ఆచరణలో కనిపించేదే  ఆసలు విశ్వాసం!!

14 Jan, 2018 00:33 IST|Sakshi

సువార్త

‘కనిపించడు కాని మా వాడు భలే భక్తిపరుడు తెలుసా?’ లాంటి వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. పైకి పొంగిపోతున్నట్టుండే భక్తితో సమస్యలేమో కాని, నిజమైన భక్తి విశ్వాసికి జీవితంలో కనిపించి తీరాలి. బబులోను చెరలో మగ్గుతున్నా తమ దేవుణ్ణి, దేవుని విధి విధానాలను మర్చిపోలేని భక్తి యూదులది, ముఖ్యంగా దానియేలు, అతని ముగ్గురు స్నేహితులది. వారి అచంచలమైన భక్తిశ్రద్ధలు చూసి అసూయపడ్డ శత్రువులు ఎలాగైనా వారిని నాశనం చేయడానికి కుట్రపన్నారు. యూదులు పరలోకమందున్న దేవునికి తప్ప మరొకరికి సాగిలపడరు. అందువల్ల బబులోను సామ్రాజ్యంలోని ప్రజలు, ప్రముఖులెవరూ ముప్ఫైరోజులపాటు చక్రవర్తి దర్యావేషుకు తప్ప మరే వ్యక్తికైనా సాగిలపడరాదని, విన్నపాలు సమర్చించరాదని ఒక శాససం చేశాడు. ఎంతో తెలివైనవాడిగా ప్రసిద్ధి పొందిన దానియేలును అప్పటికే చక్రవర్తి తన సంస్థానంలో అత్యున్నత స్థానంలో నియమించాడు. అదీ వారి అసూయకు ప్రధాన కారణం. ఇలాంటి శాసనం గురించి తెలిసి కూడా దానియేలు రోజుకు మూడుసార్లు యథాప్రకారం దేవుని ప్రార్థించాడు. శాసనోల్లంఘనకుగాను రాజుగారికిష్టం లేకున్నా శిక్షగా దానియేలును సింహాలున్న గుహలో పడదోశారు. కాని దానియేలును దేవుడు సింహాల గుహలో కూడా క్షేమంగా కాపాడుతాడని నమ్మకమున్న చక్రవర్తి మరునాడే అక్కడికెళ్లి ‘నిత్యమూ నీవు సేవిస్తున్న జీవము కలిగిన నీ దేవుడు నిన్ను రక్షించాడా?’ అని అడిగితే, ‘అవును రాజా: నన్ను రక్షించాడని దానియేలు జవాబిచ్చాడు. చక్రవర్తి వెంటనే అతన్ని బయటకి రప్పించి, అతని మీద కుట్ర చేసిన వారందరినీ సింహాల గుహలో వేశాడు. 

మేము రహస్య విశ్వాలసుమంటారు కొందరు. ‘రహస్యభక్తి’ అనేది క్రైస్తవమే కాదు. క్రైస్తవ సుగుణమైన సాహసం, క్షమాపణ, ప్రేమ, పేదలు నిరాశ్రయుల పక్షంగా పోరాడేందుకు తెగింపు సమాజానికి వారి జీవితాల్లో కొట్టవచ్చినట్లు కనిపించాలి. ఉద్యమాలు, విప్లవాలు క్రైస్తవ విధానం కాదు. కాని దేవుని పక్షంగా నిరుపేదలు, నిర్భాగ్యుల కోసం నిలబడేందుకు విప్లవాలు తేవాల్సిన అవసరం లేదు. దాన్ని ప్రతి క్రైస్తవుడూ తన వ్యక్తిగత కుటుంబ బాధ్యతగా చేపట్టాలి. అలాంటి నిస్వార్థసేవే క్రైస్తవాన్ని ఒక విశిష్టమైన జీవన విధానంగా తీర్చిదిద్దింది. నిస్వార్థమైన త్యాగపూరితమైన సేవ క్రైస్తవానికి పర్యాయపదంగా నిలబెట్టింది.   

మరిన్ని వార్తలు