవగాహన పొందొచ్చు. వివరాలు..
 
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్

 
బీటెక్ కోర్సులో జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకర్లలో అత్యధికుల ఫస్ట్ ఆప్షన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. గత కొన్నేళ్లుగా టాప్ ర్యాంకర్ల ఛాయిస్‌గా సీఎస్‌ఈ బ్రాంచ్ నిలుస్తోంది. గతేడాది జనరల్ సహా అన్ని కేటగిరీల ర్యాంకర్లలో టాప్-10లోపు విద్యార్థులు సీఎస్‌ఈకే మొగ్గు చూపారు. ఇక ఇన్‌స్టిట్యూట్ పరంగా సీఎస్‌ఈ బ్రాంచ్‌కు టాపర్ల బెస్ట్ క్యాంపస్‌గా నిలుస్తోంది ఐఐటీ-బాంబే. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, ఆర్ అండ్ డీ ఒప్పందాలు, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నిరంతరం సిలబస్‌లో మార్పులు, చేర్పులు, పూర్వ విద్యార్థుల విజయాలు వంటివి ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొనొచ్చు. బీటెక్ కోర్సులో చేరే విద్యార్థి తాను ఎంచుకున్న బ్రాంచ్‌కు సంబంధించి కోర్సు ముగిసే సమయానికి అంటే నాలుగేళ్ల తర్వాత భవిష్యత్తు అవకాశాలను అంచనా వేసి ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో భవిష్యత్తు అవకాశాల పరంగా ఆందోళన అనవసరం. కంప్యూటర్, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌ల రూపకల్పన, వాటి అనువర్తన చేయడం, పనిచేసే రంగాన్ని బట్టి తదనుగుణమైన సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్స్, అప్లికేషన్స్ రూపొందించడం వంటివి కంప్యూటర్ సైన్స్ నిపుణులు చేస్తారు. ప్రస్తుతం ప్రతి రంగంలో కంప్యూటరీకరణ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో.. అవకాశాలు కోకొల్లలు. ఈ విభాగంలో అన్ని ఐఐటీల్లో అందుబాటులో ఉన్న మొత్తం సీట్ల సంఖ్య 923.
             
ఎలక్ట్రికల్.. ఎవర్‌గ్రీన్

ఆధునికీకరణ, మౌలికసదుపాయాల కల్పన, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంపు దిశగా తీసుకుంటున్న చర్యల కారణంగా.. కోర్ సెక్టార్‌లో క్రేజీ బ్రాంచ్‌గా నిలుస్తోంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఎన్నో రకాల విద్యుత్ ఉత్పత్తి మార్గాలు ప్రధానంగా అణు విద్యుత్ ఉత్పత్తి, సౌర విద్యుత్ ఉత్పత్తి, జల విద్యుత్ ఉత్పత్తిలో ఎలక్ట్రికల్ ఇంజనీర్లదే కీలక పాత్ర. కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాకుండా.. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తయారీలోనూ ఎలక్ట్రికల్ ఇంజనీర్ల ప్రమేయం ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవకాశాల పరంగానూ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎవర్‌గ్రీన్ బ్రాంచ్ అని పేర్కొనొచ్చు. అందుకే జేఈఈ అడ్వాన్స్‌డ్ టాపర్లలో రెండో ఛాయిస్‌గా ఈ బ్రాంచ్ నిలుస్తోంది. గత ఏడాది ఏడో ర్యాంకు అభ్యర్థి ఐఐటీ-బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ను ఎంచుకోవడమే ఇందుకు నిదర్శనంగా పేర్కొనొచ్చు. అదేవిధంగా ఇతర ఐఐటీల్లోనూ ఓపెనింగ్ ర్యాంకుల పరంగా తొలి వందలోపు ర్యాంకర్ల ఛాయిస్‌గా నిలిచింది ఎలక్ట్రికల్. ఇన్‌స్టిట్యూట్ పరంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌కు కూడా ఐఐటీ-బాంబేనే క్రేజీ క్యాంపస్. క్లోజింగ్ ర్యాంకులే ఇందుకు నిదర్శనం. మొత్తం ఐఐటీలు, ఐఎస్‌ఎం-ధన్‌బాద్‌లో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 1070.
 
మెకానికల్ ఇంజనీరింగ్
 
ఐఐటీల్లో ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంకుల ఆధారంగా గత నాలుగైదేళ్ల గణాంకాలను విశ్లేషిస్తే.. ర్యాంకర్ల మూడో ముఖ్య ఛాయిస్‌గా నిలుస్తున్న బ్రాంచ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచ్ విషయంలోనూ ఐఐటీ-బాంబేకే ర్యాంకర్ల ప్రాధాన్యం. గతేడాది ఈ క్యాంపస్‌లో ఓబీసీ మినహాయించి అన్ని కేటగిరీల్లోనూ 50లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులతో ఓపెనింగ్ ర్యాంకులు మొదలవగా.. క్లోజింగ్ ర్యాంకుల విషయంలోనూ ఐదొందల లోపు ర్యాంకులతో సీట్లు భర్తీ అయ్యాయి. దేశంలో ఉత్పత్తి రంగం, ఆర్ అండ్ డీ కార్యకలాపాల విస్తరణ, ఆటోమొబైల్-మెకానికల్ రంగాల వృద్ధి తదితర కారణాలతో ఉద్యోగావకాశాలు ఎక్కువ ఉండటంతో విద్యార్థు లు ఈ బ్రాంచ్‌ను ఎంచుకుంటున్నారు. మొత్తం అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 1125.

కెమికల్ ఇంజనీరింగ్

పదకొండు ఐఐటీలు, ఐఎస్‌ఎం-ధన్‌బాద్‌లలో 800 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్న కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ పట్ల కూడా టాప్ ర్యాంకర్స్ ఆసక్తి చూపుతున్నారు. గత రెండేళ్లుగా ఆయా ఐఐటీల్లోని ఓపెనింగ్ ర్యాంకుల కోణంలో పరిశీలిస్తే.. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ బ్రాంచ్‌ల తర్వాత స్థానంలో నిలుస్తున్న బ్రాంచ్ ఇది. పారిశ్రామిక అభివృద్ధి, వివిధ ఉత్పత్తుల తయారీ, అందులో కెమికల్ ఇంజనీర్ల ప్రమేయం తప్పనిసరైన నేపథ్యంలో అవకాశాల విషయంలోనూ ఢోకాలేని బ్రాంచ్.. కెమికల్ ఇంజనీరింగ్. ఫార్మాస్యూటికల్ సంస్థలు, డ్రగ్ ఫార్ములేషన్ విభాగాలు, ఇతర రసాయన పరిశోధన సంస్థల్లో కెమికల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులకు అవకాశాలు ఖాయం. ఐఐటీల వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఈ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు కంపెనీల దృష్టిలో హాట్‌కేక్‌లుగా నిలుస్తున్నారు. సగటున రూ. 20లక్షలకుపైగా వార్షిక వేతనం ఖరారవుతోంది.
             
సివిల్ ఇంజనీరింగ్
 
ఎన్నో ఏళ్లుగా ఐఐటీ బీటెక్ ఔత్సాహిక విద్యార్థులు ఆసక్తి చూపుతున్న మరో కోర్ బ్రాంచ్.. సివిల్ ఇంజనీరింగ్. పన్నెండు ఐఐటీలు, ఐఎస్‌ఎం-ధన్‌బాద్‌లో అందుబాటులో ఉన్న 891 సీట్ల కోసం పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. ఐఐటీ-బాంబేలో గతేడాది ఓపెన్ కేటగిరీలో 400 ర్యాంకుకు తొలి సీటు లభించగా.. ఇదే విభాగంలో క్లోజింగ్ ర్యాంకు 1688గా నమోదవడమే ఇందుకు నిదర్శనం. రిజర్వ్‌డ్ కేటగిరీల్లో ఇంతకంటే తక్కువ ర్యాంకులో ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంకులు ఉండటం గమనార్హం. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తుండటం, జాతీయ రహదారుల విస్తరణ, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం తదితర కారణాలతో సివిల్ ఇంజనీరింగ్ ఆకర్షణీయ బ్రాంచ్‌గా నిలుస్తోంది. అంతేకాకుండా సమీప భవిష్యత్తులో మరిన్ని అవకాశాలకు కేరాఫ్‌గా నిలవనుంది. ప్రధానంగా 12వ ప్రణాళిక కాలంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక కేటాయింపులు చేయడంతో పలు పథకాలు అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కోర్సులో చేరి.. నాలుగేళ్ల తర్వాత సర్టిఫికెట్ అందుకునే వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, వేతనాల విషయంలో ఎలాంటి ఢోకా లేదు. ప్రైవేటు సెక్టార్‌తోపాటు, వివిధ ప్రభుత్వ రంగ కంపెనీల్లోనూ సివిల్ ఇంజనీర్లకు అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
             
ఇంజనీరింగ్ ఫిజిక్స్
 
సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌ల సమ్మేళనంగా ఉండే ఇంజనీరింగ్ ఫిజిక్స్ బ్రాంచ్‌పై కూడా ర్యాంకర్లలో ఆసక్తి నెలకొంది. కేవలం ఆరు ఐఐటీ క్యాంపస్‌లు(బాంబే, హైదరాబాద్, గువహటి, చెన్నై, ఢిల్లీ, వారణాసి) మాత్రమే ఈ కోర్సును అందిస్తున్నాయి. మొత్తం 198 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అత్యధికంగా ఢిల్లీ ఐఐటీలో 63 సీట్లు ఉండగా.. అత్యల్పంగా హైదరాబాద్ ఐఐటీలో 10 సీట్లు లభిస్తున్నాయి. ఐఐటీ-వారణాసిలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సు అందుబాటులో ఉంది. భౌతిక శాస్త్ర సిద్ధాంతాలు, సూత్రాలు, భావనలు.. అదే విధంగా మ్యాథమెటికల్ న్యూమరిక్స్ ఆధారంగా ఇంజనీరింగ్ ఉత్పత్తుల ప్రక్రియకు సంబంధించి శిక్షణ కల్పించే ఈ కోర్సు సైన్స్ ఔత్సాహిక విద్యార్థులకు బాగా కలిసొస్తుంది. ఇంజనీరింగ్‌లో ఆర్ అండ్ డీ దిశగా లక్ష్యాలు ఏర్పరచుకున్న వారికి బాగా సరితూగే కోర్సు ఇంజనీరింగ్ ఫిజిక్స్ అని నిపుణుల అభిప్రాయం. కోర్సు పూర్తి చేసుకున్న వారికి ఇస్రో, బార్క్, డీఆర్‌డీఓ వంటి పరిశోధన సంస్థల్లో ఉపాధి గ్యారంటీ.
 
ఆసక్తి ఉంటేనే కెమికల్ ఇంజనీరింగ్

ఐఐటీల్లో ఏ బ్రాంచ్‌లో సీటు వచ్చినా బంగారు భవిష్యత్తు ఖాయం అనేది నిస్సందేహం. అయితే కొన్ని కోర్ బ్రాంచ్‌ల విషయంలో విద్యార్థుల ఆసక్తి మీదే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా అధికశాతం ఓర్పు, నేర్పుతో ప్రయోగశాలల్లో నిరంతర పరిశోధనల్లో గడపాల్సిన కెమికల్ ఇంజనీరింగ్‌లో ఇది ఎంతో ముఖ్యం. కాబట్టి జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదలయ్యాక విద్యార్థులు ఆన్‌లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ సమయంలో కోర్సు, క్యాంపస్ విషయంలో ఆచితూచి వ్యవహరించి ప్రాధమ్యాలు పేర్కొనాలి. ప్రస్తుతం ఐఐటీల్లో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు సగటున రూ. 15 నుంచి రూ. 20 లక్షల వరకు వార్షిక వేతనంతో క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు లభిస్తున్నాయి. అయితే కెమికల్ ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులు బీటెక్ సర్టిఫికెట్‌తోనే పరిమితం కాకుండా భవిష్యత్తులో మరిన్ని సమున్నత స్థానాలు సొంతం చేసుకోవాలి.
 - ప్రొఫెసర్‌॥వి.ఆర్. పెద్దిరెడ్డి, డీన్ (కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్), ఐఐటీ-భువనేశ్వర్
 
కొత్త ఐఐటీల్లో ముందంజలో హైదరాబాద్

కేంద్ర ప్రభుత్వం 2008లో ఏర్పాటు చేసిన కొత్త ఐఐటీల్లో.. ఇతర ఇన్‌స్టిట్యూట్‌లతో పోల్చితే ఐఐటీ-హైదరాబాద్ అకడెమిక్స్, రీసెర్చ్ అన్ని కోణాల్లో శరవేగంగా ముందుకు దూసుకుపోతోంది. పాత ఐఐటీలతో పోటీ పడుతోంది. అకడెమిక్స్ కోణంలో ఇంజనీరింగ్ ఫిజిక్స్ వంటి ప్యూర్ కోర్ బ్రాంచ్‌లను సైతం ప్రారంభించింది. అటు రీసెర్చ్ పరంగానూ పలు అంతర్జాతీయ ఇన్‌స్టిట్యూట్‌లు, పరిశ్రమలతో ఒప్పందాల ద్వారా స్పాన్సర్డ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం. అయితే ఐఐటీ ప్రవేశాల్లో ప్రత్యేకంగా స్థానిక కోటా అమలులో లేనందున ఇక్కడి విద్యార్థులు.. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో గతంలో లభించిన ర్యాంకుల ఆధారంగా ప్రాధమ్యాలను పేర్కొనడం మంచిది. ఒకసారి ఐఐటీలో అడుగుపెట్టిన విద్యార్థులు.. నిరంతర అభ్యసనం, అన్వేషణలతో ముందుకు కదిలితేనే మంచి భవిష్యత్తు
 లభిస్తుంది.
- ప్రొఫెసర్ ఫయాజ్ అహ్మద్ ఖాన్, డీన్, అకడెమిక్స్, ఐఐటీ-హైదరాబాద్
 
ఎన్నటికీ వన్నె తగ్గని కోర్ బ్రాంచ్‌లు

ఐఐటీ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులు ముందుగా గుర్తించాల్సింది కోర్ బ్రాంచ్‌ల ప్రాధాన్యం. నేటి పోటీ ప్రపంచంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఎన్నో కొత్త బ్రాంచ్‌లు రూపొందుతున్నప్పటికీ.. వాటికి మూలం కోర్ బ్రాంచ్‌ల నుంచే మొదలవుతుంది. కాబట్టి విద్యార్థులు.. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ తదితర కోర్ బ్రాంచ్‌లవైపు మొగ్గు చూపితే భవిష్యత్తులో.. వారి ఆసక్తికి అనుగుణంగా అనుబంధ స్పెషలైజేషన్లలో పీజీ, పీహెచ్‌డీలు చేసే అవకాశాలు ఉన్నాయి. పదివేల లోపులోనే ఉండే సీట్ల ఎంపిక క్రమంలో.. ఆన్‌లైన్ ఛాయిస్ ఫిల్లింగ్‌లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అభ్యర్థులు తమకు నచ్చిన ఇన్‌స్టిట్యూట్, బ్రాంచ్‌లకు గతంలోని చివరి ర్యాంకులను పరిశీలించి వాటిని తమ ప్రస్తుత ర్యాంకుతో బేరీజు వేసుకుని ఆన్‌లైన్ ఛాయిస్ ఫిల్లింగ్‌కు ఉపక్రమించాలి. ప్రాధమ్యాల ఎంపిక విషయంలో ఎలాంటి పరిమితులు లేనందున దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.
 - ప్రొఫెసర్‌॥అశోక్ ఝున్‌ఝున్‌వాలా ప్రొఫెసర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (ఐఐటీ-మద్రాస్), ఐఐఐటీ-హైదరాబాద్
 గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు.

 
 
విభిన్న దృక్పథంతో అడుగు పెట్టాలి

ఐఐటీల్లో ప్రవేశించాలనుకునే విద్యార్థులు ఇప్పటి నుంచే తమ ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలి. ఇప్పటి వరకు స్పూన్ ఫీడింగ్ ద్వారా అకడెమిక్స్‌ను ఔపోసన పట్టిన విద్యార్థులు.. ఐఐటీల్లో చేరాక స్వీయ అభ్యసనం, రెగ్యులర్ నాలెడ్జ్ అప్‌డేషన్ చేసుకుంటూ ముందుకు సాగితేనే సంబంధిత బ్రాంచ్‌పై పట్టు లభిస్తుంది. అంతేకాకుండా విభిన్న సంస్కృతుల నుంచి వచ్చే సహచర విద్యార్థులతో, అదే విధంగా ఫ్యాకల్టీ సభ్యులతో మమేకమయ్యేలా తమను తాము తీర్చిదిద్దుకోవాలి. ఐఐటీల్లో నియమ నిబంధనలు.. తొలినాళ్లలో తాజా విద్యార్థులను కొంత ఆందోళనకు గురి చేస్తాయి. కానీ వాటికి భయపడకూడదు. తాము ఐఐటీలో చేరిన లక్ష్యాన్ని నిరంతరం స్ఫురించుకుంటే ఎన్ని సవాళ్లు ఎదురైనా ఇట్టే అధిగమించి.. అద్భుత ఫలితాలు సాధించొచ్చు.
- ప్రొఫెసర్‌॥వి. రాజ్‌కుమార్, వైస్ చాన్స్‌లర్-ఆర్‌జీయూకేటీ (మాజీ డీన్ అకడెమిక్ అఫైర్స్- ఐఐటీ ఖరగ్‌పూర్)
 
బ్రాంచ్ ఏదైనా.. బాంబేకే ప్రాధాన్యం

గత కొన్నేళ్లుగా ఐఐటీ ర్యాంకర్లలో అధికశాతం విద్యార్థులు ఆసక్తి చూపుతున్న ఇన్‌స్టిట్యూట్ ఐఐటీ-బాంబే. బీటెక్‌లో ఏ బ్రాంచ్ అయినప్పటికీ మెజారిటీ విద్యార్థుల ఓటు బాంబేకే ఉంటోంది. ఇందుకు ఎన్నో కారణాలు. ఇక్కడ పాటిస్తున్న అకడెమిక్ ప్రమాణాలు, నిరంతర ఆర్ అండ్ డీ, గ్రాడ్యుయేట్ స్థాయి నుంచే రీసెర్చ్ ఓరియెంటేషన్ బోధన, పలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాల ద్వారా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందడమే ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొనొచ్చు. అంతేకాకుండా ఇక్కడ చేరే ప్రతిభావంతులైన విద్యార్థులకు పూర్వ విద్యార్థుల నుంచి ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా లభిస్తున్నాయి. ఈ క్రమంలో ఐఐటీ బాంబే హెరిటేజ్ ఫౌండేషన్ పేరుతో ఎన్నో రకాల స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నారు. ఇలా.. ఆర్థిక ప్రోత్సాహకాలు.. అకడెమిక్స్‌లో నాణ్యతలే ఐఐటీ-బాంబేపై మెజారిటీ విద్యార్థుల ఆసక్తికి కారణం.
- ప్రొఫెసర్‌॥కె.వి. కృష్ణారావు, సివిల్ ఇంజనీరింగ్, ఐఐటీ-ముంబై
 

మరిన్ని వార్తలు