టొమాటో మాటున ఆరోగ్యం

22 Feb, 2020 05:22 IST|Sakshi

ప్రాచీన భారతదేశీయ వైద్యమైన ఆయుర్వేదంలో టొమాటో ప్రస్తావన లేదు. ఇది మన దేశపు పంట కాకపోవటమే ఇందుకు కారణం. మౌలికంగా ఇది అమెరికా సీమకు చెందినది. క్రీ.శ. 7వ శతాబ్దంలో పెరూ, చిలీ, బొలీవియా దేశాలలో ఈ పంట ప్రారంభమైంది. అనంతరం 16వ శతాబ్దం లో ఐరోపా వాసులకు పరిచయమైంది. తదనంతరం పోర్చుగీసు వారి ద్వారా  భారతదేశానికి సంక్రమించింది. ఈ పండు ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఈ రక్త వర్ణానికి భయపడి ప్రారంభదశలో దీనిని విషతుల్యంగా భావించి తినేవారు కాదు. క్రమేణా దీని రుచిని, ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదించటం మొదలైంది. వాస్తవానికి ఈ చెట్టు కాండంలోనూ, ఆకులలోనూ ఉండే సొలానిన్‌ అనే పదార్థం దుర్గుణాలను కలిగి ఉంటుంది. అందుకే ఏ జంతువూ ఈ చెట్ల జోలికి పోదు. దీంట్లో ప్రధానంగా పులుపు, తీపి రుచులు ఉంటాయి. కొద్దిగా లవణ రసం (ఉప్పగా) కూడా ఉంటుంది. కనుక ఏ కూరగాయలతో దీనిని కలిపి వండినా, పచ్చిగా సేవించినా వాటి రుచి మరింత పెరుగుతుంది. వాతహరంగా ఉపకరిస్తుంది.

ఆధునికశాస్త్రరీత్యా పోషక విలువలు
సుమారుగా ఒక కప్పు (150 గ్రా.) టొమాటో పండ్లలోని పోషక విలువల శాతాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. 
క్యాలరీలు (శక్తి) 1%, పిండి పదార్థాలు 2%, ఆహారపు పీచు 7%, శర్కర 2.8%, ఒమేగా త్రీ ఫాటీ యాసిడ్స్‌ 3%. 
విటమిన్‌లు
ఎ – 25%, సి – 32%, ఇ – 4%, కె –15%, బీ కాంప్లెక్సు – సరాసరి 4%
ఖనిజ లవణాలు (మినరల్స్‌)
క్యాల్షియం– 1%, ఐరన్‌ – 4%, మెగ్నీషియం – 4%, ఫాస్ఫరస్‌ – 4% జింక్‌ – 2%, కాపర్‌ – 4%, మాంగనీసు – 8%, పొటాషియం–10%. లైకోపిన్, ల్యూటిన్, బీటాకొరెటిన్‌ సమృద్ధిగా ఉంటాయి.
ఉండనివి (శూన్యం) 
కొలెస్టరాల్, స్టార్చ్, సోడియం, సెలీనియం (విషం), విటమిన్‌ డి అండ్‌ బి12.
ప్రయోజనాలు:
వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. చర్మకాంతి, కంటి చూపు మెరుగుపడతాయి. కేశాలు దృఢంగా పెరుగుతాయి. గుండెకు బలం, కండరాల శక్తి పెరుగుతాయి. అధిక రక్త్తపీడనం (అధిక బీపీ) అదుపులోకి వస్తుంది. యాంటీ ఆక్సిడెంట్‌ గుణం కలిగి రోగాలను దరిచేరనీయదు. బరువు తగ్గేవారికి ఇదిమంచి ఆహారం. శరీరానికి నీటి శాతం పుష్కలంగా అందుతుంది. క్యాబేజీ కుటుంబానికి చెందిన బ్రొకోలీతో టొమాటోను కలిపి తింటే ప్రొస్టేట్‌ క్యాన్సర్, పాంక్రియాసిస్‌ క్యాన్సర్లు తగ్గుతాయని ఇటీవలి పరిశోధనలు వెల్లడి చేస్తున్నాయి. 
గమనిక: దీంట్లో పొటాషియం అధికంగా ఉంటుంది కనుక ‘మూత్రపిండాలలో రాళ్లు’ వ్యాధిగ్రస్తులు దీనిని సేవించరాదు.

మరిన్ని వార్తలు