దిక్పాలకుల గురించిన విశేష సమాచారం

24 Sep, 2017 00:17 IST|Sakshi

సత్‌గ్రంథం

మనం ఏ నోము నోచుకున్నా, ఏ వ్రతం చేయాలనుకున్నా ముందుగా గణపతికి, తర్వాత నవగ్రహాలకు, ఆ తర్వాత అష్టదిక్పాలకులకూ పూజ చేసిన తర్వాతనే అసలు దైవాన్ని పూజిస్తాం. అయితే దిక్కులు ఎన్ని? అంటే దిక్కులు చూసే రోజులివి. మూలలు ఏమిటి? అంటే మూలమూలలు వెతికే కాలమిది. ఏ మూల ఎటుంటుంది అంటే పెద్దలు కూడా సరిగ్గా చెప్పలేక గుటకలు మింగే పరిస్థితులివి. ఇటువంటి గడ్డు కాలంలో ‘అష్టదిక్పాలక వైభవం’ అంటూ మనస్విని– ఆత్రేయ పురస్కార గ్రహీత వక్కంతం సూర్యనారాయణరావ్‌ ఏకంగా ఒక గ్రంథాన్నే రచించారు. ఒక వారపత్రికలో ధారావాహికగా వెలువడ్డ ‘అష్టదిక్పాలకవైభవం’ ఎంతో ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగిన రచన. ఇంద్రుడు తూర్పుదిక్కుకు అధిపతి. యముడు దక్షిణ దిక్కుకు, ఉత్తరదిక్కుకు కుబేరుడు అధిపతి. పడమరకు వరుణుడు అధినేత.

అలాగే నాలుగు మూలలకూ నలుగురు అధిపతులున్నారు. వారెవరు? వారి తల్లిదండ్రులెవరు? సతీసుతులెవరు? ఆయా దిక్కులకు, మూలలకు వారు ఏవిధంగా అధిపతులయ్యారు? వారిని పూజిస్తే కలిగే ఫలితాలేమిటి? పూజించకపోతే తలెత్తే ఇబ్బందులేమిటి.. వంటి అంశాలన్నింటినీ ఎంతో సాకల్యంగా... సోదాహరణంగా వివరించిన ఈ పొత్తం ప్రతి ఇంటా ఉండవలసినది. గతంలో నవగ్రహ పురాణమనే అద్భుత గ్రంథాన్ని అందించిన వక్కంతం వారు ఇప్పుడు ఈ పుస్తకాన్ని కూడా అంతే అలవోకగా రచించారు. అక్కడక్కడా అక్షరదోషాలను మినహాయిస్తే తప్పక చదవ వలసిన పుస్తకం.  ఖరీదు కాస్త ఎక్కువే అనిపించినప్పటికీ, చదివిన తర్వాత మాత్రం, ‘మరేం ఫర్వాలేదు, ఇంత మంచి పుస్తకానికి ఆ మాత్రం ఫర్వాలే’దనిపిస్తుంది.

అష్టదిక్పాలక వైభవం
రచన: వక్కంతం సూర్యనారాయణరావ్‌
పుటలు: 450; వెల రూ. 395
ప్రతులకు: ప్రిజం బుక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌; 1–1–728/ఎ,
స్ట్రీట్‌ నంబర్‌ 10, గాంధీనగర్, హైదరాబాద్‌– 80.
ఫోన్‌: 04027612928

మరిన్ని వార్తలు