బ్యాంకువారు పత్రాలు పోగొడితే..?

9 Aug, 2015 22:40 IST|Sakshi
బ్యాంకువారు పత్రాలు పోగొడితే..?

వికటిస్తే విరుగుడు
 
మధ్య తరగతి కల సొంతిల్లు. జీవితమంతా పైసా పైసా కూడబెట్టి ఇంటికోసమే ఖర్చు చేస్తారు. సరిపోలేదంటే ఇంటి పత్రాలు పెట్టి మరీ బ్యాంకులో లోను తీసుకుంటారు. లోను తీర్చేశాక ఆ పత్రాలు తిరిగి తీసుకుంటారు. అలాంటిది... లోను మొత్తం తీరాక, బ్యాంకువారు ఇంటి పత్రాలు తమ దగ్గర లేవని సమాధానం ఇస్తే ఏంటి పరిస్థితి?! హైదరాబాద్ కర్మన్‌ఘట్‌కు చెందిన విశ్రాంత ఆచార్యులు కె.బాల్‌రెడ్డికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. అప్పుడు ఆయన ఏం చేశారు? ఆయన మాటల్లోనే...

‘‘ఉద్యోగిగా ఉన్న సమయంలోనే హైదరాబాద్‌లోని ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌లో లోను తీసుకొని ఇల్లు నిర్మించుకున్నాను. 2008లో ఉద్యోగవిరమణ చేయగా ఆ సమయంలో వచ్చిన ప్రావిడెంట్ ఫండ్.. ఇతరత్రా కలిపి వచ్చిన డబ్బుతో బ్యాంకు లోను తీర్చాను. ‘లోను తీరింది, ఇంటి పత్రాలు ఇవ్వమ’ని బ్యాంకువారిని కోరాను.

 బ్యాంకులో పత్రాలు పోయాయి!
 బ్యాంకు వాళ్లు మూడు నెలలు టైమ్ అడిగారు. గడువు తర్వాత అడిగితే ‘బ్యాంక్ వేరే బిల్డింగ్‌లోకి మారుస్తున్నాం. అది పూర్తయిన తర్వాత ఇస్తాం’ అన్నారు. ఆ తర్వాత అడిగితే... ‘కొత్త బిల్డింగ్ కదా! అంతా మార్చే పనిలో ఉన్నాం, ఇంకొన్నాళ్లు ఆగండి’ అని బతిమాలారు. ఆ గడువు కూడా అయిపోయింది. పత్రాలు మాత్రం ఇవ్వలేదు. కోపం వచ్చి, ‘లాయర్ ద్వారా నోటీస్ ఇస్తాను’ అన్నాను. మరి కొన్ని రోజులు బతిమాలి గడిపేశారు. అలా ఏడాది గడచిపోయింది. చివరికి ‘మీ ఇష్టం సార్, ఏమైనా చేయండి. డాక్యుమెంట్స్ కనపడటం లేదు’ అన్నారు. నిర్ఘాంత పోయాను. అవసరం పడి ఇల్లు అమ్ముదామంటే, ‘రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి అప్రూవ్‌డ్ కాపీ తీసుకోవచ్చు’ అని సలహా ఒకటి ఇచ్చారు. అసలు పత్రాలు లేకపోతే స్థిరాస్తి విలువ 15 శాతం తక్కువ ధరకు పడిపోతుంది. ఆ విధంగా చూస్తే కోటి రూపాయల విలువైన ఆస్తికి 15-20 లక్షల రూపాయలు వదులుకోవాలి. ఆ నష్టాన్ని ఎవరు భరించాలి?! లాయర్ ద్వారా బ్యాంక్‌కు నోటీస్ పంపించాను. మూడు నెలల వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు.

దాంతో, జిల్లా కన్జ్యూమర్ కోర్ట్‌లో కేసు ఫైల్ చేశాను. జిల్లా కోర్టులో 2 ఏళ్ల సమయం పట్టింది. ప్రభుత్వ స్టాంప్ డ్యూటీ యాక్ట్ కింద రూ.7 లక్షల 45 వేల రూపాయలు పరిహారం చెల్లించాలి అని కోర్టు బ్యాంక్ వారిని ఆదేశించింది. ప్రభుత్వ రేటు వేరు, మార్కెట్ రేటు వేరు. అందుకే సరైన న్యాయం కోసం స్టేట్ కన్జ్యూమర్ కోర్టుకు వెళ్లాను. అక్కడ మరో రెండేళ్లు పట్టింది. జిల్లా కోర్టు ఇచ్చిందానికి కలిపి మరో 3 లక్షల నష్టపరిహారం ఇవ్వమని బ్యాంకును ఆదేశించింది. అంత మొత్తం చెల్లించడం ఇష్టం లేక బ్యాంక్ ఢిల్లీలోని జాతీయ వినియోగదారుల ఫోరమ్‌కు వెళ్లింది. స్టేట్ కన్జ్యూమర్ వారిని అడుగుదామంటే అప్పటికే రాష్ట్రవిభజన జరిగింది. కొత్త చైర్మన్ వస్తే తప్ప ఏమీ చెప్పలేమన్నారు. ప్రతివాదిని కాబట్టి ఢిల్లీ వెళ్లి లాయర్ ద్వారా అప్పీల్ చేద్దాం అనుకున్నాను. కానీ, అప్పటికే రూ.50 వేల దాకా ఖర్చు అయ్యింది. ఢిల్లీ వెళితే కనీసం మరో 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది, అంతేకాకుండా మరో రెండేళ్ల టైమ్ పడుతుంది అన్నారు. ఇప్పటికే ఆరేళ్లు పట్టింది. ఇంకా సమయం అంటే.. అందుకే ఆగిపోయాను.

 ఫోరం నా వైపు నిలిచింది
 నేను వెళ్లకపోయినా బ్యాంక్ ఆ సొమ్మును ఇవ్వడం ఇష్టం లేక, నేషనల్ కోర్టుకు వెళ్లింది. జిల్లా కోర్టు, స్టేట్ కోర్టులో కేసు విధానాన్ని పరిశీలించిన జాతీయ కమిషన్ ఇటీవలే బ్యాంక్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇస్తూ తప్పనిసరిగా పరిహారం చెల్లించాల్సిందే అని ఆదేశించింది. అంతేకాదు, బ్యాంకు నిర్లక్ష్యాన్నీ తప్పు పట్టింది. ఇందుకు నేను చాలా ఆనందించాను. ఏ రకంగా చూసినా బ్యాంకుదే తప్పు.  ఈ ఆరేళ్లలో ఏమీ అవసరం పడలేదు కాబట్టి ఇల్లు అమ్ముకోలేదు. అదే బిడ్డ పెళ్లి ఉందనో, అనారోగ్యం కారణంగానో డబ్బులు అవసరంపడి ఇల్లు అమ్మాల్సిన పరిస్థితి వస్తే... కేవలం అప్రూవ్‌డ్ కాపీ ఇస్తే బ్యాంకులు లోను ఇస్తాయా?! అందుకే ఇలాంటి సమస్య ఎదురైతే ఏం చేస్తాం అని సరిపెట్టుకోకుండా, తగిన న్యాయం కోసం వినియోగదారుల ఫోరమ్‌ని ఆశ్రయిస్తే తప్పక ఫలితం లభిస్తుంది. కాకపోతే కోర్టులు తీర్పులను వేగవంతంగా ఇస్తే వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి.’’
 
 

మరిన్ని వార్తలు