బ్రహ్మ చేసిన బొమ్మ

5 Mar, 2017 00:45 IST|Sakshi
బ్రహ్మ చేసిన బొమ్మ

ధర్మసోపానం

మూడు లోకాలుగా, మూడు కాలాలుగా, మూడు మూర్తులుగా కనబడేవాడు పరమశివుడు. ఆయన శివ స్వరూపుడు. శివ అంటే మంగళం, శోభనం, శుభం. అటువంటి మంగళములు చేసేవాడికి సదాశివ’ అనిపేరు. ‘అమంగళం’ చేయడం ఆయనకు తెలియదు. కారణం– ఆయన తండ్రి కనుక. ఆ పరమ శివుడు, ఆ బ్రహ్మ, ఆ విష్ణువు ఈ ముగ్గురు మూర్తులు ఈ లోకంలో ఎవరిగా ఉన్నారు? కంటితో చూడడానికి వీలయిన రూపంలో ఎక్కడ తిరుగుతున్నారో ఎలా గుర్తుపట్టడం ? ’నమశ్శంకరాయచ, మయస్కరాయచ’ అంది వేదం. శంరాయచ అంటే తండ్రి. శం కరోతీతి శంకరః – ’శం’ అంటే సుఖం,

తండ్రి ఈ లోకంలో చేసే అద్భుత కార్యం–తన కడుపున పుట్టిన బిడ్డ సుఖం కోసం అహరహం శ్రమించడం. తనకోసంగా తాను ఫలానా దానిని పొందాలన్న కోర్కె ఏదీ ఉండదు. అది తనబిడ్డ పొందితే చాలు. పరమానందాన్ని పొందుతాడు. ’కొడుకుకు లేకపోయినా ఫరవాలేదు, పాడయినా ఫరవాలేదు, నేను మాత్రం సుఖం అనుభవించాలి’ అన్న కోర్కె ఎందుకుండదంటే– పరమేశ్వరుని కారుణ్యమెటువంటిదో తండ్రి దయ అటువంటిది. ఈశ్వరుడు ఎందుకు దయతో ఉంటాడంటే దానికి కారణమేదీ ఉండదు. అందుకే నిర్హేతుక కృపాపాత్రులం–అంటూ ఉంటారు. ఏ కారణం లేకుండా ఆయన దయను వర్షిస్తుంటాడు. కన్నతండ్రికూడా అంతే.

చతుర్ముఖ స్వరూపంలో ఉన్న పరమాత్మ మనకు భువనము, భోగము, తనువు, కరణము అనే నాలుగింటిని అనుగ్రహిస్తుంటాడు. అవి లేకపోతే మన కర్మలను పోగొట్టుకోవడం సాధ్యం కాదు. గత జన్మలో చేసుకున్న పాపాలు కానీ, పుణ్యాలు కానీ సుఖదుఃఖాల రూపంలో అనుభవించనంతకాలం, కర్మల శేషం పోనంత కాలం, మోక్షమన్న మాట ఉండదు. అందుకే చిత్తశుద్ధిని కోరుకుంటారు. చింతపండు, ఉప్పు, పసుపు పెట్టి పాత్రలు తోమితే పాత్ర తళతళా మెరుస్తుంది. ఆ మెరుపు కొత్తగా వచ్చింది కాదు, పాత్రకున్న మెరుపుకు అడ్డుపడిన చిలుము తొలగిపోవడంవల్ల పాత్ర యథాస్థితిలో భాసించింది. నేను ఆత్మకాదు, నేను శరీరం–అనే అవివేకం అనేది మనల్నిపట్టి ఉన్న చిలుము. అదిపోవాలంటే మనం ఈశ్వరార్పణం కావాలి. దానితో ప్రీతిపొందిన ఈశ్వరుడు చిత్తశుద్ధిని ప్రసాదిస్తాడు. అప్పుడు ఉన్నది ఉన్నట్లు భాసిస్తుంది. అలా చిత్తశుద్ధిపొందే అవకాశం ఒక్క మనుష్యజన్మకే ఉంది.

ఈ మనుష్య జన్మలో భగవన్నామ స్మరణతో ఆ చిలుము తొలగిపోవడానికి ఉపకరించేది శరీరం. భగవన్నామం పలుకగలిగిన శరీరం, భక్తిని పొందడానికి, శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి అనువైన శరీరం, గురు సేవ చేయడానికి అవకాశమిచ్చే శరీరం ఒక్క మనుష్య శరీరం మాత్రమే. అటువంటి ‘శరీరాన్ని ఇవ్వడానికి సాక్షాత్‌ బ్రహ్మరూపంలో తండ్రే దానికి తగిన వ్యూహాన్ని అందిస్తాడు. ఆ వ్యూహం ఆచరణలో తండ్రి హృదయం నుంచి చైతన్యంగా మారి, దాని ఫలితంగా తేజస్సు జారితే కుమారుడిగా జన్మిస్తాడు’ అని వేదవాక్కు. అందుకే ‘ఆత్మవైపుత్ర నామాసి’. హృదయంనుండి జారిన బిందువు కనుక కొడుకు తన రూపమై లోకంలో తన బొమ్మగా, తన ప్రతిబింబంగా తిరుగుతుంటాడు. అందుకే తండ్రికి అత్యంత సంతోషాన్ని కలుగచేసేది, ఎక్కడలేని తృప్తినిచ్చేది ఏది? అంటే పుత్రగాత్ర పరిష్వంగం. కొడుకు శరీరాన్ని అలా కౌగిలించుకుంటే చాలు. తండ్రికి ఎంతో ఉపశాంతి కలుగుతుంది.
 బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

మరిన్ని వార్తలు