సమ్మర్‌కే కాదు నిమ్మ

3 Jun, 2018 23:52 IST|Sakshi

శరీరానికి రోగనిరోధక శక్తిని సమకూర్చేది విటమిన్‌–సి అని అందరికీ తెలిసిందే. అది నిమ్మలో పుష్కలం. అంటే.. నిమ్మ అనేది రోగనిరోధక శక్తికి పర్యాయపదమని అనుకోవచ్చు. వేసవిలోనే నిమ్మ అవసరం ఎక్కువ అనుకుంటాం. కానీ కాదు. ప్రతి సీజన్‌కూ అవసరమే.

నిమ్మలో కేవలం విటమిన్‌–సి మాత్రమే కాకుండా.. విటమిన్‌ ఏ, ఈ లతో పాటు ఫోలేట్, నియాసిన్, థయామిన్, రైబోఫ్లేవిన్‌ కూడా ఉంటాయి. వీటన్నింటి సమాహారం కావడంతోనే నిమ్మలో వ్యాధినిరోధక శక్తి కలగజేసే అన్ని అంశాలూ ఉన్నాయి. ఆరోగ్యానికి నిమ్మతో ఒనగూరే ప్రయోజనాల్లో కొన్నివి.

నిమ్మ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అందుకే మంచి జీర్ణశక్తి కోరుకునేవారు ఉదయం పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని కలుపుకొని, కాస్తంత తేనె లేదా ఉప్పుతో తాగుతుంటారు. ఈ విధానం బరువు నియంత్రణకూ దోహదపడుతుంది.
నిమ్మనీరు తాగాక నోరంతా ఫ్రెష్‌ అయినట్లుగా ఒక తాజా భావన కలుగుతుంది. నిమ్మ కొన్ని పంటినొప్పుల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా, చిగుర్ల వ్యాధులనూ నివారిస్తుంది.
 జుట్టు పెరుగుదలకు నిమ్మ బాగా తోడ్పడుతుంది. నిమ్మతో వెంట్రుకలకు స్వాభావికమైన మెరుపు వస్తుంది.
మేని నిగారింపునకూ నిమ్మ బాగా దోహదం చేస్తుంది. ఇందులోని విటమిన్‌–సి కారణంగా ఏజింగ్‌ ప్రక్రియ ఆలస్యంగా జరగడంతో పాటు చర్మానికి మంచి బిగుతూ, మెరుపూ సమకూరుతాయి. మొటిమలు, ఎగ్జిమా వంటి చర్మ సమస్యలనూ నిమ్మ నివారిస్తుంది.
 నిమ్మలోని యాంటీసెప్టిక్‌ గుణాలు ఉన్నాయి. అందువల్ల గాయాలు త్వరగా తగ్గుతాయి.
నిమ్మలోని రక్తాన్ని పలచబార్చకుండా ఉండే గుణం కారణంగా అది అంతర్గత రక్తస్రావం అయ్యే ప్రమాదాలను నివారిస్తుంది. ఈ గుణం కారణంగానే.. ముక్కు నుంచి రక్తస్రావం అయ్యే వారికి నిమ్మకాయ వాసన చూపిస్తారు.
ఆస్తమా మొదలుకొని అనేక శ్వాసకోశ వ్యాధులను నివారిస్తుంది. శ్వాసవ్యవస్థలోని  ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

మరిన్ని వార్తలు