హైడ్రోజెల్‌తోనూ ఇమ్యునో థెరపీ.. 

13 Mar, 2018 00:32 IST|Sakshi

ప్రాణాంతకమైన కేన్సర్‌ వ్యాధికి మెరుగైన చికిత్స కనుక్కునే ప్రయత్నాల్లో రైస్‌ యూనివర్శిటీ, టెక్సాస్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కీలకమైన ముందడుగు వేశారు. మందును దీర్ఘకాలంపాటు నెమ్మదిగా విడుదల చేస్తూ కణుతులు పూర్తిగా నాశనయమ్యేలా చేయగల సరికొత్త హైడ్రోజెల్‌ను వీరు అభివృద్ధి చేశారు. రోగ నిరోధక వ్యవస్థను కాపాడే టీ– కణాలను కేన్సర్‌పై దాడికి ఉపయోగించడాన్ని ఇమ్యునో థెరపీ అంటారని.. ఇటీవలి కాలంలో ఈ పద్ధతి మంచి ఫలితాలు సాధిస్తున్నదనీ మనందరికీ తెలుసు. అయితే దీంతోనూ కొన్ని ఇబ్బందులు లేకపోలేదు.

ఇంజెక్షన్ల రూపంలో అందించే మందులు శరీరం మొత్తం వ్యాపిస్తూంటాయి. ఈ క్రమంలో కేన్సర్‌ కణితి వద్దకు వచ్చేసరికి  వీటి ప్రభావం తక్కువైపోతూంటుంది. రైస్, టెక్సాస్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన హైడ్రోజెల్‌ను నేరుగా కణితి ఉన్న ప్రాంతంలోకే పంపిస్తారు కాబట్టి.. అది అక్కడే ఉండటంతో పాటు మందులను కూడా చాలా నెమ్మదిగా విడుదల చేస్తూ కేన్సర్‌ కణాలు చచ్చిపోయేందుకు దోహదపడుతుంది. ఈ హైడ్రోజెల్‌ను ఎలుకలపై ప్రయోగించినప్పుడు అవి ఎక్కువ కాలం జీవించడంతోపాటు కొత్తగా ప్రవేశపెట్టిన కేన్సర్‌ కణాలను కూడా చంపేయగలిగాయని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త జెఫ్రీ హార్ట్‌గెరింక్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు